
చిన్నపాటి నిర్లక్ష్యం.. వెలకట్టలేని విషాదాన్ని మిగులుస్తోంది. ఎన్నో కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రమాదాలకు అతివేగానికి తోడు మద్యం, నిద్రమత్తులే కారణమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనకూ డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా వాహనాన్ని నడపడమే కారణం.. ఈ ఘటనలో దురదృష్టం వెంటాడి బెలూన్లు తెరచుకోలేదు. లేకుంటే వారు బతికేవారేమో?.
– సాక్షి, కామారెడ్డి
సాక్షి, భిక్కనూరు: నిజామాబాద్ పట్టణంలోని పద్మనగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న అరుణ్ ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఇంటి యజమాని మంతెన లావణ్య(35)ను కారు అడిగాడు. హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న కుమారుడిని చూసేందుకు తామూ వస్తామని లావణ్య ఆమె కూతురు రోషిణి(15) అతడితో తెలిపారు. లావణ్య, రోషిణితోపాటు అరుణ్ బంధువు ఆర్మూర్ మండలం హుస్నాబాద్ గ్రామానికి చెందిన డ్రైవర్ సుశీల్(22), స్నేహితుడు నవీపేటకు చెందిన ప్రశాంత్(30) కారులో హైదరాబాద్ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో అరుణ్‌కు సెండాఫ్ ఇచ్చి, కుమారుడితో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం దాటాక కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పింది.
రోడ్డు పక్కన ఉన్న మైలు రాయికి కారు ఢీకొట్టి, అదుపుతప్పి సమీపంలోని మర్రిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. పెద్ద శబ్దం కావడంతో చెట్టుపక్కనే ఉన్న గుడిసె హోటల్‌లో నిద్రిస్తున్న హోటల్ యజమాని నర్సాగౌడ్ మేల్కొని బయటకు వచ్చి చూశాడు. కారు చెట్టును ఢీకొన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భిక్కనూరు సీఐ యాలాద్రి, ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై హైమద్‌లు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయలేని పరిస్థితి ఉండడంతో వెంటనే గ్యాస్ వెల్డింగ్ చేసే వారిని రప్పించారు. గ్యాస్ కట్టర్ సహాయంతో కారు భాగాలను కత్తిరించి, అందులో ఉన్న నలుగురి మృతదేహాలను బయటికి తీశారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ సుశీల్ నిద్ర మత్తులో అతివేగంగా వాహనాన్ని నడపడమే అని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఘటన స్థలంలో నుజ్జునుజ్జయిన కారు
నేడు పుట్టిన రోజు.. అంతలోనే..
నిజామాబాద్ అర్బన్: మంతెన లావణ్య డిసెంబర్ 10న జని్మంచారు. కానీ ఆమె మరో పుట్టిన రోజును చూడకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.
వేగం,నిద్రమత్తే కారణం..
వేగం వారి ప్రాణం తీసింది.. నిద్రమత్తులో కారును నియంత్రించలేకపోయి అదే స్పీడ్‌తో చెట్టుకు ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జాగ్రత్తలు పాటించకుండా తెల్లవారుజాము ప్రయాణాలు ప్రాణాలు తీస్తాయని మరోసారి
రుజువైంది.
కొడుకును చూసేందుకు వెళ్లి..
నిజామాబాద్ అర్బన్: భర్త గల్ఫ్‌లో ఉంటే తానే ఇద్దరి పిల్లల బాధ్యత తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంది. హైదరాబాద్‌లో ఉంటున్న కొడుకును చూసేందుకు వెళ్లి అసువులు బాసింది. కామారెడ్డి జిల్లా జంగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదం మృతిచెందిన లావణ్య దీనగాథ ఇది..
కారు రూపంలో ప్రమాదం..
లావణ్యకుటుంబం నిజామాబాద్‌లో పద్మనగర్‌లో నివసిస్తోంది. తన భర్త జనర్ధన్ మూడు నెలల క్రితమే గల్ఫ్‌కు వెళ్లగా కూ తురు రోషిణి(15)తో కలిసి నిజామాబాద్‌లో ఉంటున్నారు. కొడుకును హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ చదివిస్తోంది. లావణ్య ఇంటివద్దే ఉండేది. తన ఇంట్లో రెండు పోర్షన్లు అద్దెకు ఇచ్చారు.
పక్కంటి వారు హైదరాబాద్ వెళ్తుంటే..
లావణ్య ఇంట్లో అద్దెకు ఉండే నాగమణి కొడుకు ఆదివారం గ ల్ఫ్ వెళ్తున్నాడు. దీంతో లావణ్య కారును అడిగారు. లావణ్య తాను కూడా హైదారబాద్‌లో తన కొడుకు హాస్టల్‌లో ఉన్నా డని అతడిని చూసి వస్తానంటూ తన కూతురు రోషిణిని తీసుకుని అదే కారులో ఆదివారం రాత్రి 7.30కు పద్మనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఇక్కడే విధి వక్రీకరించింది. ఆదివారం రాత్రి అరుణ్‌కు సెండాఫ్ ఇచ్చారు. అ లాగే లావణ్య తన కొడుకును కలిసి మాట్లాడి తి రిగి అదే కారులో తెల్లవారుజామున నిజామాబాద్ బయలుదేరారు. తెల్లవారుజామున భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద కారు చెట్టుకు ఢీకొన్న ప్రమాదంలో లావణ్య, రోషిణితో సహా నలుగురు మృతిచెందారు.
మిగిలింది తండ్రీకొడుకులే..
ఇప్పుడు జనార్ధన్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇప్పుడు తండ్రీకొడుకులే మిగిలారు. కొన్నేళ్ల క్రితం జనార్ధన్ కుటుంబం నిజామాబాద్‌కు తరలివచ్చింది. బతుకుదెరువు కోసం జనార్ధన్ కొన్నేళ్లుగా గల్ఫ్‌లోనే ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం గల్ఫ్ నుంచి తిరిగి వచ్చేశాడు.
మళ్లీ అవకాశం రాడంతో మూడు నెలల క్రితమే గల్ఫ్ వెళ్లాడు. కాని విధి తల్లీకూతుళ్లను తీసుకెళ్లిపోవడంతో తండ్రీకొడుకులే మిగిలారు. లావణ్య చుట్టుపక్కల వారితో కలిసిమెలిసి ఉండేదని పేర్కొన్నారు.
కారు ఢీకొన్న మైలు రాయి
దురదృష్టం వెంటాడింది
నవీపేట(బోధన్): ఆదినుంచి వెంటాడిన దురదృష్టం కన్నకొడు కుని బలితీసుకునేంత వరకు పగబట్టింది.. ప్రశాంత్ తండ్రి సుదర్శన్ పొట్టకూటికోసం ముంబయ్ పోయినప్పటికీ అదృష్టం కలిసిరాక తిరిగి సొంతూరుకు వచ్చి చిన్నాచితకా పనిచేసుకుంనాడు. ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకుని బతికితే.. చివరకు ఆ కొడుకుకే తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. భిక్కనూరు సమీపంలోని జన్నెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు మ్యాతరి ప్రశాంత్ తండ్రి దీనగాథ ఇది.
ఆదినుంచీ కష్టాలే..
నవీపేట మండల కేంద్రంలోని ధర్యాపూర్ కాలనీకి చెందిన మ్యాతరి దశరథ్ అన్నదమ్ముల్లో మూడోవాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముంబయ్ వెళ్లాడు. కాని పనికష్టంగా మారగా ఇల్లు అమ్మేసి కొడుకు ప్రశాంత్‌ను బీబీఏ చేయించాడు. ముంబయ్‌లో పని కుదరకపోవడంతో నాలుగేళ్ల క్రితం స్వగ్రామమైన నవీపేట్‌కు వ చ్చేశాడు. అక్కడ కూడా పనిసరిగ్గా కుదరక కొన్నిరోజుల క్రితం నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆయన స్టీల్ వెల్డింగ్ షాప్‌లో పనిచేస్తుండగా భార్య రేఖ బీడీలు చుడుతుండేది. బీబీఏ చేసిన కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడ పనుల కోసం వెతికి ముణ్నెళ్ల క్రితం ఓ హోటల్‌లో క్యాషియర్‌గా కుదిరాడు. ఆర్నెళ్ల క్రితం దశరథ్ కూతురి పెళ్లి చేశాడు.
కష్టాల నుంచి గట్టెక్కేలోపే..
ఆదినుంచి కష్టాలను చవిచూసిన దశరథ్ తన ఏకైక కుమారుడు ప్రశాంత్‌పై ఆశలు పెట్టుకున్నాడు. మహారాష్ట్రలో బీబీఏ చదివిన ప్రశాంత్‌కు అతికష్టం మీద నిజామాబాద్ నగరంలో ఉద్యోగం దొరికింది. ఇక నేనే అన్నీ చూసుకుంటానని కొడుకు మాటివ్వడంతో తల్లిదండ్రుల్లో పుత్రోత్సాహం రెట్టింపయ్యింది. కాని ఆ ఆనందం కొన్ని రోజులే ఆ ఇంట్లో ఉంది. రోడ్డు ప్రమాదం రూపంలో ప్రశాంత్ సోమవారం ఉదయం మృతిచెందాడు. కల లను సాకారం చేసుకుంటాడనుకుంటే కాటికెళ్లిపోయాడు.
సోదరుడికి వీడ్కోలు చెప్పి..
పెర్కిట్(ఆర్మూర్): ఇరాక్‌కు వెళ్తున్న పెద్దమ్మ కుమారునికి వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణమైన యువకున్ని రోడ్డు ప్రమాదం అనంత లోకాలకు తీసుకెళ్లింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన అంగూర్ సుశీల్(24) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో నివాసముండే అంగూర్ దేవేందర్, గీత దంపతుల కుమారుడు సుశీల్ ఆరు నెలల క్రితం జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ వద్ద గల మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఉద్యోగంలో చేరాడు. తండ్రి దేవేందర్ ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. కాగా నిజామాబాద్‌లో ఉంటున్న సుశీల్ పెద్దమ్మ కుమారుడు అరుణ్ ఆదివారం ఉపాధి కోసం ఇరాక్ దేశం వెళ్తున్నాడు. దీంతో సుశీల్ సోదరునికి వీడ్కోలు పలకడానికి నిజామాబాద్ వెళ్లాడు. నిజామాబాద్ నుంచి అరుణ్‌తో పాటు అతని స్నేహితుడు ప్రశాంత్, ఇంటి యజమాని కుటుంబానికి చెందిన తల్లీకూతురు, సుశీల్ అందరు కలిసి కారులో ఏయిర్‌పోర్టుకు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో కామారెడ్డి జిల్లా బీర్కూర్ వద్ద కారు చెట్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నిజామాబాద్‌కు చెందిన తల్లి కూతురు, ఆర్మూర్‌కు చెందిన సుశీల్, నవిపేటకు చెందిన ప్రశాంత్ దుర్మరణం పాలయ్యారు. కాగా ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంలో కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. కుమారుని మరణ వార్త తెలుసుకున్న తండ్రి దేవేందర్ దుబాయ్ నుంచి ప్రయాణమయ్యాడు. మంగళవారం ఆర్మూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫ్లైట్ ఆలస్యం కావడంతో..
కాగా శంషాబాద్ విమానశ్రయంలో సోదరుడు అరుణ్‌కు వీడ్కోలు పలికిన సుశీల్‌కు మండలంలోని ఆలూర్ గ్రామానికి చెందిన పరిచయస్తులు ఎదురయ్యారు. దీంతో వారితో నేరుగా ఆర్మూర్ వరకు కలిసి రావచ్చని అనుకున్నట్లు సమాచారం.
కాగా వారు ఎదురుచూస్తున్న ఫ్లైట్ అరగంట ఆలస్యంగా వస్తున్నట్లు తెలియడంతో సుశీల్ గత్యంతరం లేక వచ్చిన కారులోనే బయలు దేరాడు. ఒక వేళ అరగంట నిరీక్షించి ఉంటే ప్రాణాలు దక్కేవంటూ తల్లి గీత విలపించడం అందరిని కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment