– చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిందెవరు?
– వక్కల పేటలో షంషుద్దీన్‌ను హత్య చేసిందెవరు?
కడప అర్బన్:
కడప నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన కొన్ని నేరాలకు సంబంధించి నిందితులను గుర్తించే విషయంలో పోలీసులకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసు మిస్టరీలను ఎలా ఛేదించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్‌లో ఈనెల 20న మధురాంతకం శశికళ ఇంట్లో దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసులో ఇంతవరకు పోలీసులకు క్లూ లభించలేదు. శశికళ కుమారుడు, కుమార్తెలు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి కామాక్షమ్మ ప్రధాన ద్వారం తర్వాత గదిలోనే పడుకుని ఉంటుంది. ఈ క్రమంలో ఎవరు చోరీకి పాల్పడ్డారనేది ఎటూ తేల్చుకోలేక పోలీసులు నానా అగచాట్లు పడుతున్నారు.
ఈనెల 9వ తేదిన కప్‌బోర్డులో బంగారు ఆభరణాలను ఉంచి కప్‌బోర్డు తాళాలను శశికళ తన వద్ద ఉంచుకున్నారు. తర్వాత 13వ తేదీ తాళాల కోసం వెతికినా కనిపించలేదు. దీంతో 19వ తేదిన కప్‌బోర్డును కార్పెంటర్ సహాయంతో తీయించారు. అప్పుడు బంగారు ఆభరణాలు ఉన్నాయా? లేదా? అన్నట్లు బ్యాగులో వెతికారు. కానీ అందులో బంగారు ఆభరణాలు దాచి ఉంచిన బాక్సు అలాగే ఉంది. కానీ బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు. దీంతో నివ్వెరబోయిన శశికళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం, చిన్నచౌకు పోలీసులు అందరూ కలిసి తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ నేరం ఎవరు చేశారనేది అంతుచిక్కడం లేదు.
షంషుద్దీన్ హత్య ఇదే తరహాలో
టూ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో వక్కలపేటలో ఈనెల 20వ తేదీ రాత్రి నుంచి 21వ తేదీ తెల్లవారుజాము మధ్యలో హత్యకు గురైన షేక్ షంషుద్దీన్ (58) హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఇతన్ని హత్య చేసింది ఎవరు.. అతనితో పాటు మద్యం సేవించేందుకు వచ్చిన వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా.. లేక మరెవరైనా చేశారా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ స్వయంగా వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు.