భార్య, కుమారుడికి బిర్యానీలో విషం పెట్టి...
► భర్త ఆదుకోలేదని ఫాదర్‌కు చెప్పుకున్న నాగేశ్వరి
►దీంతో కసి పెంచుకున్న భర్త ప్రవీణ్‌కుమార్
► బిర్యానీలో విషం కలిపి భార్య, కొడుకును హత్య
► పాలకొండల్లో మృతదేహాల ఖననం
► ‘సాక్షి’ వరుస కథనాలతో దర్యాప్తు ముమ్మరం..
తతంగం బట్టబయలు
కడప : ఉన్నత చదువు అభ్యసించిన నాగేశ్వరి జీవితం అనూహ్యంగా అర్ధంతరంగా ముగిసింది. దాంపత్య జీవితంలో అష్టకష్టాలు అనుభవించి తుదకు భర్త చేతిలో మృతి చెందింది. నిరాదరణకు గురిచేసిన భర్తే కుటుంబ పరువు పోతుందని ఆమెను అంతమొందించాడు. ఈ క్రమంలో ముక్కుపచ్చలారని కుమారుడిని సైతం మట్టుబెట్టాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరానికి చెందిన ఎన్.నాగేశ్వరీ ఎంఏ, బీఈడి చదివింది.
2003లో అక్కాయపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌తో వివాహం చేశారు. తొలిబిడ్డ జన్మించాక అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో గత కొంతకాలంగా నాగేశ్వరి(33).. కుమారుడు ప్రణీత్‌రాజ్(7)తో కలిసి విడిగా ఉండేది. ఈ మధ్య కాలంలో కుటుంబ పోషణ భారం కావడంతో చర్చి ఫాదర్‌ను ఆశ్రయించి.. భర్తకు సర్ది చెప్పి న్యాయం చేయాలని కోరింది. దీంతో కుటుంబం పరువు పోయిందని భావించిన భర్త ప్రవీణ్‌కుమార్ వ్యూహాత్మకంగా ఆమెను అంతమొందించినట్లు సమాచారం. తన కుమార్తె కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోని వైనంపై ‘సాక్షి’ ఈ నెల11, 13న ‘హత్యా.. అదృశ్యమా..?’ ‘ఛేజింగ్‌లో మిస్!’ శీర్షికలతో ప్రత్యేక కథనాలు వెలువరించింది. భర్త ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు సాగలేదని ఎత్తిచూపింది. ఆపై చేపట్టన దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసినట్లు సమాచారం.
నమ్మకంగా ఉన్నట్లు నటించి మట్టుబెట్టాడు..
దశాబ్దానికి పైబడి నిరాదరణకు గురైన నాగేశ్వరి ఒక్కమారుగా భర్తలో వచ్చిన మార్పు చూసి సంతోషపడింది. భర్తతో కలిసిమెలిసి జీవించే అవకాశం రానుందని ఆశించి మరింత చేరువగా మెలిగింది. ఆ చేరువే అనుమానం లేకుండా హత్య చేసేందుకు ఆస్కారం ఏర్పడినట్లు సమాచారం. ఆమేరకే భర్త ప్రవీణ్‌కుమార్ అక్టోబర్ నుంచి ఎక్కువ చనువుగా ఉంటూ తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ ఆమెకు దగ్గరైనట్లు సమాచారం. ఈక్రమంలో తినుబండారాలు సమకూరుస్తూ, అవసరమైన మేరకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10 వరకూ అదే ధోరణితో వ్యవహారించిన ప్రవీణ్ ఆ తర్వాత భార్య నాగేశ్వరి మరో యువకుడితో పరార్ అయినట్లు కట్టుకథ సృష్టించాడు. ఆమేరకు అనుమానం లేకుండా నాగేశ్వరి సెల్ నుంచి అమె సోదరికి ఎస్‌ఎంఎస్ పంపాడు. ఆపై తనపరపతితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల నుంచి ఒత్తిడి లేకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10 తర్వాత భార్య సెల్‌కు ఒక్కమారు కూడా ఫోన్ చేయకపోవడంపై ‘సాక్షి’ అనుమానం వ్యక్తం చేసింది. ఆ దిశగా దర్యాప్తు సాగించిన పోలీసులు.. కుమారుడి సహా ఆమె భర్త చేతిలో హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు.
ఐజాక్ తరహాలోనే..
జియాన్ కళాశాల అధిపతి రాజా రత్నం ఐజాక్ తన సొంత పాఠశాలలో కుమారుడు, కోడలు.. వారి ముగ్గురు పిల్లల మృతదేహాలను ఖననం చేయించిన రీతిలో ప్రవీణ్‌కుమార్ సైతం వ్యవహారం నడిపించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా నగర శివారులోకి కారులో భార్య, కుమారున్ని షికారుకు తీసుకెళ్లి నాగేశ్వరికి బిర్యానీలో, కుమారుడు ప్రణీత్‌రాజ్‌కు దోశలో విషం కలిపి ఇచ్చినట్లు సమాచారం. భర్త రోజురోజుకు చేరువ అవుతుండడంతో నమ్మిన నాగేశ్వరి బిర్యాని తింటూ.. కుమారుడికి తిన్పిస్తూ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. కొంత సేపటికి వారిద్దరూ స్పృహ తప్పి పడిపోగా, వారు చనిపోయారని ధ్రువీకరించుకున్న భర్త పాలకొండల్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ముందస్తుగా కారులో సిద్ధం చేసుకున్న గోనె సంచుల్లో మృతదేహాలను కుక్కి ఓ గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో నిగ్గుతేలినట్లు సమాచారం. తహశీల్దార్ సమక్షంలో బుధవారం మృతదేహాలను వెలికి తీయనున్నారు.