
సాక్షి, మోపాల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లి పోవడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకున్నాడు. రూరల్ ఎస్‌హెచ్‌వో ప్రభాకర్ కథనం ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలంలోని కాలూర్ గ్రామంలో బాశెట్టి లింగం(48) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఐదురోజుల క్రితం భార్య సుజాత, కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న లింగం జీవితంపై విరక్తి చెంది దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారమందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు.
విడాకులు తీసుకుని.. జీవితంపై విరక్తి చెంది
రుద్రూర్: భర్తతో మనస్పర్థలతో విడాకులు తీసుకు న్న ఓ ఇల్లాలు.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రూర్ మండల కేంద్రం లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. రుద్రూర్‌కు చెం దిన జల్లపురం స్రవంతి (26) మనస్పర్థలతో ఇటీవలే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి విడాకుల గురించి ఆలోచనల్లో మునిగి పోయిన ఆమె.. జీవితంపై విరక్తి చెంది ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరే సుకుంది. స్రవంతి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యానికి బానిసై..
గాంధారి: మద్యానికి బానిసై, అప్పుల పాలైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. గాంధారి ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సర్వాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శేఖర్ (28) మద్యానికి బానిసై గ్రామస్తులతో పాటు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం సాయంత్రం గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడ్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
లింగం మృతదేహం, శేఖర్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసు