సాక్షి, చెన్నై: బిర్యానీ పంచాయితీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో భర్త భార్యకు నిప్పటించడంతో ఆమె కన్నుమూసింది. ఈ ఘటన చెనైలోని ఠాగూర్‌నగర్, అయనవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కరుణాకరణ్ (75), పద్మావతి (66) దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఎవరికి వారు భార్యబిడ్డలతో విడిగా ఉంటున్నారు. కరుణాకరణ్, పద్మావతి మరో చోట నివాసమంటున్నారు. ఒంటరిగా ఉండటం, వయసురిత్యా కారణాలతో పద్మావతి కొద్ది నెలలుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటోంది.
ఈక్రమంలోనే ఆ వృద్ధ భార్యభర్తలమధ్య సఖ్యత కొరవడింది. నిత్యం ఏదో ఒక విషయంలో గొడవపడుతుండేవారు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. పిల్లలతో కూడా వారికి విభేదాలున్నాయి. ఇక మనస్పర్థల కారణంగా కరుణాకరణ్ కూడా భార్య బాగోగులు సరిగా చూసుకునేవాడు కాదు. ఆమెకు భోజనం కూడా ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కరుణాకరణ్ మంగళవారం రాత్రి బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాడు. ఆయనొక్కడే ఆరగించాడు. దీంతో రగిలిపోయిన పద్మావతి తనకు కూడా బిర్యానీ కావాలని ఆయనతో గొడవపడింది.
(చదవండి: ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం)
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఆవేశానికి లోనైన కరుణాకరణ్ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను పద్మావతిపై పోసి నిప్పటించాడు. ఆమె హాహాకారాలు చేస్తూ భర్తను పట్టుకుంది. ఇద్దరూ మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కలవారు తలుపులు బద్దలు కొట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కరుణాకరణ్‌కు 20 శాతం, పద్మావతికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ పద్మావతి మరణించారు. కరుణాకరణ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అయనవరం పోలీసులు పేర్కొన్నారు.
(చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ)
Comments
Please login to add a commentAdd a comment