Nizamabad police
-
బదిలీ వెనుక రాజకీయం.. చక్రం తిప్పిన ఇద్దరు ప్రజాప్రతినిధులు..?
నిజామాబాద్ : ఏసీపీ వెంకటేశ్వర్ ఆకస్మిక బదిలీ రాజకీయ రంగు పులుముకుంది. రెండేళ్లు పూర్తి కాకుండానే బదిలీ జరగడం నగరంలో హాట్టాఫిక్ మారింది. ఏసీపీ నిజామా బాద్‌లో ఏడాదిన్నరకు పైగా పని చేశారు. ఏసీపీగా వచ్చిన వెంకటేశ్వర్ సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందుతూనే ప్రజలతో సంత్సంబంధాలు కొనసాగించారు. నిజామాబాద్ డివిజన్ నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. అయితే అధికారు లు తప్పనిసరిగా ఇక్కడి ప్రజాప్రతినిధుల కన్నుసన్న ల్లో పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో పాటు మరో ప్రజాప్రతినిధి కలిసి ఏసీపీ బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఎడమోహం పెడమోహంగా ఉన్న సదరు ఇద్దరు ప్రజాప్రతినిధులు చివరకు ఒక్కట య్యారు. తమ మధ్య విబేధాలను పక్కన పెట్టారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా వారిద్దరు ఒక్కటై చివరికి ఏసీపీ బదిలీకి చక్రం తిప్పినట్లు సమాచారం. రెండు నెలలుగా అంతర్గత చర్చ.. ఏసీపీని బదిలీ చేయాలని రెండు నెలల నుంచి ప్ర జాప్రతినిధులు భావించినట్లు తెలిసింది. తమకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఏసీపీ పనులు చేస్తున్నా రని కొందరు ప్రజాప్రతినిధులు భావించి ఆయన ను బదిలీ చేయించాలని ఓ ప్రజాప్రతినిధికి లేఖలు రాసినట్లు సమాచారం. ఈ లేఖలను ఆధారంగా చేసుకుని ఓ పోలీస్ అధికారి అభిప్రాయం మేరకు ఏసీపీ బదిలీ జరిగినట్లు తెలిసింది. రెండు నెలలుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి తెలంగాణవ్యాప్తంగా 16 మంది ఏసీపీలు, డీఎస్పీల బదిలీలో ఏసీపీ పేరుండడం నగర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీని ఆపాలని సదరు ఏసీపీ ఎవరి వద్దకు వెళ్లలేదని తెలిసింది. రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్నికల కోసమేనా..? ఎక్కుడగా లాంగ్‌స్టాండింగ్ ఉన్న అధికారులను బ దిలీ చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండాలనే ఇద్దరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో పదినెలల కాలం ఉన్నప్పటికీ తమకు అనుకూలంగా ఉండే వారిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఏసీపీ బదిలీ జరిగినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..
నిజామాబాద్ అర్బన్: దళిత విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. సామూహిక అత్యాచారం కేసు వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన నవీన్‌కుమార్‌కు, బాధిత విద్యార్థినితో పరిచయం ఉంది. మంగళవారం నవీన్, మరో ఇద్దరు కలసి ఆమెను తీసుకుని నగర శివారుతోపాటు అంకాపూర్ తదితర ప్రాంతాల్లో తిరిగారు. అక్కడ ఆమెకు బిర్యాని తినిపించడంతోపాటు మభ్యపెట్టి మద్యం తాగించారు. అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మర మ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అక్కడే ఎదురుగా ఉన్న షాపింగ్‌మాల్ సెక్యూరిటీ గార్డ్ గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సెక్యూరిటీ గార్డు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి విద్యార్థినిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నవీన్‌తో పాటు గంజి చంద్రశేఖర్, తుమ్మ భానుప్రకాశ్, సిరిగాద చరణ్, షేక్ కరీం, పి.గంగాధర్ పాల్గొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ఐదుగురిని బుధవారం అరెస్టు చేయగా, ఒకరిని గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
భారీ మోసం: సెలైన్ నింపి రెమిడెసివిర్‌గా బురిడీ
నిజామాబాద్ అర్బన్: రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఖాళీ బాటిల్లో సెలైన్ వాటర్ నింపి బ్లాక్‌లో రూ.30 వేలకు విక్రయించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన మహేశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇటీవల కరోనా వైరస్ సోకగా ఆర్మూర్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రిలో ఈనెల 22న చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తీసుకెళ్లిపోవాలని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో బాధితుడి బంధువులు మహేశ్‌ను నిజామాబాద్‌లోని అంకం ప్రైవేటు ఆస్పత్రిలో ఈ నెల 24న చేర్చారు. అక్కడి వైద్యులు రెమిడెసివిర్ ఇంజెక్షన్ తెచ్చుకోవాలని చెప్పడంతో.. మహేశ్ తమ్ముడు రంజిత్ ఇంజెక్షన్ల కోసం ఆర్మూర్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రిని సంప్రదించాడు. అక్కడి వైద్యుడు సాయికృష్ణనాయుడు నిజామాబాద్‌లోని శ్రీకాంత్‌గౌడ్‌ను కలవాలని సూచించాడు. నిజామాబాద్‌లోని తిరుమల ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీకాంత్‌గౌడ్ రోజువారీ వేతనంతో మేల్ స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నాడు. శ్రీకాంత్‌గౌడ్‌ను రంజిత్ కలవగా రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఒక్కోటి రూ.30 వేలు ఉంటుందని చెప్పాడు. గత్యంతరం లేక మూడు ఇంజెక్షన్లను రూ.90 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం మళ్లీ మరో 3 ఇంజెక్షన్లను రూ.90 వేలకు కొన్నాడు. రెండోసారి కొనుగోలు చేసిన మూడు ఇంజెక్షన్లు నకిలీవని అంకం ఆస్పత్రి వైద్యుడు అనుమానించాడు. ఆ ఇంజెక్షన్లు వాడినట్లు మార్క్‌లు కన్పించడంతో పరిశీలించి అందులో సెలైన్ వాటర్ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని కరోనా బాధితుడు మహేశ్‌కు తెలిపాడు. మహేశ్ తన తమ్ముడు రంజిత్‌కు చెప్పగా, ఆయన వెళ్లి శ్రీకాంత్‌గౌడ్‌ను నిలదీశాడు. దీంతో ఆ మూడు ఇంజెక్షన్ల డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు. అయితే ఈ సంఘటనపై ఒకటో టౌన్ పోలీసులకు రంజిత్ ఈ నెల 26న ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తిరుమల ఆస్పత్రిపై దాడి చేసి శ్రీకాంత్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజం ఒప్పుకొన్నాడు. తిరుమల ఆస్పత్రిలో వాడిపారేసిన రెమిడెసివిర్ ఖాళీ బాటిల్లో నిందితుడు సెలైన్ వాటర్ నింపినట్లు గుర్తించారు. లైఫ్‌లైన్ ఆస్పత్రి వైద్యుడు సాయికృష్ణనాయుడు, ఇంజెక్షన్లు విక్రయించిన శ్రీకాంత్‌గౌడ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మూడు నకిలీ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎంతమందికి సెలైన్ వాటర్‌ను రెమిడెసివిర్ ఇంజెక్షన్లుగా విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. . చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. నిజామాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సెలైన్ వాటర్‌తో నింపిన రెమెడిసివర్ వ్యాక్సిన్ -
గుట్కా కేసుల దర్యాప్తు అటక పైకే!
సాక్షి, నిజామాబాద్ అర్బన్: గుట్కా కేసుల దర్యాప్తులో పోలీసులు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారా..? కావాలనే ఆయా కేసులను తొక్కి పెడుతున్నారా..? అసలు సూత్రధారులను వదిలి అమాయకులను పట్టుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గుట్కా కేసుల దర్యాప్తులో పోలీసులు పెద్దగా పురోగతి సాధించక పోవడం వల్లే ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. అక్రమంగా గుట్కా తరలిస్తుండగా పట్టుకుని కేసులు పెట్టిన పోలీసులు.. అసలు సూత్రధారులెవరో తేల్చలేకపోయారు. రూ. కోట్లల్లో జరుగుతోన్న ఈ చీకటి దందా వెనుక ఉన్న కీలక వ్యక్తులెవరో గుర్తించలేకపోయారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు పేరిట పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నగరంలోని ముజాయిద్‌నగర్‌లో రూ.15 లక్షల విలువైన గుట్కా పట్టుబడిన కేసులో ఇంత వరకు పెద్దగా పురోగతి సాధించలేక పోయారు. అటకెక్కినట్లే..? జిల్లాలో ప్రతి నెలా కోట్ల రూపాయల అక్రమ గుట్కా దందా కొనసాగుతోంది.. ప్రభుత్వం గుట్కాలను నిషేధించడంతో అక్రమార్కులు హైదరాబాద్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రాత్రి వేళ వాహనాల ద్వారా జిల్లా కేంద్రానికి గుట్కా తరలిస్తున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా సరుకు పంపిణీ చేస్తున్నారు. అయితే, ఈ దందా వెనుక ఉన్న వారి గురించి పట్టించుకోని పోలీసులు.. కిరాణషాపులు, చిరు వ్యాపారులపై దాడులు చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అంతే కాని బడా వ్యాపారుల సంగతి చూడడం లేదు. ప్రస్తుతం ముజాయిద్నగర్కు సంబంధించి గుట్కా కేసులో 20 రోజులు గడుస్తున్నా అసలు నిందితులను ఇంత వరకూ గుర్తించలేక పోయారు. గుట్కా పట్టుకునే సమయంలో బడా వ్యాపారులు అక్కడే ఉన్నా పట్టుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే కాలయాపన..! ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోందన్నది బహిరంగ రహస్య మే! తన పలుకుబడితో పోలీసులను ‘మేనేజ్’ చేసుకుంటూ కేసులు ముందుకు సాగకుండా చేస్తున్నట్లు సమాచారం. అందుకే, గత కొన్నేళ్లుగా గుట్కా పట్టుబడిన కేసుల్లో సంబంధిత వాహన డ్రైవర్లపైనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. అసలు సూత్రధారి ఎవరో తేల్చలేక పోతున్నారని ప్రచారం సాగుతోంది. కేసుల విషయంలో పోలీసులు ‘మామూలు’గానే వ్యవహరిస్తూ దర్యాప్తు పేరిట కావాలనే కాలయాపన చేయడం పరిపాటిగా మారింది. ♦ రెండేళ్ల క్రితం ధర్మపురి హిల్స్‌లో రూ.30 లక్షల విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న కొందరు కూలీలను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, ఇంతవరకూ దీని వెనుక ఉన్న వారిని మాత్రం బయటకు తేలేక పోయారు. ♦ కంటెయినర్లో గుట్కా తరలిస్తుండగా, పోలీసులు వెంట పడడంతో నిందితులు జానకంపేట వద్ద కంటెయినర్‌ను వదిలేసి పారి పోయారు. ఈ కేసు అడుగు ముందుకు కదలడం లేదు. ♦ ఇక, పక్కా సమాచారంతో కాలూరు వద్ద గుట్కా కంటెయినర్‌ను పట్టుకున్న పోలీసులు... ఆ తర్వాత వదిలేసినట్లు అప్పట్లో బహిరంగంగానే చర్చ జరిగింది. ♦ గత నెలలో నగరంలోని ముజాయిద్‌నగర్‌లో రూ.15 లక్షల విలువైన గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వాహన డ్రైవర్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కానీ గుట్కాను ఎక్కడకు తరలిస్తున్నారు, ఎక్కడ విక్రయిస్తున్నారు.. ఈ దందా వెనుక ఎవరున్నది తేల్చలేక పోయారు. ♦ ఇలా చెప్పుకుంటే బోలెడు ఉదాహరణలు. గుట్కా పట్టుబడితే వాహన డ్రైవర్లపై కేసులు పెట్టడం, ఆ తర్వాత అటకెక్కించడం. ఇదే పరిపాటిగా మారింది తప్పితే అసలు సూత్రధారులను పట్టుకోవడం లేదు. విచారణ కొనసాగుతోంది.. ముజాయిద్‌నగర్‌లో పట్టుబడిన అక్రమ గుట్కా వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. దీని వెనుక ఎవరు ఉన్నా పట్టుకుంటాం. త్వరలోనే అసలు నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – ఆంజనేయులు, ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో -
బాలుడి కిడ్నాప్ సుఖాంతం
కామారెడ్డి క్రైం: ఆటోలో పడుకోబెట్టిన రెండేళ్ళ బాలుడు అకస్మాత్తుగా కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని 16 గంటల్లోనే చేదించారు. కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌పాల్, కిరణ్‌పాల్ దంపతులు కొంత కాలం గా కామారెడ్డిలో నివాసం ఉంటూ వీక్లీ మార్కెట్ లోని రాజరాజేశ్వరీ ఆలయం వద్ద జ్యూస్ బండి నడిపిస్తున్నారు. వారికి హర్షిత్‌పాల్ అనే రెండేళ్ళ కుమారుడు ఉన్నాడు. రోజూ మాదిరిగానే గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జ్యూస్ బండి వద్ద పనులు చేసుకుంటుండగా హర్షిత్‌పాల్ నిద్రపోయాడు. తల్లిదండ్రులు బాలుడిని జ్యూస్ బండి వెనుక పార్కింగ్ చేసి ఉంచిన ఓ ఆటోలో పడుకోబెట్టారు. కొద్ది సేపటి తర్వాత చూస్తే బాలుడు కన్పించలేదు. చుట్టుపక్కల గాలించినా కన్పించకపోవడంతో ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పట్టణ ఎస్హెచ్ఓ రామకృష్ణ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు పట్టణంలో రాత్రంతా విస్తృతంగా గాలించారు. వీక్లీ మార్కెట్ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. పట్టించిన మూడో కన్ను.. కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోశించాయి. తల్లిదండ్రులు వ్యాపారం పనులు చేసుకుంటూ ఉండగా ఓ మహిళ బాలుడిని ఎత్తుకెళ్లినట్లు సీసీ పుటేజీల్లో కన్పించింది. సదరు మహిళ అతడిని ఎటువైపు తీసుకుని వెళ్లింది. మహిళా కిడ్నాపర్ ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించి జరిపారు. శుక్రవారం ఉదయం ఓ కల్లు దుకాణం వద్ద అనుమానాస్పదంగా ఓ మహిళ ఉందనే సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మహిళా కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సొమ్ము చేసుకునేందుకే.. బాలుడి కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి రావడం శుక్రవారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. మహిళా కిడ్నాపర్‌ను పట్టణంలోని బతుకమ్మకుంట కాలనీకి చెందిన దండ్ల గంగమ్మగా గుర్తించారు. ఆమె భర్తతో విడిపోయి కొంతకాలంగా ఒంటరిగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. బాలు డిని ఎక్కడైనా విక్రయించి సొమ్ముచేసుకోవాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్‌నకు ఒడిగట్టిందన్నారు. సదరు మహిళను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. కేసు ఛేదనలో 16 గంటలపాటు శ్రమించి బాలుడి ఆచూకీ కనుగొన్న ఎస్హెచ్ఓ రామకృష్ణ, ఎస్ఐ గోవింద్, ఏఎస్ఐ నరేందర్, సిబ్బంది రవి, సాయిబాబా, నీలేష్, పవన్, శ్రావన్, రాములును అభినందించారు. అంతేగాకుండా కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోశించాయన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిఘా నేత్రంలో పల్లెలు
బీర్కూర్(బాన్సువాడ): నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులకు సీసీ కెమెరాలు సాయమందిస్తున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా పలు మండల కేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లో స్థానిక పోలీసులు పలు కూడళ్లలో కెమెరాలను ఏర్పాటు చేశారు. బీర్కూర్ మండల కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల్లో పోలీసులు ఈ చలాన్‌ను అమలు చేస్తున్నారు. దీనిని పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటోంది. రాత్రివేళల్లో దొంగతనాలు జరుగకుండా, గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించివారిపై నిఘాను పెంచారు. బీర్కూర్ మండల కేంద్రంతోపాటు నస్రుల్లాబాద్, బాన్సువాడ వంటి మండలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు గతంలో గ్రామాల్లో దొంగతనాలతోపాటు ఇతర నేరాలు జరిగే సందర్బంలో కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించేవారు. అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారణ చేసి కేసును పరిష్కరించేవారు. అయితే తెలంగాణ ఏర్పాటైనన తరువాత ప్రభుత్వం నేరాల అదుపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దీనిలో భాగంగానే గ్రామస్తుల సహకారంతో పోలీసులు ప్రతీ గ్రామంలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడైనా నేరం జరిగినట్లు తెలిస్తే వెంటనే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకుంటున్నారు. దీనివల్ల కేసులను పరిష్కరించడంలో వేగం వచ్చిందని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే మానిటరింగ్.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేసేందుకు పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా మానిటరింగ్ టీవీలను ఏర్పాటు చేసి నిత్యం ఎస్సై వాటిని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ కెమెరాలతో ఎంతో ఉపయోగం ఉందని బీర్కూర్ ఎస్సై పూర్ణేశ్వర్ వివరించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగితే చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు. రోజూ పోలీస్ స్టేషన్లో గ్రామాల వారిగా సీసీ కెమెరాలను పరిశీలించి అనుమాన్పదంగా ఉంటే వెంటనే విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామాలవారిగా వివరాలు.. బీర్కూర్ గ్రామంలో 13 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, దామరంచలో 11, భైరాపూర్‌లో 4, మల్లాపూర్‌లో 4, బరంగేడ్గి గ్రామంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేనుసైతంలో భాగంగా మండలవ్యాప్తంగా మరో 31 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు బీర్కూర్‌లో ట్రాక్టర్ యూనియన్ వారు రూ.80 వేలు విరాళాలు అందించగా కిరాణా అసోసియేషన్ వారు రూ.25 వే లు, హనుమాన్ ఆలయ కమిటీ రూ.5వేలు, క్రషర్ వారు రూ.20 వేలు, రాజస్థాన్ స్వీట్స్ వారు రూ.3 వేలు విరాళంగా ఇచ్చారని ఎస్సై వివరించారు. ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభం జిల్లా ఎస్పీ శ్వేత చేతులమీదుగా బీర్కూర్ మండలంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేస్తూ అన్ని గ్రామాలతోపాటు పలు మండలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయించేలా జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కెమెరాల ఏర్పాటు వేగవంతమైంది. నేరాల నియంత్రణకు.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. బీర్కూర్ మండలంలో కెమెరాల ఏర్పాటు వలన ఎన్నికల సమయంలో గొడవలు జరగకుండా చూస్తున్నాం. పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు దుకాణదారులు, హోటల్ యజమానులు సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. –ఎస్సై పూర్ణేశ్వర్ (బీర్కూర్) -
హెల్మెట్ ఉంటేనే..బైక్‌పై రోడ్డెక్కాలి
‘‘ఖాకీ దుస్తుల్లో పోలీసులు బైకుపై వెళ్లాలంటే.. కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్ లేకుండా రోడ్లపై కనిపించొద్దు’’ అన్న ఉన్నతాధికారుల ఆదేశాలను జిల్లా పోలీసులు పాటిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బండిని రోడ్డెక్కించడానికి వెనుకాడుతున్నారు. బైక్‌పై దాదాపుగా తలకు హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారు.సాక్షి, కామారెడ్డి: హెల్మెట్ వాడకాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ ధరించకుండా బైక్‌లు నడిపేవారికి జరిమానాలు విధిస్తూ, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే అందరికీ అవగాహన కల్పించడం, నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించేముందు మనం కూడా నిబంధనలు పాటించాల్సిందే అని, ఖా కీ దుస్తుల్లో బైక్‌పై వెళ్లేవారందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల తో జిల్లాలోని పోలీసులు హెల్మెట్ ధరిస్తున్నా రు. జిల్లా పోలీసు కార్యాలయానికిగాని, సబ్ డివిజనల్ కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లకు, కోర్టు డ్యూటీలకు వెళ్లేవారుకాని, పెట్రోలింగ్ డ్యూటీలు చేసేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టంగా పేర్కొనడంతో ఇటీవల చాలా మంది పోలీసు సిబ్బంది హెల్మెట్లు కొనుగోలు చేశారు. ప్రతిరోజు ఇంటి నుంచి వెళ్లేటపుడు కచ్చితంగా హెల్మెట్‌తోనే కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో డీపీవోలో పనిచేసే సిబ్బంది, సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా హెల్మెట్లు ధరిస్తున్నారు. ఎక్కడైనా హెల్మెట్ లేకుండా ఖాకీ దుస్తుల్లో పోలీసు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో అందరూ హెల్మెట్ వాడకానికి అలవాటు పడుతున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హోంగార్డు తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్మెట్ తప్పనిసరి చేశారు. హెల్మెట్ లేకుండా జిల్లా పోలీసు కార్యాలయ గేట్లోనికి అనుమతి కూడా ఇవ్వడం లేదు. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ అన్న బోర్డులు ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకుండా వెళ్లినపుడు ఏం జరిగినా అధికారుల నుంచి చివాట్లు తప్పవన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను వాడుతున్నారు. మహిళా కానిస్టేబుళ్లు కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. పోలీసులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా ఉండవచ్చని, తద్వారా హెల్మెట్ ధరించమని ప్రజలకు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులందరూ హెల్మెట్ ధరిస్తూ ప్రజలు కూడా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. -
తప్పిపోతున్నారు..
కామారెడ్డి క్రైం : ముక్కుపచ్చలారని చిన్నారులు.. ఆడుకోవడమే వారికి సరదా. తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లడమంటే మరీ ఇష్టం. ఆడుకుంటున్నా, తోడుగా వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని విస్మరిస్తే అంతే సంగతులు. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచెత్తే బోసి నవ్వులు కనిపించకుండా పోతాయి! తలిదండ్రులు, కుటుంబసభ్యులు చేస్తున్న కొన్ని పొరపాట్లు పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇంటా బయటా, ఎక్కడున్నా చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు గుర్తుచేస్తున్నాయి. పిల్లల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా భారీ మూల్యం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు తప్పిపోయిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. పక్షం వ్యవధిలో ఇద్దరు చిన్నారులు.. జిల్లా కేంద్రంలో పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. వారిలో ఓ బాలుడు ఏకంగా కిడ్నాప్‌నకు గురయ్యాడు. అజాంపుర కాలనీకి చెందిన ఫాతిమా తన ఏడేళ్ల కుమారుడు సయ్యద్ అయాన్‌తో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలోని ఆమె వెళ్లగా బాలుడు బయట ఆడుకుంటున్నాడు. బాలుడిపై కన్నేసిన నజీరొద్దిన్ అనే వ్యక్తి అయాన్‌ను కిడ్నాప్ చేసి ఆటోలో వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన తల్లి బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఐదున్నర గంటలపాటు గాలించి నసీరొద్దిన్ ఇంట్లో బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మరో బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన లక్ష్మీపతి దంపతులు ఆస్పత్రి పనిమీద కామారెడ్డికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. పాతబస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకునేందుకు లోనికి వెళ్లారు. వారి కుమారుడు ఆరేళ్ల కృష్ణమూర్తి ఆస్పత్రి వరండాలో ఆడుకుంటూ తప్పిపోయాడు. అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు, పోలీసులు చుట్టు పక్కల అంతటా గాలించి ఓ మెడికల్ వద్ద బాలుడిని గుర్తించారు. అయాన్, కృష్ణమూర్తి అనే ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడంలో వారి తల్లిదండ్రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో చేసిన పొరపాట్లే కారణమని పోలీసులు, స్థానికులు భావించారు. ఇవేకాకుండా గత డిసెంబర్లో పాత బాన్సువాడకు చెందిన లోకేష్ అనే ఐదేళ్ల బాలుడు తప్పిపోగా చిల్లర్గి గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఆ బాలుడిని తీసుకెళ్లిపోయారు. అప్పట్లో ఈ సంఘటన కలకలం రేపింది. చివరికి పోలీసులు కేసును చేధించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతకుముందు కోటగిరికి చెందిన ఓ బాలుడిని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు కేసు ఛేదించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మొన్నటికి మొన్న నందిపేట మండలం వన్నెల్(కే) గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప మనీశ్వరిని మరో మహిళ పాఠశాల నుంచి కిడ్నాప్ చేయగా కేరళలో వారిని గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ దొరకని గణేష్ ఆచూకీ.. కామారెడ్డిలోని భరత్నగ ర్ కాలనీకి చెందిన మూ డేళ్ల వయస్సు గల కటికె గణేష్ ఇంటి ముందు ఆడుకుంటుండగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసే సరికి తప్పిపోయాడు. ఏప్రిల్‌లో జరిగిన బాలుడి అదృశ్యం కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గణేష్ ఆచూకీ కోసం పట్టణంతో పాటు జిల్లా అంతటా వడపోశారు. అయినా లభించలేదు. బాలుడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అందరూ భావించారు. గణేష్ తప్పిపోయి నాలుగు నెలలు దాటినా ఇప్పటికి అతడి జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం కూడా అతడి ఆచూకీ తెలియకపోవడానికి కారణమైంది. -
డీఎస్ తనయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
అజ్ఞాతంలోకి సంజయ్.. పోలీసుల గాలింపు
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదుకాగా, అరెస్ట్ చేయడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు సంజయ్ ఇంటికి వెళ్లారు. అయితే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. (శాంకరి కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాం) సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించిన విషయం విదితమే. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. 'అది టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం' -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్, హైదరాబాద్‌లలో చోరీలకు పాల్పడిన ఢిల్లీ దొంగల ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన నిజామాబాద్ పోలీసులు వారి నుంచి 18 తులాల బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదివారం నిజామాబాద్‌లో కేసుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన గోవింద ఖోలీ టెంట్‌హౌస్ నిర్వహిస్తుండగా, అతడి వద్ద కమల్‌యాదవ్ పనిచేస్తున్నాడు. గోవిందకు వ్యాపారం కలసిరాకపోవడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అజ్మీర్‌లో ఉండే గోవింద బావమరిది కపిల్‌శర్మ, అతడి మిత్రుడు రాజస్థాన్‌లోని బారోడ్నగర్కు చెందిన కలుతోపాటు కమల్‌యాదవ్ స్నేహితుడైన ఉత్తరప్రదేశ్‌లోని చత్తరిఘాట్కు చెందిన కృష్ణకుమార్ యాదవ్‌లతో ప్రణాళిక రూపొందించాడు. ఈ నెల 7న గోవింద, కమల్‌యాదవ్, కలు, కృష్ణకుమార్‌లను తన కారు (డీఎల్ 10 సీసీ 1437)లో ఎక్కించుకుని అజ్మీర్‌లో ఉంటున్న కపిల్‌శర్మ వద్దకు వెళ్లారు. అంతా కలిసి 8వ తేదీన అజ్మీర్ నుంచి బయలుదేరి 9న రాత్రి నాందేడ్‌కు చేరుకుని అక్కడే బస చేశారు. 10న మధ్యాహ్నం నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడి భవానీనగర్‌కు చెందిన తమ్మిశెట్టి సత్తయ్య ఇంట్లో చొరబడి 26 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.7 వేలు ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నాలుగో టౌన్ పోలీసులు.. చోరులు సంచరించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లు పరిశీలించారు. ఇందల్వాయి, తూప్రాన్ టోల్గేట్ల మీదుగా వారి కారు ప్రయాణించినట్లుగా, దొంగలు హైదరాబాద్ వైపు వెళ్లినట్లుగా నిర్ధారించుకున్నారు. పోలీసులు వారికోసం రాజధానిలో వేట కొనసాగించారు. అయితే, నిందితులు ఆ మరుసటి రోజే (11వ తేదీ) కేపీహెచ్‌బీ కాలనీ, వసంతనగర్, అనంతరం అల్వాల్‌లో నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారు. శనివారం నిజామాబాద్ వైపు కారులో వస్తున్న దొంగలను బోర్గాం(పీ) వద్ద పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి 18 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు, సెల్ఫోన్లు, ఇనుపరాడ్లు, కెమెరా, చోరీలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ ఆనంద్‌కుమార్, నగర సీఐ సుభాష్ చంద్రబోస్, ఎస్సై మధు, కానిస్టేబుల్స్‌కు సీపీ నగదు రివార్డు అందజేశారు. -
గల్ఫ్ మోసాలపై ఉక్కుపాదం
పోలీస్ కమిషనర్ కార్తికేయ నిజామాబాద్ క్రైం : గడిచిన మూడేళ్లలో నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 50 గల్ఫ్ కేసులు నమోదు అయ్యాయని, ఇక నుంచి గల్ఫ్ మోసాలపై ఉక్కు పాదం మోపాలని పోలీస్ కమిషనర్ కార్తి్తకేయ కిందిస్థాయి పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం సీపీ కార్యాలయంలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గల్ఫ్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన టీమ్‌ను ఏసీపీ అధికారి నేతృత్వంలో ముగ్గురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేశామన్నారు. ట్రావెల్ ఏజెంట్లు మోసపూరితమైన వీసా, పాస్‌పోర్టు ఇప్పించిన వారి వివరాలు సేకరిస్తామన్నారు. మాబ్ ఆపరేషన్‌పై అవగాహన.. సంఘవిద్రోహ శక్తులు విధ్వంసకర చర్యలకు పాల్పడినప్పుడు వారిని ఎదుర్కొనే చర్యలు మాబ్ ఆపరేషన్‌పై పోలీస్ కమిషనర్ కార్తీకేయ పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. గురువారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి మాబ్ ఆపరేషన్‌పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు విధ్వంసకర చర్యలకు పాల్పడినప్పుడు వారి ఆగడాలను ఏ విధంగా అడ్డుకుని నివారించాలో మెళకువలపై తరగతులను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సయ్యద్ అన్వర్ హుస్సేన్, ఆర్ఐ సీహెచ్ మల్లికార్జున్, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. -
ఇద్దరు అరెస్ట్: 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్‌లో పోలీసులు శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకీతోపాటు 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు -
కిడ్నాప్‌కు గురైన పసికందు ఆచూకీ లభ్యం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పసికందు అదృశ్యమైన కేసును నిజామాబాద్ పోలీసులు మంగళవారం చేధించారు. వివరాలు.. ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 7 రోజుల ఆడ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ మాయమైందని తల్లి, కుటుంబసభ్యుల ఆందోళనకు దిగడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో బోధన్‌కు చెందిన అనీషా బేగం, నందిపేటకు చెందిన సుజాత కలిసి పథకం ప్రకారం ఎత్తుకెళ్లినట్లు తెలుసుకుని వారిని పట్టుకున్నారు. వారి నుంచి పాపను స్వాధీనం చేసుకుని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. సంతానం లేకపోవటంతోటే సుజాతఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.