ఇది మోసం, దగాల ‘కలనేత’ | Handloom Weavers' Struggle for Survival | Sakshi
Sakshi News home page

ఇది మోసం, దగాల ‘కలనేత’

Published Fri, Jan 17 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

ఇది మోసం, దగాల ‘కలనేత’

ఇది మోసం, దగాల ‘కలనేత’

దేశంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తితో పోటీ పడుతూ, దాదాపు 13 శాతం జాతీయ అవసరాలను తీరుస్తున్నది. ఇంత చేనేత ఉత్పత్తి ప్రపంచంలో ఎక్కడాలేదు. చేనేత శ్రామిక కుటుంబాల నిబద్ధత, త్యాగం, నైపుణ్యం, చేనేతను ప్రేమించే వినియోగదారుల కొనుగోలు శక్తి ఈ పోటీని సాధ్యం చేస్తున్నాయి.
 
 ‘అంచు డాబే కానీ, పంచె డాబు లేదు’ అని సామెత. చేనేత మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను పరిశీ లిస్తే ఇదే అనిపిస్తుంది.  పైపై మెరుగులు, ఆధునిక జౌళి రంగాన్ని సంతృప్తి పరచడం కోసం ఈ పనిని కేంద్రం దొడ్డితోవనైనా సాధించాలని చూస్తోం ది. ‘సాలెల మగ్గా’నికి కొత్త నిర్వచనం ఇచ్చే మహత్కార్యం నిర్వర్తించడానికి మే 2, 2013న కేంద్రం ఒక సంఘాన్ని నియమించింది. ఇందులో చేనేతరంగ ప్రతినిధులకు చోటివ్వలేదు. పవర్ లూమ్ రంగానికి చెందిన కొందరిని సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ అంతరంగం ఏమిటో ఈ చర్యే చెబుతోందని అసలు నేతన్నలు మథనపడుతున్నారు.  
 
 సంఘం ఎందుకు?
 చేనేత ఉత్పత్తులలో కొన్నింటిని యాంత్రీకరణ చేసే అవకాశాలను పరిశీలించాలి. జౌళి రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేతి మగ్గం అంటే ఏమిటో పునర్ నిర్వచించాలి. చిన్న పవ ర్ లూమ్ ఉత్పత్తిదారులను వర్గీకరించి, చేనేత కుటుంబాలకు ఇచ్చే ప్రభుత్వ సాయం వారికి కూడా అందేవిధంగా సిఫారసులు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆధునీకరణ/ యాంత్రీకరణ ఎంతవరకు పూర్తయిందో అంచనాలు వేసి, చేనేత వస్త్రాన్ని కూడా ఆయా ప్రక్రియలకు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు ఇతర ప్రాంతాలలో కూడా ఆ సిఫారసులను విస్తరించాలి. సంఘం ఉద్దేశాలన్నీ గతంలో ప్రభుత్వాలూ, న్యాయస్థానాలు చేనేత రంగానికి ఇచ్చిన రక్షణలూ, భరోసాలకు భంగం వాటిల్ల చేసేవిగానే ఉన్నాయని ఎవరికైనా అర్థమవుతుంది.
 
  చేనేత రంగం అభ్యర్థనలను ఈ ప్రభుత్వం ఏనాడూ వినిపిం చుకోలేదు. దానికి రుజువు ఆత్మహత్యలు. అయితే ఇప్పుడు చేనేత రంగం ప్రతినిధుల నుంచి ఎలాంటి అభ్యర్థన కూడా అందకుండానే ఒక సంఘాన్ని నియమించి మగ్గానికి మారుపేరు పెట్టే పనిని నెత్తికెత్తుకుంటున్నది. అసలు చేనేత రంగ ప్రతినిధులు లేకుండా మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వడం ఎంత వరకు సబబు? ఒక్క పవ ర్ లూమ్ వల్ల పాతిక మంది చేనేత వృత్తిదారులు ఉపాధి కోల్పోతారని 1974లోనే శివరామన్ కమిటీ చెప్పిన సంగతి ప్రభుత్వానికి గుర్తు లేదా?
 
 విచ్ఛిన్నం చేయడానికే!

 చేనేత మగ్గాన్నీ ఆధునిక యంత్రాల పక్కన పెట్టి చూడటం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడానికే. మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వడం వల్ల చిన్న పవర్ లూమ్ ఉత్పత్తిదారులు, చేనేత నుంచి పవ ర్ లూమ్ ఉత్పత్తులకు మారిన చేనేత వృత్తిదారులు లబ్ధిపొందుతారని ఒక మాట వినిపిస్తోంది. వాస్తవం ఏమిటంటే పవ ర్ లూమ్ రంగంలోని పెద్ద, అతి పెద్ద ఉత్పత్తిదారులే దీనితో మేలు పొందుతారు. గత పదిహేను ఏళ్లుగా వివిధ పథకాలు, ప్రత్యేకంగా టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ ద్వారా వారికి ధన సహాయం వెళ్లిందేకానీ, పైన చెప్పినట్టు మార్పు చెందిన కుటుంబాల వారికి కాదు. ఇది గమనించాలి. నిధుల లోటు, ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం, అవగాహన లేమి, వివక్ష, గాంధీగారు ఎంతో ప్రేమించిన ఈ రంగం మీద అసలు సానుభూతి లేకపోవడం చేనేతకు అసలు శాపం. అందుకే చేనేత రక్షణకు ఉద్దేశించిన చట్టాలు, ప్రభుత్వం రూపొందించిన విధానాలు కూడా నామ మాత్రంగానే మిగిలాయి.
 
 చేనేత రిజర్వేషన్ మాటేమిటి?
 చేనేత రంగం అత్యంత అవసరమైన వృత్తిగా, ఉపాధి రంగంగా గుర్తించిన గత ప్రభుత్వాలు 1985 తరువాత ఆ రంగం రక్షణకు కొన్ని చర్యలు రూపొందించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం 1950 నుంచే చేనేత రిజర్వేషన్ ప్రభుత్వ రికార్డులలో ఉంది. చేనేత ఉపాధిని కాపాడే ప్రయత్నంగా ఈ ‘రక్షణ’ కల్పించారు. ఉపాధి పట్ల నాడు, నేడు కూడా ప్రభుత్వాల ఆలోచనలు మారలేదు. కానీ చేనేత రంగం ఉపాధి పట్ల వివక్ష కనపడుతున్నది. ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తి పట్ల మమకారం కనపడుతున్నది. పెద్ద కంపెనీలకు పూలబాట వేయడానికి పోటీలు పడే రాజకీయ నాయకులకు, అధికారులకు దేశంలో కొదవలేదు. కానీ కోట్లాది కుటుంబాలు మన దేశ సంస్కృతిని కాపాడుతూ, తమ నైపుణ్యాన్ని పెంచు కుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవిస్తున్నవారికి అండగా నిల వటానికి ఎవరూ ముందుకు రాకపోవడం దురదృష్టకరం.
 
 నేతన్నల కడుపు కొడుతున్నారు
 దేశంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తితో పోటీ పడుతూ, దాదాపు 13 శాతం జాతీయ అవసరాలను తీరుస్తున్నది. ఇంత చేనేత ఉత్పత్తి ప్రపంచంలో ఎక్కడాలేదు. చేనేత శ్రామిక కుటుంబాల నిబద్ధత, త్యాగం, నైపుణ్యం, చేనేతను ప్రేమించే వినియోగదారుల కొను గోలు శక్తి ఈ పోటీని సాధ్యం చేస్తున్నాయి. కాని ఆధునిక ‘బకాసుర’ యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తి ప్రభుత్వ సబ్సిడీల సహకారంతో, అధికారుల అవ్యాజ ప్రేమతో ‘నకిలి’ చేనేత వస్త్రాలను మార్కెట్లో ప్రవేశపెట్టి అనైతిక పోటీని సృష్టిస్తూ నేతన్నల ఉపాధిని దెబ్బతీస్తున్నారు.
 
 1985లో నూతన జాతీయ ఔళి విధానం ప్రకటించారు. ఈ విధానం మొదటిసారిగా చేనేత- ఆధార జౌళిరంగ అభివృద్ధికి కాకుండా, అప్పటి వరకు ఉన్న విధానాలకు భిన్నంగా రూపొందించారు. దానికి ‘నూతన’ పదం జోడించారు. కాక పోతే, అప్పటి చేనేత రంగానికి రాజకీయ మద్దతు ఉన్నందువల్ల, ఓట్ల గురించి మాత్రమే చేనేత రక్షణకు కొన్ని చర్యలు ప్రకటించారు. అందులో ముఖ్యమైనది. చేనేత రిజర్వేషన్ చట్టం. ఈ చట్టం ద్వారా 22 రకాల చేనేత ఉత్పత్తులు పవర్ లూమ్ లేదా మిల్లులు, ఉత్పత్తి చేయకుండా, కేవలం చేతి మగ్గాల మీదనే ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. కానీ చట్టం ఉన్నా అం దులో చేనేత వస్త్రాన్ని కాపాడేందుకు సరైన చర్యలు లేవు.
 
 చట్టుబండలైన చట్టం
 చేనేత రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు కాగా, సుప్రీం కోర్టు 1993లో కొట్టివేసింది. చట్టం సక్రమమేనని తేల్చింది. 1995లో మీరా సేథ్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ చట్టం పరిధిలో రిజర్వేషన్ 11 రకాలకు కుదించారు. పదేళ్ల కాలంలోనే, చట్టం పూర్తిగా అమలు కాకముందే, దాని అనుభవాల విశ్లేషణ జరగకముందే, చేనేత రంగ ప్రతినిధులతో పూర్తిగా సంప్రదించకుండా, అధికారికంగా నీరుగార్చేశారు. అటువంటి ప్రయ త్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. 1995కి ముందు, ఆ తరువాత కూడా ఈ చట్టం అమలు తీరు పూర్తిగా లోపభూయిష్టంగానే ఉంది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, దాదాపు 25 ఏళ్ల కాలంలో ఒక్క శిక్ష కూడా ఖరారైనట్లు సమాచారం లేదు. నిర్లక్ష్యానికి ఇది ఒక సూచిక. 11, 12వ పంచవర్ష ప్రణాళికలలో చేనేత రిజర్వేషన్ చట్టం ఎత్తివేసే ప్రతిపాదనలు చేశారు. ఎగుమతి మార్కెట్ల పేరిట ఈ రిజర్వేషన్‌కు స్వస్తి పలికే ప్రయత్నం చేశారు.
 
 ఇప్పుడు, చేనేత మగ్గం నిర్వచనం మార్చి, నామ మాత్రంగానే ఉన్న ఆ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసి, చేనేతరంగాన్ని తుడిచి పెట్టే ప్రయత్నాలు ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ‘చేనేత కార్మికులు వృధాగా శ్రమపడుతున్నారు. వారి శారీరక శ్రమను తగ్గించడానికి, చేనేత మగ్గానికి మార్పులు చేశాం. ఆయా మార్పులు, విద్యుత్‌తో నడిచే పరికరాల ఆధారంగా జరిగినవి కాబట్టి, రిజర్వేషన్ చట్టంలో ఆ విధమైన మార్పులు చేయాలి’ అనేది వారి ప్రతిపాదన. ఈ నిర్వచనాన్ని మార్చినందువల్ల పవర్ లూమ్ రంగం విస్తృతంగా లాభపడే అవకాశమే ఉంది. మానవ శ్రమ, చేతి నైపుణ్యం, సృజన, కళ ఇమిడి ఉన్న చేనేత రంగం కుంటుపడి, ఆ కుటుంబాలు వీధిన పడే అవకాశం ఎక్కువ.
 
 మభ్యపెడుతున్న ప్రభుత్వాలు
 చేనేతను కాపాడుతున్నామని మభ్యపెట్టి, పబ్బం గడుపుకోవడమే తప్ప కోట్లాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి సేవ చేద్దా మనే ఆలోచన పాలకులకు లేకపోవడం శోచనీయం. చేనేత వస్త్రం, చేనేత మగ్గం పునర్ నిర్వచన కార్యక్రమం విరమించుకున్నామని అధికారులు, మం త్రులు నోటి మాటగా చెబుతున్నారు. కానీ కాగితం రూపేణా ఇప్పటి వరకు చెప్పలేదు. కమిటీ ఉందో, రద్దయిందో కూడా తెలియలేదు. ఈ ప్రతి పాదనకు వ్యతిరేకంగా చేనేత శ్రామికులు, చేనేత వస్త్ర ప్రేమికులు, ఆ రంగం నుంచి ఉపాధిని కోరుకునే వారు భారత ఆర్థిక సార్వభౌమత్వాన్ని కోరుకునేవారు, పర్యావరణ ఉద్యమకారులు నడుం బిగించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి.    
 - డాక్టర్ డి.నరసింహారెడ్డి
 జాతీయ జౌళిరంగ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement