జీవ భద్రత నేలపాలు | Within a biosafety shed | Sakshi
Sakshi News home page

జీవ భద్రత నేలపాలు

Published Mon, Mar 31 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

జీవ భద్రత నేలపాలు

జీవ భద్రత నేలపాలు

 విశ్లేషణ,
డాక్టర్. డి. నరసింహా రెడ్డి

 
 జన్యు మార్పిడి పంటలను పరీక్షించే సమయంలో ‘జన్యు’ కాలుష్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని తీసుకున్నా కాలుష్య సమస్యలు వస్తున్న వాస్తవాన్ని గుర్తించిన దేశాలు, ఆ పరీక్షలను ఆపివేస్తున్నాయి. ఐరోపా సమాజంలోని దేశాలలో అత్యధికంగా 264 పరీక్షలకు 1997లో అనుమతులు ఇవ్వగా, 2012లో ఆ సంఖ్య 51కి పడిపోయింది.
 
 జన్యు మార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో  పరీక్షించడానికి ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రి వీరప్ప మొయిలీ అనుమతించడం కొత్త వివాదానికి తెరలేపింది.  బీటీ పత్తి విత్తనాలను 2002లో అనుమతించినప్పుడే ఈ వివా దం మొదలయ్యింది. ఈ  అనుమతులేవీ  క్షేత్ర పరీక్షల ఫలితాల ఆధారంగా ఇచ్చినవి కాదని సమాచారం. బీటీ పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చి నాక, 12 ఏండ్ల అనుభవం చూస్తే, క్షేత్ర పరీక్షల మీద, వాటి ఫలితాల మీద, ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని ఇచ్చిన అనుమతుల శాస్త్రీయత మీద అనుమానాలు వస్తున్నాయి. బీటీ పత్తిలో కాయను తొలిచే పురుగును చంపే విషం చొప్పించి, జన్యు మార్పిడి చేశామనీ, దాని వలన, పురుగు మందుల ఉపయోగం తగ్గి, రైతులకు ఖర్చు తగ్గి, దిగుబడి పెరు గుతుందని చెప్పి మాన్సాంటో కంపెనీ అనుమతులు తీసుకుంది.
 
 బీటీ విషం తిని పురుగులు మొదట్లో చనిపోయినా, క్రమంగా వాటికి ఈ విషాన్ని తట్టుకునే శక్తి వచ్చిందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆకులు తిన్న పశువులు చనిపోయాయి.  బీటీ పత్తి ఆకులు హానికరమని ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థక శాఖ ప్రకటించింది కూడా. బీటీ పత్తి విత్తనాలకు సంబంధించి పరిశోధన కేంద్రంలో కంటె, క్షేత్రస్థాయి పరీక్షలలో కంటె రైతులు సొంత పెట్టుబడితో తెలుసుకున్న ఫలితాలే ఎక్కువ. కంపెనీకి లాభాలు, రైతుల ఖర్చులను చూస్తే, గత ఏడాది (2013-14), పత్తి విత్తనాల మీద రైతులు పెట్టిన పెట్టుబడి కనీసంగా రూ. 1,215 నుంచి గరిష్టంగా రూ. 1,600 కోట్లు. ఇందులో కనీసం రూ.500 కోట్లు మాన్సాంటో కంపెనీకి నేరుగా రాయల్టీ ద్వారా చేరినాయి.
 
 నియంత్రణ వ్యవస్థ ఏదీ?
 
 బీటీ పత్తి విత్తనాలలో రెండవ తరం ప్రవేశించింది. మొదటి తరం పని చేయడం లేదని మాన్సాంటో కంపెనీ ప్రకటించింది, అయినా  మొదటి తరం విత్తనాలు రైతులకు అమ్ముతుంటే నియంత్రించే వ్యవస్థ ఇక్కడ లేదు. ఇప్పుడు దాదాపు 180 బీటీ హైబ్రీడ్లు చలామణిలో ఉన్నాయి. 2002లో అనుమతులు ఇచ్చినప్పుడు, ఒకే రకం విత్తనాల మీద జరిపిన క్షేత్ర పరీక్షల ఫలితాలను ఇప్పుడున్న అన్ని హైబ్రీడ్లకు వర్తింపజేయడం పెద్ద లోపం. ఆ హైబ్రీడ్ల అనుమతుల గురించైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ కాకుండా, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో ఒక చిన్న కమిటీ నిర్ణయాలు తీసుకోవడమే చిత్రం. ఇంకా ప్రజలకు తెలియనివీ, శాస్త్రవేత్తలు పట్టించుకోనివీ, అధికారులు నిర్లక్ష్యం చేసిన నిబంధనలూ, నిజాలూ అనేకం ఉన్నాయి. వాటి ఫలితమే కంపెనీలకు లాభాలు, రైతులకు కష్టాలు, పర్యావరణానికి ‘జన్యు’ కాలుష్యం.
 
 ఒకే జన్యుమార్పిడి విత్తనంతోనే ఇన్ని రకాల సమస్యలు ఉంటే, ఇటీవలి ఉత్తర్వులలో 50 రకాల జన్యు మార్పిడి పంటలపైన క్షేత్ర పరీక్షలు జరుపుకోవటానికి అనుమతులు ఇవ్వడం పూర్తిగా  రైతాంగ వ్యతిరేక చర్య. జీవ భద్రత ముఖ్యమని, మన దేశంలో ‘జన్యు’ కాలుష్యాన్ని ఆపే, నియంత్రించే పద్ధతులు, నిబంధనలు రూపొందించలేదు కనుక,  క్షేత్ర పరీక్షల అనుమతులు ఇవ్వడం మంచిది కాదని ‘హరిత విప్లవాన్ని’ నెత్తికి ఎత్తుకున్న స్వామినాథన్ లాంటి వ్యక్తి అనేక సందర్భాలలో చెప్పారు. ఒక వ్యాజ్యం సందర్భంలో, సుప్రీంకోర్టు నియమించిన బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలతో కూడిన సాంకేతిక సంఘం కూడా ‘జన్యుమార్పిడి విత్తనాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించినపుడు  ‘జన్యు’ కాలుష్యం జరగవచ్చనీ, ఒకసారి మన జీవ వైవిధ్యం కలుషితమైతే అనర్థాలు జరగవచ్చనీ, ప్రకృతి సహజంగా వచ్చిన విత్తనాలు కలుషితమైతే తిరిగి ‘సహజ’ స్థితికి తీసుకురాలేమని ఆ సంఘం నిపుణులు నివేదికలో చెప్పారు. జీవ భద్రత ముఖ్యమని, భావితరాల ఆహారం కలుషితం కాకుండా కాపాడుకోవడానికీ, ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందే వరకు, జన్యు మార్పిడి పంట పరీక్షలు ‘ల్యాబ్‌కే పరిమితం చేయాలని, క్షేత్ర పరీక్షలకు అనుమతులు ఇవ్వవద్దని నివేదిక సుస్పష్టంగా చెప్పింది.
 
 ఐరోపా సమాజం దూరం

 
 జన్యు మార్పిడి పంటలను పరీక్షించే సమయంలో ‘జన్యు’ కాలుష్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎన్ని తీసుకున్నా కాలుష్య సమస్యలు వస్తున్న వాస్తవాన్ని గుర్తించిన అనేక దేశాలు, జన్యు పరీక్షలను ఆపివేస్తున్నాయి. ఐరోపా సమాజంలోని దేశాలలో  అత్యధికంగా 264 పరీక్షలకు 1997లో అనుమతులు ఇవ్వగా, 2012లో ఆ సంఖ్య 51కి పడిపోయింది. దిగుమతి చేసుకునే దేశాలు తిరస్కరిస్తాయన్న భయంతోఅమెరికా కూడా 9 సంవత్సరాల క్రితం గోధుమల మీద జన్యు మార్పిడి పరీక్షలను నిలిపివేసింది. అయినా, అనూహ్యంగా గత సంవత్సరం ఓరెగాన్ రాష్ట్రంలో, ‘జన్యుమార్పిడి గోధుమ’ ఆనవాళ్లు  బయటపడినాయి. రక్షణ చర్యలను అతిక్రమించి  ఎలా కాలుష్యం జరిగిందో మాన్సాంటో దగ్గర సమాచారం లేదు. ఈ వార్త వెల్లడికాగానే, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే గోధుమల మీద జపాన్ నిషేధం విధించింది. జన్యు మార్పిడి క్షేత్ర పరీక్షల వల్ల జన్యు కాలుష్యం జరుగుతుందని, జీవ రక్షణ  చర్యలు ఎన్ని తీసుకున్నా, ఈ కాలుష్యాన్ని ఆపే వ్యవస్థ లేదని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. మరి, మన దేశంలో, ఏ రక్షణ లేని, పర్యవేక్షణ లేని, నియంత్రణ లేని, అవగాహన లేని పరిస్థితులలో జన్యు మార్పిడి పరీక్షలను అనుమతించడం ఆత్మహత్యాసదృశమే.
 
 బియ్యం ఎగుమతుల మీద ప్రభావం
 
 జన్యు మార్పిడి పంట చుట్టూ కొంత భాగం బఫర్ పంట వేయడం వల్ల జన్యు కాలుష్యం అరికట్టే అవకాశం లేదని కూడా రుజువయింది. పరీక్షలు జరిపే పొలం చుట్టూ దడి కడితే సరిపోతుందని ఎఉఅఇ ఇటీవలి ఉత్తర్వులలో పేర్కొనడం వారి సాంకేతిక నైపుణ్యాన్ని, మన దేశ జీవావరణం పట్ల ప్రదర్శిస్తున్న అశ్రద్ధలను తేటతెల్లం చేస్తుంది. మన ముఖ్య ఆహార పంటలు వరి, మొక్కజొన్న, గోధుమలతో పాటు పత్తి మీద కూడా పరిశోధనలు జరపటానికి అనుమతులు ఇచ్చారు. ఆ పరీక్షలు బియ్యం ఎగుమతుల మీద చూపిన ప్రభావాన్ని మన ఆర్థిక స్వావలంబన మీద దాడిగా కూడా చూడవచ్చు. భారత్ ఇప్పటికే వ్యవసాయ ఎగుమతుల దేశం స్థాయి నుంచి దిగుమతుల దేశంగా పయనిస్తున్నది. మన దేశంలో పండే పప్పులను ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. జన్యు మార్పిడి పరీక్షల వల్ల మన ఆహార భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అవసరం లేని, అక్కరకు రాని, ఉపయోగపడని జన్యు మార్పిడి పంటలను చిట్ట చివరి అంకంలో అనుమతించడం ద్వారా యూపీఏ ప్రభుత్వం ఇంకొక స్కామ్‌కు తెరలేపింది. అనుమతులు ఇచ్చిన క్రమం, పద్ధతి శాస్త్రీయంగా కాకుండా, వ్యాపార లబ్ధికీ, ఎన్నికల నిధుల సేకరణకీ, వచ్చే ప్రభుత్వం మెడకు ఒక గుదిబండను తగిలించేందుకూ ఉద్దేశించినదిగా భావించవచ్చు. సాంకేతిక నైపుణ్యం, సామర్థ్యం, పరిశోధనశాలలు ఉన్న ధనిక దేశాలనే భయపెడుతున్న జన్యు మార్పిడి క్షేత్ర పరీక్షలు, అవేవి లేని భారతదేశంలో, ఇష్టానుసారంగా, పార్లమెంటుకు తెలియకుండా చేయడం వెనుక లాభాపేక్ష స్పష్టంగా కనబడుతుంది.
 
 కంపెనీల బాగుకే ఇదంతా!

 
 బీటీ వంకాయ వద్దని దేశవ్యాప్తంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సంప్రదింపుల సమావేశాలలో పాల్గొన్న ప్రజలు, శాస్త్రవేత్తలు, రైతులు ముక్త కంఠంతో చెప్పారు. ఆ తరువాతే అప్పటి మంత్రి వీటి మీద మారటోరియం విధించారు. స్వతంత్ర శాస్త్రవేత్తలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రైతులు జన్యు మార్పిడి పంటలు అవసరం లేదని అనేకసార్లు చెప్పారు. కానీ కొంత మంది అధికారులు, అతి కొద్దిమంది రాజకీయ నాయకులు, లాభాపేక్షతో, బహుళ జాతి కంపెనీ వ్యాపార ప్రయోజనాల కోసం,  దేశ నియంత్రణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, మన వ్యవసాయాన్ని, రైతుల భవిష్యత్తును పణంగా పెడుతూ, దేశ జీవావరణం నాశనానికి ఒడిగడుతున్నారు.    
 (వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement