interstate criminals
-
సైబర్ నేరగాడి అరెస్ట్
కడప అర్బన్: అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్‌కు చెందిన ఎంఓ జలాల్‌ఖాన్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరికొందరి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి రూ.2.05 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద వున్న ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో బుధవారం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. జలాల్ఖాన్, అతడి స్నేహితులు తన్వీర్ ఆలం, ఇపజిడ్ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన నంబర్లకు ట్రూకాలర్ ద్వారా ఫోన్ చేస్తూ డబ్బు కోసం వేధించడం మొదలెడతారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా బద్వేల్ టౌన్ సుమిత్రానగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అల్లూరి మోహన్ నంబరుకు ఫోన్ చేశారు. వాట్సాప్ ద్వారా లోన్ తీసుకున్నావని, తాము చెప్పిన మొత్తం చెల్లించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించసాగారు. తాను లోన్ తీసుకోలేదని చెప్పినా పదేపదే బెదిరింపు కాల్స్ చేసేవారు. బాధితుడి ఫొటోలు మార్ఫింగ్ చేసి న్యూడ్‌గా కుటుంబసభ్యులకు పంపించారు. వారికి భయపడిన మోహన్ పలు దఫాలుగా సుమారు రూ.లక్ష అరవై వేలు పంపాడు. ఇక తాను ఇవ్వలేనని చెప్పినా వేధింపులు మానకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బద్వేల్ పోలీసులు అక్టోబర్ 14న కేసు నమోదు చేశారు. ఈ కేసును జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కడప అదనపు ఎస్పీ తుషార్ డూడీ, మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్ల పర్యవేక్షణలో బద్వేల్ అర్బన్ సీఐ జి.వెంకటేశ్వర్లు, కడప సైబర్‌క్రైం సీఐ శ్రీధర్‌నాయుడు ఆధ్వర్యంలో రెండు టీములు ఏర్పాటు చేశారు. బాధితుడు డబ్బు చెల్లించిన యూపీఐ ఐడీలను సేకరించి, వాటి ద్వారా నిందితులు ఉపయోగించిన అకౌంట్ వివరాలను సేకరించారు. వాటి ద్వారా కేసు విచారణలో లోన్ యాప్‌ల ద్వారా మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు ఎంఓ జలాల్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం అరెస్టయిన నిందితుడు జలాల్ఖాన్, అతని స్నేహితులపై 14 రాష్ట్రాల్లో 58 ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్) ఫిర్యాదులున్నాయి. వీరికి ఉన్న 7 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి రూ.2.05 కోట్లు ఫ్రీజ్ చేయించారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ విభాగాలకు పంపిస్తామని ఎస్పీ వివరించారు. -
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా ఆటకట్టు
కడప అర్బన్: ఆన్లైన్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు మంగళవారం రాత్రి మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప జిల్లాలోని మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండలం ఎన్.గొల్లపల్లికి చెందిన దేవరకొండ జగదీశ్వరి అనే మహిళకు 2021 జనవరి 11న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆమె తండ్రి తనకు బాగా తెలుసునని నమ్మబలికాడు. తాను బి.మఠం ఏఎస్ఐ అని, తమ బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని.. రూ.40 వేల సర్దితే..గంటలోనే కానిస్టేబుల్ ద్వారా తిరిగి డబ్బు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆయన మాటలు నమ్మిన జగదీశ్వరి ఫోన్‌పే ద్వారా రూ.40,000 పంపింది. డబ్బు పడ్డ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో జగదీశ్వరి తన తండ్రి దేవరకొండ క్రిష్ణయ్యకు విషయం చెప్పింది. ఆయన ఫిర్యాదు మేరకు బి.మఠం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో మరికొంతమందితో కలసి దువ్వూరులో రూ.70 వేలు, ఎర్రగుంట్ల పీఎస్ పరిధిలో రూ.40 వేలు, చిట్వేలిలో రూ.19 వేలు అమాయకుల నుంచి కాజేశారు. ఆయా కేసుల దర్యాప్తులో.. తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన దువ్వాసి భరత్‌ను.. సూర్యాపేట్ జిల్లా మోతే మండలం, లాలు తాండకు చెందిన కీలుకాని సాయిచంద్గా గుర్తించారు. మంగళవారం రాత్రి వీరు మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉండగా..పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పీడీ యాక్ట్ ఉన్న హైదరాబాద్‌కు చెందిన శరత్‌రెడ్డి కూడా ఈ కేసుల్లో నిందితుడిని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్ తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో వ్యభిచారం
సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగాల పేరుతో ముంబయ్‌కి చెందిన మహిళలను నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను పట్టుకున్న పోలీసులు ఇద్దరు యువతులకు వ్యభిచారం నుంచి విముక్తి కల్పించారు. పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపినమేరకు..బిహార్ రాష్ట్రానికి చెందిన మిథిలేష్ శర్మ, రాజనీశ్ రాజన్‌లు గత కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహ్తిన్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళల అక్రమ రవాణాదారులతో సంబంధాలున్న వీరు అక్కడి నుంచి అమ్మాయిలను రప్పించేవారు. ఈ విధంగానే ముంబయ్ సమీపంలోని పాల్ఘర్ జిల్లా నాలాసొపార పట్టణానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రప్పించారు. (వేశ్యావాటిక గుట్టురట్టు) ఆ తర్వాత బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారు. యాప్రాల్‌లోని రిజిస్ట్రేషన్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్‌ను అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు మొదలెట్టారు. మిథేశ్ శర్మ తన సహచర నిర్వాహకుడు రాజనీశ్ రాజన్‌తో కలిసి రహస్యంగా కస్టమర్లను రప్పించేవాడు.అలాగే ఆయా ఇళ్లకు వచ్చే కస్టమర్లకు తగిన ఆహరంతో పాటు వారి అవసరాలను తీర్చేందుకు సుచిత్రకు చెందిన కాంబ్లీ సుఖేష్‌ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే యథావిధిగా ఎప్పటిలాగానే మంగళవారం ఇద్దరు విటులు సాయికిరణ్, సిరాజ్‌లు యాప్రాల్‌కు వచ్చారు. ఆ అమ్మాయిలతో వీరిద్దరూ ఉన్న సమయంలో అప్పటికే విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజ్గిరి జోన్ ఎస్వోటీ పోలీసులు, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాజనీశ్ రంజన్, సుఖేష్ రావణ్ కాంబ్లీ, పి.సాయికిరణ్, ఎండీ సిరాజ్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను సంరక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మితిలేష్ శర్మ కోసం గాలిస్తున్నారు. -
చిటికెలో నేరస్తుల చిట్టా
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరిగే అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు ఇకపై గుర్తించడం, వారి వివరాలు సేకరించడం సులభం కానుంది. కేంద్ర హోంశాఖ అమలు చేస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలోనూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో క్రిమినల్స్ వివరాలన్నీ డేటా బేస్‌లోకి వచ్చేశాయి. దీంతో నేరస్తుల వివరాలను అన్ని రాష్ట్రాల పోలీసులు సులువుగా తెలుసుకోనున్నారు. తొమ్మిదేళ్ల సమయం... కేంద్ర హోంశాఖ 2009లో ప్రారంభించిన సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టును ఇప్పటివరకు దశలవారీగా అమలు చేస్తూ వచ్చారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లు, ఎఫ్ఐఆర్ల అప్లోడ్, నేరస్తుల వివరాలు...ఇలా తొమ్మిది రకాల వివరాలను సీసీటీఎన్ఎస్లో అప్డేట్ చేస్తూ వచ్చారు. తొమ్మిదేళ్ల తర్వాత ప్రతి రాష్ట్రంలోని నేరస్తుల డేటా, వారికిపడ్డ శిక్షలు, పెండింగ్‌లో ఉన్న కేసులు, నిందితులు, పరారీలో ఉన్న నేరస్తుల వివరాలు, ప్రస్తుతం ఆ కేసుల స్టేటస్ వంటివన్నీ సీసీటీఎన్ఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. మార్చి మొదటి వారం నుంచి... దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని పోలీసుస్టేషన్లకు మార్చి మొదటి వారం నుంచి సీసీటీఎన్ఎస్ డేటా బేస్ అందుబాటులోకి రానుంది. రూ. 2 వేల కోట్లతో అభివృద్ది చేసిన ఈ ప్రాజెక్టులో 20 వేల పోలీస్స్టేషన్ల నుంచి డేటా అప్లోడ్ అయింది. 5 వేల మంది అధికారులు డేటాను చూసేలా అవకాశం కల్పించారు. ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, చార్జిషీట్, ఇంటర్‌లింక్ పోలీస్‌స్టేషన్, రాష్ట్ర, దేశ డేటాబేస్ సెంటర్ లింకులు, వాహనాల డేటా, వాటికి అనుసంధానమైన ఆధార్ వివరాలు, పాస్‌పోర్టు డేటా, మొదలైన 44 రకాల వివరాలను ఈ ప్రాజెక్టు ద్వారా పొందేలా సమకూర్చారు. ఈ డేటా బేస్‌ను 10 లక్షల మంది పోలీసులు నిత్యం ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. 20 లక్షల మంది నేరస్తులు... దేశవ్యాప్తంగా సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టులో అప్లోడ్ అయిన వివరాలు పోలీసులను నివ్వెరపరిచాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మంది ఆర్గనైజ్డ్ అఫెండర్స్ (వ్యవస్థీకృత నేరస్తులు) ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో 1.8 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 2.2 లక్షల మందికిపైగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నిందితులున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక నేరస్తులుండగా మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్, హైదరాబాద్‌లలో చోరీలకు పాల్పడిన ఢిల్లీ దొంగల ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన నిజామాబాద్ పోలీసులు వారి నుంచి 18 తులాల బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదివారం నిజామాబాద్‌లో కేసుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన గోవింద ఖోలీ టెంట్‌హౌస్ నిర్వహిస్తుండగా, అతడి వద్ద కమల్‌యాదవ్ పనిచేస్తున్నాడు. గోవిందకు వ్యాపారం కలసిరాకపోవడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అజ్మీర్‌లో ఉండే గోవింద బావమరిది కపిల్‌శర్మ, అతడి మిత్రుడు రాజస్థాన్‌లోని బారోడ్నగర్కు చెందిన కలుతోపాటు కమల్‌యాదవ్ స్నేహితుడైన ఉత్తరప్రదేశ్‌లోని చత్తరిఘాట్కు చెందిన కృష్ణకుమార్ యాదవ్‌లతో ప్రణాళిక రూపొందించాడు. ఈ నెల 7న గోవింద, కమల్‌యాదవ్, కలు, కృష్ణకుమార్‌లను తన కారు (డీఎల్ 10 సీసీ 1437)లో ఎక్కించుకుని అజ్మీర్‌లో ఉంటున్న కపిల్‌శర్మ వద్దకు వెళ్లారు. అంతా కలిసి 8వ తేదీన అజ్మీర్ నుంచి బయలుదేరి 9న రాత్రి నాందేడ్‌కు చేరుకుని అక్కడే బస చేశారు. 10న మధ్యాహ్నం నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడి భవానీనగర్‌కు చెందిన తమ్మిశెట్టి సత్తయ్య ఇంట్లో చొరబడి 26 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.7 వేలు ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నాలుగో టౌన్ పోలీసులు.. చోరులు సంచరించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లు పరిశీలించారు. ఇందల్వాయి, తూప్రాన్ టోల్గేట్ల మీదుగా వారి కారు ప్రయాణించినట్లుగా, దొంగలు హైదరాబాద్ వైపు వెళ్లినట్లుగా నిర్ధారించుకున్నారు. పోలీసులు వారికోసం రాజధానిలో వేట కొనసాగించారు. అయితే, నిందితులు ఆ మరుసటి రోజే (11వ తేదీ) కేపీహెచ్‌బీ కాలనీ, వసంతనగర్, అనంతరం అల్వాల్‌లో నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారు. శనివారం నిజామాబాద్ వైపు కారులో వస్తున్న దొంగలను బోర్గాం(పీ) వద్ద పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి 18 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు, సెల్ఫోన్లు, ఇనుపరాడ్లు, కెమెరా, చోరీలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ ఆనంద్‌కుమార్, నగర సీఐ సుభాష్ చంద్రబోస్, ఎస్సై మధు, కానిస్టేబుల్స్‌కు సీపీ నగదు రివార్డు అందజేశారు.