గర్భిణిపై భర్త కత్తితో దాడి
కేకేనగర్: వివాహేతర సంబంధం కారణంగా గర్భిణి భార్యపై కత్తితో దాడి జరిపి హత్యకు యత్నించిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కోర్టు ఆవరణలో సంచలనానికి దారితీసింది. కడలూరు జిల్లా సేత్తియాతోపు సమీపంలో గల తురింజికోవైకు చెందిన పావడై (36). ఇతని భార్య నదియ (22). వీరికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు. ఈ నేపథ్యంలో పావడై విదేశాల్లో పని చేయడానికి ఆరేళ్ల క్రితం వెళ్లాడు. ఈ క్రమంలో నదియాకు, ఎరుంబూర్‌కు చెందిన సుభాష్‌చంద్రబోస్ (22)కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ ఇద్దరు ఏడు నెలలుగా సహజీవనం సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న పావడై సొంత ఊరికు వచ్చాడు. భార్యను నిలదీయడంతో ఆమె అలిగి ప్రియుడి ఇంటికి వెళ్లింది. తన భార్య నగదు, నగలతో పారిపోయిందని పావడై కడలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడలూరు కోర్టులో గల ఉచిత న్యాయ సలహా సహాయ కేంద్రానికి బుధవారం మధ్యాహ్నం పావడై, నదియా, ఆమె ప్రియుడు, అతడి తల్లి మంజుల వచ్చారు.
భార్యను చూడగానే పావడై ఆగ్రహంతో తన వద్ద దాచిన కత్తితో ఆమెపై దాడి జరిపాడు. నదియాకు అడ్డు వచ్చిన మంజులకు బలమైన కత్తిపోట్లు తగిలాయి. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. గాయపడిన నదియ, మంజుల కడలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైన నదియా ప్రస్తుతం 6 నెలల గర్భిణి. ఈ సంఘటన కోర్టు ఆవరణలో సంచలనం కలిగించింది.