గుట్కా కేసుల దర్యాప్తు అటక పైకే! | The Gutkha Scam In Nizamabad | Sakshi
Sakshi News home page

కథ కంచికే!

Published Mon, Sep 16 2019 10:15 AM | Last Updated on Mon, Sep 16 2019 10:15 AM

The Gutkha Scam In Nizamabad - Sakshi

ఇటీవల ముజాయిద్‌నగర్‌లో పట్టుకున్న గుట్కా సంచులను చూపుతున్న పోలీసులు

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్‌: గుట్కా కేసుల దర్యాప్తులో పోలీసులు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారా..? కావాలనే ఆయా కేసులను తొక్కి పెడుతున్నారా..? అసలు సూత్రధారులను వదిలి అమాయకులను పట్టుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గుట్కా కేసుల దర్యాప్తులో పోలీసులు పెద్దగా పురోగతి సాధించక పోవడం వల్లే ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. అక్రమంగా గుట్కా తరలిస్తుండగా పట్టుకుని కేసులు పెట్టిన పోలీసులు.. అసలు సూత్రధారులెవరో తేల్చలేకపోయారు. రూ. కోట్లల్లో జరుగుతోన్న ఈ చీకటి దందా వెనుక ఉన్న కీలక వ్యక్తులెవరో గుర్తించలేకపోయారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు పేరిట పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నగరంలోని ముజాయిద్‌నగర్‌లో రూ.15 లక్షల విలువైన గుట్కా పట్టుబడిన కేసులో ఇంత వరకు పెద్దగా పురోగతి సాధించలేక పోయారు.

అటకెక్కినట్లే..? 
జిల్లాలో ప్రతి నెలా కోట్ల రూపాయల అక్రమ గుట్కా దందా కొనసాగుతోంది.. ప్రభుత్వం గుట్కాలను నిషేధించడంతో అక్రమార్కులు హైదరాబాద్‌ నుంచి గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రాత్రి వేళ వాహనాల ద్వారా జిల్లా కేంద్రానికి గుట్కా తరలిస్తున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా సరుకు పంపిణీ చేస్తున్నారు. అయితే, ఈ దందా వెనుక ఉన్న వారి గురించి పట్టించుకోని పోలీసులు.. కిరాణషాపులు, చిరు వ్యాపారులపై దాడులు చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అంతే కాని బడా వ్యాపారుల సంగతి చూడడం లేదు. ప్రస్తుతం ముజాయిద్‌నగర్‌కు సంబంధించి గుట్కా కేసులో 20 రోజులు గడుస్తున్నా అసలు నిందితులను ఇంత వరకూ గుర్తించలేక పోయారు. గుట్కా పట్టుకునే సమయంలో బడా వ్యాపారులు అక్కడే ఉన్నా పట్టుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కావాలనే కాలయాపన..! 
ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోందన్నది బహిరంగ రహస్య మే! తన పలుకుబడితో పోలీసులను ‘మేనేజ్‌’ చేసుకుంటూ కేసులు ముందుకు సాగకుండా చేస్తున్నట్లు సమాచారం. అందుకే, గత కొన్నేళ్లుగా గుట్కా పట్టుబడిన కేసుల్లో సంబంధిత వాహన డ్రైవర్లపైనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. అసలు సూత్రధారి ఎవరో తేల్చలేక పోతున్నారని ప్రచారం సాగుతోంది. కేసుల విషయంలో పోలీసులు ‘మామూలు’గానే వ్యవహరిస్తూ దర్యాప్తు పేరిట కావాలనే కాలయాపన చేయడం పరిపాటిగా మారింది.

♦ రెండేళ్ల క్రితం ధర్మపురి హిల్స్‌లో రూ.30 లక్షల విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న కొందరు కూలీలను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, ఇంతవరకూ దీని వెనుక ఉన్న వారిని మాత్రం బయటకు తేలేక పోయారు.  
♦ కంటెయినర్‌లో గుట్కా తరలిస్తుండగా, పోలీసులు వెంట పడడంతో నిందితులు జానకంపేట వద్ద కంటెయినర్‌ను వదిలేసి పారి పోయారు. ఈ కేసు అడుగు ముందుకు కదలడం లేదు.  
♦ ఇక, పక్కా సమాచారంతో కాలూరు వద్ద గుట్కా కంటెయినర్‌ను పట్టుకున్న పోలీసులు... ఆ తర్వాత వదిలేసినట్లు అప్పట్లో బహిరంగంగానే చర్చ జరిగింది.  
♦ గత నెలలో నగరంలోని ముజాయిద్‌నగర్‌లో రూ.15 లక్షల విలువైన గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వాహన డ్రైవర్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కానీ గుట్కాను ఎక్కడకు తరలిస్తున్నారు, ఎక్కడ విక్రయిస్తున్నారు.. ఈ దందా వెనుక ఎవరున్నది తేల్చలేక పోయారు.  
♦ ఇలా చెప్పుకుంటే బోలెడు ఉదాహరణలు. గుట్కా పట్టుబడితే వాహన డ్రైవర్లపై కేసులు పెట్టడం, ఆ తర్వాత అటకెక్కించడం. ఇదే పరిపాటిగా మారింది తప్పితే అసలు సూత్రధారులను పట్టుకోవడం లేదు.

విచారణ కొనసాగుతోంది..
ముజాయిద్‌నగర్‌లో పట్టుబడిన అక్రమ గుట్కా వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. దీని వెనుక ఎవరు ఉన్నా పట్టుకుంటాం. త్వరలోనే అసలు నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. 
– ఆంజనేయులు, ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement