ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన గ్రామస్తులు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌లో గల చైతన్య హైస్కూల్‌కు చెందిన బస్సు మంగళవారం రూరల్ మండలంలోని ధర్మారం గ్రామశివారులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30మంది చిన్నారులకు గాయాలయ్యాయి. బస్సులో పరిమితి మించి విద్యార్థులను తరలించడం, అతివేగంతో పాటు డ్రైవర్ సెల్‌ఫోన్లో మాట్లాడటమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సులో 70 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అయితే యాజమాన్యం మాత్రం 39 మందే ఉన్నట్లు చెప్పుకొస్తోంది. రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిని ఓపెన్ బావి సమీపంలోనే స్కూల్ బస్సు బోల్తా పడింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారమందుకున్న 108 చేరుకుని చిన్నారులను స్థానిక, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తరలించారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం..
చైతన్య హైస్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్సు వేగం, సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉండడం, డ్రైవర్ బి.శివకుమార్ సెల్‌ఫోన్లో మాట్లాడుతుండటంతో మూలమలుపు వద్ద ఆటోను తప్పించబోయి బోల్తాపడింది. ప్రమాదంలో 30మంది చిన్నారులకు స్వల్పగాయాలు కాగా, మరో విద్యార్థి సుశాంత్, క్లీనర్ అజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అజయ్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలిసింది. బస్సు నాగారం, గొల్లగుట్ట, చక్రధర్‌నగర్ తండా, మల్లారం, ధర్మారం, ధర్మారం తండా విద్యార్థులను ఎక్కించుకుని సిర్‌పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గతంలో ఇదే డ్రైవర్‌ను హెచ్చరించినా పట్టించుకోలేదు. నెమ్మదిగా వెళ్లాలని సూచించిన వారిపై అసభ్యపదజాలంతో దూషించేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మరో బస్సును అదనంగా కేటాయించాలని వారు కోరుతున్నారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్ కుమార్, రూరల్ సీఐ రఘునాథ్, ఎస్‌హెచ్‌ఓ ప్రభాకర్, ఎస్‌ఐ గురువప్ప సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సులోని విద్యార్థుల సంఖ్యను ప్రత్యక్ష సాక్షులు, పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. 38 సీట్ల సామర్థ్యం గల బస్సులో 70మందిని ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
నెమ్మదిగా వెళ్లాలని చెప్పినం..
డ్రైవర్ శివకుమార్ బస్సును సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ అతివేగంగా నడుపుతుంటాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు తాము కూడా పలుమార్లు హెచ్చరించాం. అయినా విన్పించుకోలేదు. గతంలో ఓ సారి గ్రామస్తులందరూ కలిసి దాడి చేశారు. మళ్లీ అలాగే ఉంది. యాజమాన్యం డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. లేకుంటే ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయి. –రవీందర్‌రెడ్డి, ధర్మారం
నా మనుమడికి దెబ్బలు తాకినయి
స్కూల్‌కు మా ఊరి నుంచి 30మంది పోతరు. నా మనువడు సుశాంత్ కూడా ఉన్నాడు. ఇప్పుడు సుశాంత్‌కు పెద్ద దెబ్బలు తాకినయి. ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నం. మరికొందరికి రెండు, మూడు కుట్లు కూడా పడ్డాయి. అంతేగాకుండా ఎక్కువ మందిని తీసుకెళ్తున్నారు. అలా కాకుండా మరో బస్సును కేటాయించి తిప్పాలి. –గంగాధర్, ధర్మారం..
చాలా భయమేసింది..
ధర్మారం తండాలో బస్సు ఎక్కిన. అక్కడి నుంచి సిర్‌పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నడు. బస్సు బోల్తా పడటంతో అందులో ఉన్న అందరం ఏడ్చేశాం. చుట్టుపక్కల వారు వచ్చి మమ్మల్ని లేపారు. నన్ను అందరూ తొక్కుకుంటూ వెళ్లారు. చాతిలో నొప్పిగా ఉంది. –హరిణి, 4వ తరగతి
Comments
Please login to add a commentAdd a comment