యూట్యూబ్‌లో చూసి కిరాతకం! | Married Woman Assassinated Case Chased in 48 Hours Nizamabad | Sakshi
Sakshi News home page

కక్ష కట్టి వేటేశారు!

Published Thu, Mar 12 2020 8:33 AM | Last Updated on Thu, Mar 12 2020 8:50 AM

Married Woman Assassinated Case Chased in 48 Hours Nizamabad - Sakshi

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీపీ కార్తికేయ

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని ఆర్యనగర్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. తెలిసిన వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు కక్ష పెంచుకు ని, ఎలాగైనా అంతమొందించాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఏ విధంగా హత్య చేయాలి, పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఏం చేయాలో ఆరా తీశారు. ఇందుకోసం యూట్యూబ్‌లో పలు క్రైం సీన్స్‌ చూశారు. పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి, పరారయ్యారు. కానీ పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసును 48 గంటల వ్యవధిలోనే ఛేదించారు. కేసు వివరాలను సీపీ కార్తికేయ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆర్యనగర్‌లో నివాసముండే రాజవరపు శ్రీనివాస్‌ భార్య లక్ష్మి (43) సోమవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు నాగరాజు, నగేశ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

డబ్బు ఇవ్వమని అడిగినందుకు..
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబోజీపేటకు చెందిన పసులాడి నాగరాజు, డిచ్‌పల్లి మండం ధర్మారం గ్రామానికి చెందిన దుమాల నగేశ్‌కుమార్‌ అలియాస్‌ నాగరాజు.. ఆర్యనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ వద్ద గతంలో పని చేసేవారు. పసులాడి నాగరాజుతో పాటు అతడి తండ్రి గతంలో శ్రీనివాస్‌ వద్ద అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా ఇవ్వని నాగరాజు అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ధర్మారం గ్రామానికి వచ్చిన నాగరాజు నగేశ్‌కుమార్‌ను కలిశాడు. శ్రీనివాస్‌ డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఎలాగైనా చంపాలని చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి కంఠేశ్వర్‌లోని ఓ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి, మాధవనగర్‌ వద్ద బైపాస్‌ రోడ్డుకు వెళ్లారు.

యూట్యూబ్‌లో చూసి..
ఇద్దరు మద్యం సేవిస్తూ మర్డర్‌ ఎలా చేయాలని చర్చించుకున్నారు. హత్య ఎలా చేయాలి.. పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఏం చేయాలనే దానిపై యూట్యూబ్‌లో అనేక క్రైం సీన్లను చూశారు. అనంతరం నగేశ్‌కుమార్‌ హత్యకు ప్రణాళిక రూపొందించాడు. ధర్మారంలోని తన ఇంటి నుంచి పసుపు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఓ షాపులో కారంపొడి కొనుగోలు చేశారు. ఇద్దరు కలిసి ఆర్యనగర్‌కు చేరుకున్నారు. నగేశ్‌కుమార్‌ కొద్ది దూరంలోనే ఆగిపోగా, నాగరాజు శ్రీనివాస్‌ ఇంటికి చేరుకున్నాడు. తెలిసిన వ్యక్తే కావడంతో శ్రీనివాస్‌ భార్య ఇంట్లోకి ఆహ్వానించింది. అయితే, ఆమె సోఫాలో కూర్చోగానే నాగరాజు రాడుతో ఆమె తలపై బలంగా మోదాడు. అనంతరం కత్తితో మెడ, ఛాతిలో పొడిశాడు.

పోలీసుల దృష్టి మళ్లించేందుకు..
పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు నాగరాజు మృతదేహంతో పాటు ఘటనా స్థలంలో పసుపు, కారంపొడి చల్లాడు. లక్ష్మి కాలి వేళ్లను నరికి, కాళ్లకు ఉన్న పట్టీలు, మెడలోని నగలు, ఫోన్‌ తీసుకున్నాడు. అనంతరం మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె చుట్టూ దీపాలు వెలిగించాడు. సుమారు 45 నిమిషాల పాటు ఇంట్లోనే ఉన్న అతడు తీరిగ్గా బయటకు వెళ్లాడు. అయితే, ఆ రోజు హోలీ కావడం, అప్పటికే నాగరాజు దుస్తులపై రంగు పడడంతో ఆయనపై పడిన రక్తపు మరకలను స్థానికులు గుర్తించలేదు. హత్యకు ఉపయోగించిన కత్తి, రాడ్‌ను బోర్గాం వద్ద దాచి పెట్టి, వెళ్లి పోయారు.

పట్టిచ్చిన కుక్క..
కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రొఫెషనల్‌ గ్యాంగ్‌ పనేనని తొలుత భావించిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. మరోవైపు, శ్రీనివాస్‌కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా..? అన్న వివరాలు సేకరించారు. అయితే, శ్రీనివాస్‌ ఇంట్లో ఉండే కుక్క హత్య జరిగిన రోజు మొరగక పోవడాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలో దృష్టి సారించారు. సాధారణంగా ఎవరెవరు వస్తే కుక్క అరవదని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో నాగరాజు పేరు చెప్పడం, హత్య జరిగిన రోజు కాలనీలో అతడు స్థానికులకు కనిపించడంతో పోలీసులు దాదాపు అతడేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో లింగంపేటకు వెళ్లి నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

అతడిచ్చిన సమాచారంతో రెండో నిందితుడు నగేశ్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే, హత్య జరిగిన తర్వాత రోజు ఆర్యనగర్‌కు వచ్చిన నగేశ్‌కుమార్‌.. ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్‌లో నాగరాజుకు సమాచారమివ్వడం గమనార్హం. 48 గంటల్లోపు కేసును ఛేదించిన అడిషనల్‌ డీసీపీ రఘువీర్, ఏసీపీ ప్రభాకర్, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు లక్ష్మయ్య, నరేందర్, రమణ తదితరులను సీపీ అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement