గాలీపూర్‌లో ఉపయోగించిన కర్రలు, తాళ్లు
నిజాంసాగర్(జుక్కల్): వర్షాభావ పరిస్థితులు ఓ వైపు.. దోపిడీ దొంగల సంచారం మరో వైపు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ సర్కిల్ పరిధిలో వరుస చోరీలు జరుగుతుండటంతో పోలీసులకు సవాలుగా మారింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు ఇంటి వెనుక భాగంలో ఉన్న కిటికీలను ధ్వంసం చేస్తూ దుండగులు చోరీలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న నిజాంసాగర్ మండలం గాలీపూర్, ముగ్థుంపూర్, నర్సింగ్‌రావ్‌పల్లి గ్రామాల్లో దొంగలు దోపిడీలు చేశారు. ఆ సంఘటనలు మరుక ముందే పిట్లం మండల కేంద్రంలో బంగారు దుకాణంలో భారీ చోరీ కావడంతో పోలీసులకు పెను సవాలుగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన చోరీలను పోలీసులు మామూలుగా తీసుకున్నారు. దొంగలను నివారించడంతో విఫలం చెందడంతో పట్టణాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించేలా చేస్తున్నారు. గాలీపూర్, మగ్థుంపూర్ గ్రామాల్లోని నాల్గు ఇళ్లల్లో చోరీలు, నర్సింగ్‌రావ్‌పల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిట్లం మండల కేంద్రంలోని నగల దుకాణంలో రూ.30లక్షల నగలు చోరీకి గురవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దోపిడీ దొంగల కోసం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలతో పాటు పాత నేరస్థులపై నిఘా పెట్టారు. పిట్లంలోని నగల దుకాణంలో సైతం దొంగలు కిటికీలను ధ్వంసం చేసి చోరీ చేశారు. ఇలా వరుస చోరీలు ఒకే మాదిరిగా జరుగడంతో ఒకే ముఠాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాల వైపు పోలీసుల నిఘా లేకపోవడం, రాత్రివేళ పెట్రోలింగ్ సైతం తగ్గడంతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment