పైసాచికత్వం | Nizamabad Crime News History | Sakshi
Sakshi News home page

పైసాచికత్వం

Published Wed, May 8 2019 8:58 AM | Last Updated on Wed, May 8 2019 8:58 AM

Nizamabad Crime News History - Sakshi

ఉమ్మడి జిల్లాలో ఇటీవలి కాలంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. క్షణికావేశంలోనో.. పక్కా ప్రణాళికతోనో ఇతరుల ప్రాణాలను తీసేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానో.. ఆస్తులు, డబ్బుల కోసమో హత్యలకు ఒడిగడుతున్నారు. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో హత్యలు పెరిగాయి. పక్షం రోజుల్లోనే ఏడు హత్యలు జరగడం కలవరం సృష్టిస్తోంది.  

కామారెడ్డి క్రైం: బంధాలు, బంధుత్వాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. స్నేహానికి కూడా విలువలేకుండా పోతోంది. డబ్బే ప్రధానమవుతుండడంతో దానికోసం దారుణాలకూ ఒడిగడుతున్నారు. డబ్బు, ఆస్తులు, వివాహేతర సంబంధాలతో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పక్షం రోజుల్లో ఆరు సంఘటనల్లో ఏడుగురు హత్యకు గురయ్యారు. ఆయా కేసుల్లో నిందితులు అత్యంత కిరాతకంగా ఎదుటివారిని హత్యచేశారు.  
వరుస ఘటనలు..
 

  • ఉమ్మడి జిల్లాలో పదిహేను రోజుల్లో పలు హ త్యలు జరిగాయి. ఆయా ఘటనల్లో ఏడుగురు దారుణ హత్యకు గురయ్యారు. వరుసగా జరుగుతున్న హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.  
  • ఏప్రిల్‌ 24: అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడలో హత్య జరిగింది. హమాల్‌వాడీలో తమ్ముడు చౌదరి దత్తు (23)ను అతడి అన్నయ్యే కత్తితో పొడిచి చంపా డు. తల్లి కూలీ డబ్బులు తమ్ముడే తీసుకుంటున్నాడన్న విషయమై జరిగిన గొడవ ఈ దారుణానికి దారితీసింది.  
  •  ఏప్రిల్‌ 25: భిక్కనూరు మండలం బస్వాపూర్‌ గ్రామానికి సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్ద మెద క్‌ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్‌ గ్రామానికి చెందిన తుడుం రాకేష్‌ (25) అనే యువకుడు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. బైక్‌ విషయంలో అతడిని స్నేహితుడే హత్య చేసినట్లు గా తెలిసింది. 
  • ఏప్రిల్‌ 30: ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఓ కళ్యాణ మం డపం వద్ద రెండు నెలలుగా గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాచ్‌మన్‌ బోదాసు రాములు (46)ను దుండగులు దారుణంగా హత్య చేశారు. విద్యుత్‌ తీగలతో గొంతకు ఉరివేసి హతమార్చారు. కారణం తెలియలేదు. 
  • మే 3: నిజామాబాద్‌లోని కంఠేశ్వర్‌లో మూడో తేదీన వెలుగు చూసిన జంట హత్యల సంఘటన సంచలనం సృష్టించింది. టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగించే శ్రీకాంత్‌ శెట్టి, అతని సహచరుడు సాయికుమార్‌లను మరో ఇద్దరు స్నేహితులు కలిసి దారుణంగా హత్య చేశారు. వారి వద్దనుంచి డబ్బులు కాజేయాలన్న ఉద్దేశంతోనే రెండు నిండు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు.  
  • మూడో తేదీనే బాన్సువాడ మండలం కొల్లూరులో మరో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నానుగొండ (47) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని స్నేహితుడైన పర్వయ్య నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపాడు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని పోలీసుల విచారణలో తేలింది.  
  • మే 4: గుంట భూమి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మద్నూర్‌ మండలం ఇలేగావ్‌ గ్రామానికి చెందిన గుండాజీ (53), వరుసకు సోదరుడైన వ్యక్తి మధ్య భూమి విషయంలో జరిగిన గొడవలో అతడు గుండాజీపై ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గతనెల 10న ఈ సంఘటన చోటు చేసుకుంది. గుండాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 4న మరణించాడు.  
  • మే 6: బీబీపేటకు చెందిన బోయిని నర్సయ్య(60) అనే రైతు తన పంటపొలం వద్దే దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు తలపై కర్రలతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే  మృతిచెందాడు. హత్యకేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.  

ఆస్తులు, డబ్బుల కోసం... 
ఆయా హత్య కేసులను పరిశీలిస్తే ఆస్తి, డబ్బు హత్యలకు ప్రధాన కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్‌లోని కంఠేశ్వర్‌లో జరిగిన జంట హత్యల వెనుక కారణం ఇదే. రూ. 2 వేలు, 2 సెల్‌ఫోన్లను దొంగిలించేందుకు స్నేహితులుగా వచ్చిన ఇద్దరు ఈ దారుణానికి తెగబడ్డారు. నాందేవ్‌వాడలో తమ్ముడిని అన్న హత్య చేయడానికి కూడా డబ్బే కారణం.. బస్వాపూర్‌ సమీపంలో జరిగిన తుడుం రాకేష్‌ హత్య ఉదాంతం వెనుక కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయి. మద్నూర్‌ మండలం ఇలేగావ్‌లో మృతుడు గుండాజీపై జరిగిన దాడికి ఒక గుంట ఆస్తి మాత్రమే కారణం కావడం గమనార్హం.

వివాహేతర సంబంధాలూ.. 
వివాహేతర సంబంధాలు కూడా హత్యలకు దారితీస్తున్నాయి. కొల్లూర్‌ గ్రామంలో జరిగిన నానుగొండ హత్య ఈ కారణంతోనే జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతోనే అతడి స్నేహితుడు నానుగొండను గొడ్డలితో నరికి చంపాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండు నెలల క్రితం భిక్కనూరు మండలం బస్వాపూర్‌ గ్రామంలో నివాసం ఉండే బ్యాంకు ఉద్యోగిని అరుణ హత్య కూడా వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగింది. ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆమెను ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేశాడు.
 
పెరుగుతున్న నేర ప్రవృత్తి...   
నేరాలను నియంత్రించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని సందర్భాలలో వాటి ఫలితాలు ఆశించినంతగా కనిపించడం లేదు. పోలీసుశాఖ లెక్కల ప్రకారం నేరాల తగ్గుదలలో కొద్దిపాటి వ్యత్యాసం మాత్రమే ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2016లో 30, 2017లో 23, 2018లో 21 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 10 మందికిపైగా హత్యకు గురయ్యారు. కారణాలు ఏవైనా జిల్లాలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. నేరాల నియంత్రణపై పోలీసుశాఖ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement