మాట్లాడుతున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
కడప అర్బన్: అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్‌కు చెందిన ఎంఓ జలాల్‌ఖాన్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరికొందరి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి రూ.2.05 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద వున్న ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్‌హాల్‌లో బుధవారం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. జలాల్‌ఖాన్, అతడి స్నేహితులు తన్వీర్ ఆలం, ఇపజిడ్ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు.
వివిధ మార్గాల ద్వారా సేకరించిన నంబర్లకు ట్రూకాలర్ ద్వారా ఫోన్ చేస్తూ డబ్బు కోసం వేధించడం మొదలెడతారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా బద్వేల్ టౌన్ సుమిత్రానగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అల్లూరి మోహన్ నంబరుకు ఫోన్ చేశారు. వాట్సాప్ ద్వారా లోన్ తీసుకున్నావని, తాము చెప్పిన మొత్తం చెల్లించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించసాగారు. తాను లోన్ తీసుకోలేదని చెప్పినా పదేపదే బెదిరింపు కాల్స్ చేసేవారు.
బాధితుడి ఫొటోలు మార్ఫింగ్ చేసి న్యూడ్‌గా కుటుంబసభ్యులకు పంపించారు. వారికి భయపడిన మోహన్ పలు దఫాలుగా సుమారు రూ.లక్ష అరవై వేలు పంపాడు. ఇక తాను ఇవ్వలేనని చెప్పినా వేధింపులు మానకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బద్వేల్ పోలీసులు అక్టోబర్ 14న కేసు నమోదు చేశారు. ఈ కేసును జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కడప అదనపు ఎస్పీ తుషార్ డూడీ, మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్‌ల పర్యవేక్షణలో బద్వేల్ అర్బన్ సీఐ జి.వెంకటేశ్వర్లు, కడప సైబర్‌క్రైం సీఐ శ్రీధర్‌నాయుడు ఆధ్వర్యంలో రెండు టీములు ఏర్పాటు చేశారు.
బాధితుడు డబ్బు చెల్లించిన యూపీఐ ఐడీలను సేకరించి, వాటి ద్వారా నిందితులు ఉపయోగించిన అకౌంట్ వివరాలను సేకరించారు. వాటి ద్వారా కేసు విచారణలో లోన్ యాప్‌ల ద్వారా మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు ఎంఓ జలాల్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద రెండు సెల్‌ఫోన్‌లను సీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం అరెస్టయిన నిందితుడు జలాల్‌ఖాన్, అతని స్నేహితులపై 14 రాష్ట్రాల్లో 58 ఎన్‌సీఆర్‌పీ (నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్) ఫిర్యాదులున్నాయి. వీరికి ఉన్న 7 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి రూ.2.05 కోట్లు ఫ్రీజ్ చేయించారు. ఈ వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐటీ విభాగాలకు పంపిస్తామని ఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment