అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ | nizamabad police arrest interstate criminals | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Published Sun, Jun 25 2017 8:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

nizamabad police arrest interstate criminals

నిజామాబాద్‌ క్రైం (నిజామాబాద్‌ అర్బన్‌): నిజామాబాద్‌, హైదరాబాద్‌లలో చోరీలకు పాల్పడిన ఢిల్లీ దొంగల ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన నిజామాబాద్‌ పోలీసులు వారి నుంచి 18 తులాల బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదివారం నిజామాబాద్‌లో కేసుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన గోవింద ఖోలీ టెంట్‌హౌస్‌ నిర్వహిస్తుండగా, అతడి వద్ద కమల్‌యాదవ్‌ పనిచేస్తున్నాడు. గోవిందకు వ్యాపారం కలసిరాకపోవడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇందుకు అజ్మీర్‌లో ఉండే గోవింద బావమరిది కపిల్‌శర్మ, అతడి మిత్రుడు రాజస్థాన్‌లోని బారోడ్‌నగర్‌కు చెందిన కలుతోపాటు కమల్‌యాదవ్‌ స్నేహితుడైన ఉత్తరప్రదేశ్‌లోని చత్తరిఘాట్‌కు చెందిన కృష్ణకుమార్‌ యాదవ్‌లతో ప్రణాళిక రూపొందించాడు. ఈ నెల 7న గోవింద, కమల్‌యాదవ్, కలు, కృష్ణకుమార్‌లను తన కారు (డీఎల్‌ 10 సీసీ 1437)లో ఎక్కించుకుని అజ్మీర్‌లో ఉంటున్న కపిల్‌శర్మ వద్దకు వెళ్లారు. అంతా కలిసి 8వ తేదీన అజ్మీర్‌ నుంచి బయలుదేరి 9న రాత్రి నాందేడ్‌కు చేరుకుని అక్కడే బస చేశారు. 10న మధ్యాహ్నం నిజామాబాద్‌కు చేరుకున్నారు.

ఇక్కడి భవానీనగర్‌కు చెందిన తమ్మిశెట్టి సత్తయ్య ఇంట్లో చొరబడి 26 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.7 వేలు ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నాలుగో టౌన్‌ పోలీసులు.. చోరులు సంచరించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లు పరిశీలించారు. ఇందల్వాయి, తూప్రాన్‌ టోల్‌గేట్ల మీదుగా వారి కారు ప్రయాణించినట్లుగా, దొంగలు హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లుగా నిర్ధారించుకున్నారు. పోలీసులు వారికోసం రాజధానిలో వేట కొనసాగించారు.

అయితే, నిందితులు ఆ మరుసటి రోజే (11వ తేదీ) కేపీహెచ్‌బీ కాలనీ, వసంతనగర్, అనంతరం అల్వాల్‌లో నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారు. శనివారం నిజామాబాద్‌ వైపు కారులో వస్తున్న దొంగలను బోర్గాం(పీ) వద్ద పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి 18 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు, సెల్‌ఫోన్లు, ఇనుపరాడ్లు, కెమెరా, చోరీలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ ఆనంద్‌కుమార్, నగర సీఐ సుభాష్‌ చంద్రబోస్, ఎస్సై మధు, కానిస్టేబుల్స్‌కు సీపీ నగదు రివార్డు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement