kadapa police
-
సైబర్ నేరగాడి అరెస్ట్
కడప అర్బన్: అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్‌కు చెందిన ఎంఓ జలాల్‌ఖాన్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరికొందరి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి రూ.2.05 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద వున్న ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో బుధవారం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. జలాల్ఖాన్, అతడి స్నేహితులు తన్వీర్ ఆలం, ఇపజిడ్ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన నంబర్లకు ట్రూకాలర్ ద్వారా ఫోన్ చేస్తూ డబ్బు కోసం వేధించడం మొదలెడతారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా బద్వేల్ టౌన్ సుమిత్రానగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అల్లూరి మోహన్ నంబరుకు ఫోన్ చేశారు. వాట్సాప్ ద్వారా లోన్ తీసుకున్నావని, తాము చెప్పిన మొత్తం చెల్లించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించసాగారు. తాను లోన్ తీసుకోలేదని చెప్పినా పదేపదే బెదిరింపు కాల్స్ చేసేవారు. బాధితుడి ఫొటోలు మార్ఫింగ్ చేసి న్యూడ్‌గా కుటుంబసభ్యులకు పంపించారు. వారికి భయపడిన మోహన్ పలు దఫాలుగా సుమారు రూ.లక్ష అరవై వేలు పంపాడు. ఇక తాను ఇవ్వలేనని చెప్పినా వేధింపులు మానకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బద్వేల్ పోలీసులు అక్టోబర్ 14న కేసు నమోదు చేశారు. ఈ కేసును జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కడప అదనపు ఎస్పీ తుషార్ డూడీ, మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్ల పర్యవేక్షణలో బద్వేల్ అర్బన్ సీఐ జి.వెంకటేశ్వర్లు, కడప సైబర్‌క్రైం సీఐ శ్రీధర్‌నాయుడు ఆధ్వర్యంలో రెండు టీములు ఏర్పాటు చేశారు. బాధితుడు డబ్బు చెల్లించిన యూపీఐ ఐడీలను సేకరించి, వాటి ద్వారా నిందితులు ఉపయోగించిన అకౌంట్ వివరాలను సేకరించారు. వాటి ద్వారా కేసు విచారణలో లోన్ యాప్‌ల ద్వారా మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు ఎంఓ జలాల్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం అరెస్టయిన నిందితుడు జలాల్ఖాన్, అతని స్నేహితులపై 14 రాష్ట్రాల్లో 58 ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్) ఫిర్యాదులున్నాయి. వీరికి ఉన్న 7 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి రూ.2.05 కోట్లు ఫ్రీజ్ చేయించారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ విభాగాలకు పంపిస్తామని ఎస్పీ వివరించారు. -
వైఎస్సార్ బీమా పేరిట మోసం
కడప అర్బన్: వైఎస్సార్ బీమా పేరుతో మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని వైఎస్సార్ జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో రెండు నెలలుగా ఓ అంతర్రాష్ట్ర ముఠా పథకం ప్రకారం కోవిడ్ సందర్భంగా మరణించిన మృతుల వివరాలను సేకరిస్తున్నది. వాటి ఆధారంగా ఆయా మృతుల బంధువులకు ఫోన్లు చేసి.. తాము కలెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామని, వైఎస్సార్ బీమా పథకం కింద నష్టపరిహారం వస్తుందని మభ్యపెడుతోంది. అయితే అంతకుముందు.. కొంతమొత్తం ప్రభుత్వానికి చెల్లిస్తేనే ఆ మేరకు నష్టపరిహారం మంజూరవుతుందని అమాయక ప్రజలను నమ్మిస్తున్నది. అనంతరం ఫోన్–పే తదితర మనీ వ్యాలెట్ల నుంచి లక్షల రూపాయలను స్వాహా చేస్తోంది. కడపకు చెందిన బీరం రమణారెడ్డి, నిర్మల, ఎం.వి. సునీత, ఖాజీపేటకు చెందిన నాగవేణి, పెండ్లిమర్రికి చెందిన విఘ్నేశ్వరి, విజయకుమారి, బి.మఠానికి చెందిన కృష్ణచైతన్య, ప్రొద్దుటూరుకు చెందిన జింక హారతి, బద్వేల్‌కు చెందిన పి.ఆదిలక్ష్మి సదరు ముఠా చేతిలో చిక్కి సుమారు రూ.9 లక్షల మేరకు సమర్పించుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేసి కడప వన్‌టౌన్ సీఐ ఎన్.వి.నాగరాజు దర్యాప్తు చేపట్టారు. కేసు పరిశోధనలో భాగంగా కడప సైబర్ క్రైం టీం సహాయంతో యూపీఐల ఆధారంగా 9 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. వీటిలోని రూ.7,34,964 ఫ్రీజ్ చేశారు. ముఠాలో సభ్యుడైన ఖాజీపేట మండలం మిడుతూరు గ్రామానికి చెందిన మీనుగ వెంకటేష్‌ను ఇర్కాన్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. కొంతమంది వ్యక్తులతో కలిసి వెంకటేష్ ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి బీమా పేరిట దందాను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడీ పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు
సాక్షి, అమరావతి: మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌పై కడప పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రామ్‌సింగ్ తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి గజ్జల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 18న ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. విచారణ పేరుతో రామ్‌సింగ్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని గజ్జల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ఈ నెల 15న కడప జిల్లా ఏఆర్ ఎస్పీ మహేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇదే విషయమై కడప జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు పిటిషన్ ద్వారా విన్నవించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. విచారణ పేరుతో తనను రామ్‌సింగ్ 22సార్లు పిలిచి బెదిరించారని ఉదయ్‌భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము చెప్పినట్లుగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఏడాదిగా బెదిరింపులకు గురి చేస్తూ వేధించారని చెప్పారు. లేకపోతే అక్రమ కేసులు పెడతానని కూడా రామ్‌సింగ్ హెచ్చరించినట్టు తెలిపారు. తమ ఇంటికి పోలీసులతో వచ్చి మరీ దౌర్జన్యం చేశారని, అడ్డుకోబోయిన తన తల్లిని నెట్టివేశారని ఉదయ్‌భాస్కర్ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ వేధింపుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉదయ్‌భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది రాంప్రసాద్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన మేజిస్ట్రేట్ ఎం.ప్రదీప్‌కుమార్ సీఐబీ అధికారులపై చట్టపరమైన చర్యల కోసం కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో వెంటనే కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 25లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రామ్‌సింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 195ఏ, 323, 506ఆర్/డబ్ల్య్లూ 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామ్‌సింగ్‌పై గతంలోనూ ఇదే తరహా ఫిర్యాదులు సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌పై గతంలోనూ ఇదే తరహాలో పలువురు ఫిర్యాదులు చేయడం గమనార్హం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని అనంతపురం జిల్లాకు చెందిన గంగాంధరరెడ్డిని ఆయన వేధించినట్టు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. కాగా, వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో డీఎస్పీ, సీఐలను కూడా రామ్‌సింగ్ తీవ్రంగా వేధించారనే విషయం వెలుగుచూసింది. తమతో అవమానకరంగా మాట్లాడారని, తీవ్రంగా బెదిరించారని డీఎస్పీ వాసుదేవన్, సీఐ శంకరయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను ఎస్పీ రాష్ట్ర డీజీపీకి నివేదించారు. ఈ కేసులో రామ్‌సింగ్ ఉద్దేశపూర్వకంగా పలువురిని వేధిస్తున్నట్టు.. తాను చెప్పినట్లే చేయాలని బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది. రామ్‌సింగ్ వివాదాస్పద, ఏకపక్ష వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. -
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా ఆటకట్టు
కడప అర్బన్: ఆన్లైన్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు మంగళవారం రాత్రి మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప జిల్లాలోని మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండలం ఎన్.గొల్లపల్లికి చెందిన దేవరకొండ జగదీశ్వరి అనే మహిళకు 2021 జనవరి 11న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆమె తండ్రి తనకు బాగా తెలుసునని నమ్మబలికాడు. తాను బి.మఠం ఏఎస్ఐ అని, తమ బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని.. రూ.40 వేల సర్దితే..గంటలోనే కానిస్టేబుల్ ద్వారా తిరిగి డబ్బు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆయన మాటలు నమ్మిన జగదీశ్వరి ఫోన్‌పే ద్వారా రూ.40,000 పంపింది. డబ్బు పడ్డ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో జగదీశ్వరి తన తండ్రి దేవరకొండ క్రిష్ణయ్యకు విషయం చెప్పింది. ఆయన ఫిర్యాదు మేరకు బి.మఠం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో మరికొంతమందితో కలసి దువ్వూరులో రూ.70 వేలు, ఎర్రగుంట్ల పీఎస్ పరిధిలో రూ.40 వేలు, చిట్వేలిలో రూ.19 వేలు అమాయకుల నుంచి కాజేశారు. ఆయా కేసుల దర్యాప్తులో.. తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన దువ్వాసి భరత్‌ను.. సూర్యాపేట్ జిల్లా మోతే మండలం, లాలు తాండకు చెందిన కీలుకాని సాయిచంద్గా గుర్తించారు. మంగళవారం రాత్రి వీరు మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉండగా..పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పీడీ యాక్ట్ ఉన్న హైదరాబాద్‌కు చెందిన శరత్‌రెడ్డి కూడా ఈ కేసుల్లో నిందితుడిని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్ తెలిపారు. -
సోషల్ యాప్‌లే అతడి అడ్డా: యువతులతో నగ్నంగా..
కడప అర్బన్ : ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంతిరెడ్డి, అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ బూడిద సునీల్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ప్రసన్నకుమార్ చిన్నవయసులోనే వ్యసనాలకు బానిసయ్యాడు. బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదవు మానేశాడు. జల్సాలకు కావాల్సిన డబ్బుల కోసం 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు సీఎస్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు (ఇన్సెట్లో) నిందితుడు ప్రసన్న కుమార్ ప్రసన్నకుమార్‌కు కడప నబీకోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్‌చాట్ ద్వారా 2020 డిసెంబర్లో పరిచయం అయ్యాడు. శ్రీనివాసుతో తన పేరు ప్రశాంత్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డి అని, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో పనిచేస్తానని, అక్కడ చాలామంది తెలుసునని నమ్మబలికాడు. శ్రీనివాసుకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని అతని తల్లిని నమ్మించాడు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించాలని డబ్బులు కావాలని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె బంగారు సరుడు, తాళిబొట్టు అమ్మి డబ్బు ఇచ్చింది. తరువాత ప్రశాంత్‌రెడ్డికి శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. జూలై 29న కడప అక్కాయపల్లెలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని సుమారు 30 గ్రాముల బంగారు గాజులు, కమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవి రింగులను దొంగిలించుకుని వెళ్లాడు. ప్రసన్నకుమార్‌ను పోలీసులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అల్లరి, చిల్లరగా తిరిగేవాడు. కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసేవాడు. వారితో పరిచయం చేసుకుని ప్రేమలోకి దించి, వారితో అసభ్యకరరీతిలో చాటింగ్ చేసేవాడు. వారికి తెలియకుండా వివస్త్ర రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకుంటాడు. తద్వారా వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి తన గూగుల్‌పే, ఫోన్ పేల ద్వారా డబ్బులను వసూలు చేసేవాడు. మరికొంతమందిని శారీరకంగా కూడా అనుభవించడంతోపాటు వారి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లి, వాటిని అమ్మి జల్సాగా తిరిగేవాడు. ఈ విధంగా సుమారు 200 మంది అమ్మాయిలు, 100 సంఖ్యలో మహిళలను మోసగించినట్లు తెలిసింది. పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం, ఎస్ఐలు ఎస్‌కెఎం హుసేన్, బి.రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ జి.సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు ఎస్.ఓబులేసు, పులయ్య, ప్రదీప్‌లను డిఎస్పీ సునీల్ అభినందించారు. ఈ సంఘటనలో నిందితుడి నుంచి రూ.1,26,000 నగదును, 30గ్రాముల బరువున్న బంగారుగాజులు, ఒక జతకమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవిరింగ్, నిందితుడి సెల్ఫోన్లను రికవరీ చేశారు. -
పాడేరు– కామెరూన్ వయా బెంగళూరు
సాక్షి, కడప: తీగలాగితే డొంక కదిలినట్లు చిక్కింది ఐదుగురు నేరస్తుల ముఠా. స్పందనలో వచ్చిన ఫిర్యా దును తీవ్రంగా పరిగణించి కడప పోలీసులు దర్యాప్తు చేసి దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. ముఠా వివరాలు వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ శనివారం వెల్లడించారు. పోలీసులు నిర్వహించే స్పందనకు కేరళకు చెందిన అబ్దుల్ కరీం వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేశారు. కడప భాగ్యనగర్ కాలనీకి చెందిన చింపిరి సాయికృష్ణ ఫేస్బుక్ ద్వారా పరిచయమై ఖరీదైన, నాణ్యమైన విగ్గులను విక్రయిస్తున్నట్లు చెప్పి డబ్బులను కాజేశారనేది సారాంశం. అలాగే సాయికృష్ణ మోసం చేశాడని కడపకు చెందిన జనార్దన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సీఐ అశోక్‌రెడ్డి దీనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ సైబర్ నేరాలను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తునకు కడప డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. గుట్టు రట్టు ఇలా: కడప నగరంలో ఒక ప్రయివేట్ లాడ్జీలో ఆ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. చింపిరి సాయికృష్ణ (కడప), పంగి దాసుబాబు (విశాఖ జిల్లా సిమిలిగూడ), కుర్రా జగన్నాథ్ (విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం పెద్దపాడు), కామెరూన్ దేశానికి చెందిన ఏంబిఐ అడోల్ప్ ఆషు, ఆకో బ్రోన్సన్ ఎనౌ పోలీసులకు చిక్కిన వారిలో ఉన్నారు. వారి నుంచి 9కిలోల గంజాయి, రూ.9,600 నగదు, రూ.7.28 లక్షల విలువైన నకిలీ రూ.2వేల నోట్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, కలర్ ప్రింటర్, ఏడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయిని కామెరూన్ దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు. నకిలీ రూ.2000 నోట్లను కూడా ప్రింట్ చేస్తున్నట్లు గుర్తించా రు. పాడేరులో రూ.6వేలకు గంజాయి కొనుగోలు చేసి కామెరూన్లో విక్రయిస్తే పదిరెట్లు ఆదాయం వస్తుందని నిందితులు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి పాస్‌పోర్టులను స్వా«దీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. -
చట్టం వారికి చుట్టం..!
పులివెందుల : పులివెందుల పట్టణంలో స్థానిక రీడింగ్‌రూమ్ వీధిలో ఉన్న సరస్వతి విలాస మందిరం, డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎంసీ క్లబ్ పేరిట రెండు పేకాట క్లబ్‌లు ఉన్నాయి. ఈ క్లబ్‌లు గత 50ఏళ్లకు పైగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇక్కడ (స్కిల్గేమ్) పేకాట ఆడుతున్నారు. ఆదివారం సీఐ పుల్లయ్య ఈ రెండు క్లబ్‌లపై దాడులు నిర్వహించారు. చట్టాన్ని ధిక్కరించి పేకాట ఆడుతుంటే పోలీసుల చర్యలను ఏమాత్రం తప్పుబట్టాల్సిన పనిలేదు. కాకపోతే నిబంధనలకు అనుగుణంగా పేకాట ఆడుతున్న వారితోపాటు, వివిధ పనుల కోసం అక్కడికి వచ్చిన వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. అందరిపై మంగతాయ్ జూదం ఆడుతున్నట్లుగా కేసు నమోదు చేయడం ఆశ్చర్యం కల్గిస్తున్న అంశం. అటువైపు కన్నెత్తి చూడని యంత్రాంగం... పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో టీడీపీ నాయకుని కనుసన్నల్లో ఓ క్లబ్ నడుస్తోంది. పోలీసులకు పేకాట నియంత్రించాలన్న చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏకకాలంలో మూడు క్లబ్‌లపై దాడులు చేసి, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు చేపట్టాల్సి ఉంది. కాగా టీడీపీ నేత ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న క్లబ్‌వైపు కన్నెత్తి చూడలేదు. పైగా అక్కడ క్లబ్ నిర్వహిస్తున్నట్లు..అందులో జూదం ఆడుతున్నట్లు తమకు ఫిర్యాదు లేదని సీఐ చెప్పడం గమనార్హం. దాదాపు రెండు నెలలుగా టీడీపీ నేత ఆధ్యర్యంలో క్లబ్ యథేచ్ఛగా జరుగుతోంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులపై స్వామి భక్తిని చాటుకున్నారు. కేవలం రెండింటిపై దాడులు నిర్వహించి అధికార పార్టీ నాయకునికి చెందిన క్లబ్‌పై ఎలాంటి దాడులు చేయలేదు. రెండు క్లబ్‌లలో నిబంధనలకు లోబడి పేకాట ఆడుతున్నా దాదాపు 120మందిని అరెస్టు చేసి క్లబ్లో వీరు మంగతాయ్ జూదం ఆడుతున్నట్లు అక్రమ కేసు బనాయించారు. వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విలేకరులు సీఐ పుల్లయ్యను మూడో క్లబ్మీద ఎందుకు దాడి చేయలేదని వివరణ కోరగా పట్టణంలో మూడో క్లబ్ నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు. అలాంటివి ఏవైనా ఉంటే దాడులు చేపడతామని చెప్పడం కొసమెరుపు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు పులివెందుల పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం క్లబ్‌లపై దాడిచేసిన విషయం తెలుసుకున్న వైఎస్ అవినాష్‌రెడ్డి స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్నవారు తాము నిబంధనలకు లోబడి పేకాట ఆడుతున్నా అరెస్టు చేశారని..అలాగే పేకాట ఆడకుండా క్లబ్‌కు ఇతర పనులమీద వచ్చిన వారిని కూడా అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో అవినాష్‌రెడ్డి సీఐ పుల్లయ్యతో మాట్లాడుతూ కేవలం రెండు క్లబ్‌లపై దాడిచేసి మూడోదానిపై ఎందుకు దాడిచేయలేదని ప్రశ్నించారు. ఆ క్లబ్ అధికార పార్టీ నాయకునికి సంబంధించింది కనుక దాడులు చేయలేదన్నారు. అందుకు సీఐ పుల్లయ్య అక్కడ క్లబ్ నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. పులివెందులలో టీడీపీ నాయకునికి సంబంధించిన క్లబ్ గురించి పోలీసులు తమకు తెలియదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన సీఐతో వాగ్వాదానికి దిగారు. -
మిస్టరీ వీడని నేరాలు
– చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిందెవరు? – వక్కల పేటలో షంషుద్దీన్‌ను హత్య చేసిందెవరు? కడప అర్బన్: కడప నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన కొన్ని నేరాలకు సంబంధించి నిందితులను గుర్తించే విషయంలో పోలీసులకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసు మిస్టరీలను ఎలా ఛేదించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్లో ఈనెల 20న మధురాంతకం శశికళ ఇంట్లో దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసులో ఇంతవరకు పోలీసులకు క్లూ లభించలేదు. శశికళ కుమారుడు, కుమార్తెలు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి కామాక్షమ్మ ప్రధాన ద్వారం తర్వాత గదిలోనే పడుకుని ఉంటుంది. ఈ క్రమంలో ఎవరు చోరీకి పాల్పడ్డారనేది ఎటూ తేల్చుకోలేక పోలీసులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈనెల 9వ తేదిన కప్‌బోర్డులో బంగారు ఆభరణాలను ఉంచి కప్బోర్డు తాళాలను శశికళ తన వద్ద ఉంచుకున్నారు. తర్వాత 13వ తేదీ తాళాల కోసం వెతికినా కనిపించలేదు. దీంతో 19వ తేదిన కప్బోర్డును కార్పెంటర్ సహాయంతో తీయించారు. అప్పుడు బంగారు ఆభరణాలు ఉన్నాయా? లేదా? అన్నట్లు బ్యాగులో వెతికారు. కానీ అందులో బంగారు ఆభరణాలు దాచి ఉంచిన బాక్సు అలాగే ఉంది. కానీ బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు. దీంతో నివ్వెరబోయిన శశికళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం, చిన్నచౌకు పోలీసులు అందరూ కలిసి తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ నేరం ఎవరు చేశారనేది అంతుచిక్కడం లేదు. షంషుద్దీన్ హత్య ఇదే తరహాలో టూ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో వక్కలపేటలో ఈనెల 20వ తేదీ రాత్రి నుంచి 21వ తేదీ తెల్లవారుజాము మధ్యలో హత్యకు గురైన షేక్ షంషుద్దీన్ (58) హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఇతన్ని హత్య చేసింది ఎవరు.. అతనితో పాటు మద్యం సేవించేందుకు వచ్చిన వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా.. లేక మరెవరైనా చేశారా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ స్వయంగా వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. -
భార్య, కుమారుడికి బిర్యానీలో విషం పెట్టి...
► భర్త ఆదుకోలేదని ఫాదర్‌కు చెప్పుకున్న నాగేశ్వరి ►దీంతో కసి పెంచుకున్న భర్త ప్రవీణ్‌కుమార్ ► బిర్యానీలో విషం కలిపి భార్య, కొడుకును హత్య ► పాలకొండల్లో మృతదేహాల ఖననం ► ‘సాక్షి’ వరుస కథనాలతో దర్యాప్తు ముమ్మరం.. తతంగం బట్టబయలు కడప : ఉన్నత చదువు అభ్యసించిన నాగేశ్వరి జీవితం అనూహ్యంగా అర్ధంతరంగా ముగిసింది. దాంపత్య జీవితంలో అష్టకష్టాలు అనుభవించి తుదకు భర్త చేతిలో మృతి చెందింది. నిరాదరణకు గురిచేసిన భర్తే కుటుంబ పరువు పోతుందని ఆమెను అంతమొందించాడు. ఈ క్రమంలో ముక్కుపచ్చలారని కుమారుడిని సైతం మట్టుబెట్టాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరానికి చెందిన ఎన్.నాగేశ్వరీ ఎంఏ, బీఈడి చదివింది. 2003లో అక్కాయపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌తో వివాహం చేశారు. తొలిబిడ్డ జన్మించాక అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో గత కొంతకాలంగా నాగేశ్వరి(33).. కుమారుడు ప్రణీత్‌రాజ్(7)తో కలిసి విడిగా ఉండేది. ఈ మధ్య కాలంలో కుటుంబ పోషణ భారం కావడంతో చర్చి ఫాదర్‌ను ఆశ్రయించి.. భర్తకు సర్ది చెప్పి న్యాయం చేయాలని కోరింది. దీంతో కుటుంబం పరువు పోయిందని భావించిన భర్త ప్రవీణ్‌కుమార్ వ్యూహాత్మకంగా ఆమెను అంతమొందించినట్లు సమాచారం. తన కుమార్తె కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోని వైనంపై ‘సాక్షి’ ఈ నెల11, 13న ‘హత్యా.. అదృశ్యమా..?’ ‘ఛేజింగ్‌లో మిస్!’ శీర్షికలతో ప్రత్యేక కథనాలు వెలువరించింది. భర్త ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు సాగలేదని ఎత్తిచూపింది. ఆపై చేపట్టన దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసినట్లు సమాచారం. నమ్మకంగా ఉన్నట్లు నటించి మట్టుబెట్టాడు.. దశాబ్దానికి పైబడి నిరాదరణకు గురైన నాగేశ్వరి ఒక్కమారుగా భర్తలో వచ్చిన మార్పు చూసి సంతోషపడింది. భర్తతో కలిసిమెలిసి జీవించే అవకాశం రానుందని ఆశించి మరింత చేరువగా మెలిగింది. ఆ చేరువే అనుమానం లేకుండా హత్య చేసేందుకు ఆస్కారం ఏర్పడినట్లు సమాచారం. ఆమేరకే భర్త ప్రవీణ్‌కుమార్ అక్టోబర్ నుంచి ఎక్కువ చనువుగా ఉంటూ తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ ఆమెకు దగ్గరైనట్లు సమాచారం. ఈక్రమంలో తినుబండారాలు సమకూరుస్తూ, అవసరమైన మేరకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10 వరకూ అదే ధోరణితో వ్యవహారించిన ప్రవీణ్ ఆ తర్వాత భార్య నాగేశ్వరి మరో యువకుడితో పరార్ అయినట్లు కట్టుకథ సృష్టించాడు. ఆమేరకు అనుమానం లేకుండా నాగేశ్వరి సెల్ నుంచి అమె సోదరికి ఎస్ఎంఎస్ పంపాడు. ఆపై తనపరపతితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల నుంచి ఒత్తిడి లేకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10 తర్వాత భార్య సెల్‌కు ఒక్కమారు కూడా ఫోన్ చేయకపోవడంపై ‘సాక్షి’ అనుమానం వ్యక్తం చేసింది. ఆ దిశగా దర్యాప్తు సాగించిన పోలీసులు.. కుమారుడి సహా ఆమె భర్త చేతిలో హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. ఐజాక్ తరహాలోనే.. జియాన్ కళాశాల అధిపతి రాజా రత్నం ఐజాక్ తన సొంత పాఠశాలలో కుమారుడు, కోడలు.. వారి ముగ్గురు పిల్లల మృతదేహాలను ఖననం చేయించిన రీతిలో ప్రవీణ్‌కుమార్ సైతం వ్యవహారం నడిపించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా నగర శివారులోకి కారులో భార్య, కుమారున్ని షికారుకు తీసుకెళ్లి నాగేశ్వరికి బిర్యానీలో, కుమారుడు ప్రణీత్రాజ్కు దోశలో విషం కలిపి ఇచ్చినట్లు సమాచారం. భర్త రోజురోజుకు చేరువ అవుతుండడంతో నమ్మిన నాగేశ్వరి బిర్యాని తింటూ.. కుమారుడికి తిన్పిస్తూ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. కొంత సేపటికి వారిద్దరూ స్పృహ తప్పి పడిపోగా, వారు చనిపోయారని ధ్రువీకరించుకున్న భర్త పాలకొండల్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ముందస్తుగా కారులో సిద్ధం చేసుకున్న గోనె సంచుల్లో మృతదేహాలను కుక్కి ఓ గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో నిగ్గుతేలినట్లు సమాచారం. తహశీల్దార్ సమక్షంలో బుధవారం మృతదేహాలను వెలికి తీయనున్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ హుస్సేన్ అరెస్ట్
-
చిక్కిన ఎర్రదొంగలు
ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కడప పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 12.70 లక్షల నగదుతో పాటు 31 దుంగలు, టవేరా కారును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు. కడప అర్బన్, న్యూస్‌లైన్ : ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కడప పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి రూ.12.70 లక్షల నగదు, 31 దుంగలు, టవేరాకారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మరో ఇద్దరు దొంగలు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆయన పట్టుబడిన ఎర్రచందనం దుంగలను విలేకరుల ఎదుట హాజరుపరిచారు. దొరికింది ఇలా.. ఎర్రచందనం అక్రమ రవాణాపై కడప అర్బన్ సర్కిల్ పోలీసులతో పాటుు అటవీ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఉదయం 6.30 గంటలకు కడప సాయిపేట చెరువు కట్ట సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన టవేరా కారును ఆపారు. అయితే కారును ఆపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే వెంటబడి పట్టుకున్నారు. అందులో పది మంది ఉన్నారు. వారందరూ కర్ణాటకతో పాటు కడపకు చెందిన వారు ఉన్నారు. అరెస్టైన వారిలో కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు చెందిన డ్రైవర్ షర్ఫుద్దీన్(32), అబ్దుల్ మజీద్(29), బద్రుద్దీన్(22)తో పాటు కడపకు చెందిన వడుగూరి రవికుమార్ అలియాస్ సతీష్(25), గుంట అనిల్‌బాబు(25), ఖాదర్‌ఖాన్ కొట్టాలకు చెందిన వ్యాన్ డ్రైవర్ చాగలమర్రి మల్లికార్జున(25), మరో వ్యాన్ డ్రైవర్ మారే రవి(23), పులివెందులకు చెందిన వేబ్రిడ్జి మేనేజర్ వల్లెపు వెంకటరమణ(54), డ్రైవర్ ఖాదర్‌బాషా(30), సిద్ధవటానికి చెందిన మెడికల్ రెప్రజంటేటివ్ నిమ్మకాయల గంగిరెడ్డి(30) ఉన్నారన్నారు. నిందితుల నేపథ్యం : కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన మొదటి నిందితుడు షర్ఫుద్దీన్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతను అదే రాష్ట్రం హోసకోటే తాలూకా మాలూరు రోడ్డులోని కాటేగానహల్లికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ షబ్బీర్ అలియాస్ రహమత్(45)తో పరిచయం ఏర్పరచుకున్నాడు. రెండేళ్లుగా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో షర్పుద్దీన్ సంబంధాలు పెట్టుకొని యథేచ్చగా ఎర్రచందనం దుంగలను తరలించేవాడు. దుంగలను కాటేగానహల్లికి చెందిన షబ్బీర్‌కు కిలో రూ.1500 చొప్పున విక్రయిస్తూ తాను కమీషన్ తీసుకునేవాడు. వాటిని షబ్బీర్ చెన్నై, ముంబై, ఢిల్లీలో తనకు తెలిసిన స్మగ్లర్లకు అమ్మేవాడని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం పట్టుబడిన ముఠా సభ్యులంతా గత నెల 21న ఈచర్ వ్యాన్(ఏపీ 02 డబ్ల్యూ 5000) షబ్బీర్‌కు ఎర్రచందనం దుంగలు అమ్మి, దారిలో వస్తూ హసనకోటలోని చింతామణి రస్తాలో పోలీసుల తనిఖీలను గమనించి వ్యాన్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారని చెప్పారు. స్పెషల్ పార్టీ బృందానికి ఎస్పీ అభినందన కేసును చేధించి స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, కడప అర్బన్ సీఐ బి.శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ ఎస్.మహబూబ్‌బాషా, టూ టౌన్ ఎస్ఐ రోషన్, చిన్నచౌకు ఎస్ఐ హేమకుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కీలక సూత్రధారి షర్ఫుద్దీన్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెం దిన ఎర్రచందనం స్మగ్లర్లతో షర్పుద్దీన్ విసృ్తతమైన పరిచయాలు ఏర్పరచుకున్నాడని ఎస్పీ తెలిపారు. వారి ద్వారా ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ షబ్బీర్ అలియాస్ రహమత్‌కు విక్రయిస్తూ తన చీకటి వ్యాపారాన్ని యధేచ్చగా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పట్టుబడిన వారి లో సతీష్, అనిల్‌బాబు, రవికుమార్, మల్లికార్జున, మారే రవి, వల్లెపు వెంకటరమణ, షేక్ ఖాదర్‌బాషా, గంగిరెడ్డి తదితరులు షర్ఫుద్దీన్కు ప్రధాన అనుచరులు. ఐదు రోజుల కిందట రవికుమార్, అతని అనుచరులు విక్రయించిన దుంగలకు సంబంధిం చిన డబ్బును అందజేసే నిమిత్తం, సేకరిం చిన ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసేందుకు వచ్చిన షర్ఫుద్దీన్ అనూహ్య రీతిలో పోలీసులకు పట్టుబడ్డాడని ఎస్పీ తెలిపారు. ముఠాలోని మిగిలిన కాటేగానహల్లి షబ్బీర్, నందలూరుకు చెందిన మహబూబ్‌బాషా పరారీలో ఉన్నారన్నారు.