సీసీ కెమెరాల మానిటరింగ్ బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న ఎస్సై
బీర్కూర్(బాన్సువాడ): నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులకు సీసీ కెమెరాలు సాయమందిస్తున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా పలు మండల కేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లో స్థానిక పోలీసులు పలు కూడళ్లలో కెమెరాలను ఏర్పాటు చేశారు. బీర్కూర్ మండల కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల్లో పోలీసులు ఈ చలాన్‌ను అమలు చేస్తున్నారు. దీనిని పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటోంది. రాత్రివేళల్లో దొంగతనాలు జరుగకుండా, గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించివారిపై నిఘాను పెంచారు. బీర్కూర్ మండల కేంద్రంతోపాటు నస్రుల్లాబాద్, బాన్సువాడ వంటి మండలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు
గతంలో గ్రామాల్లో దొంగతనాలతోపాటు ఇతర నేరాలు జరిగే సందర్బంలో కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించేవారు. అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారణ చేసి కేసును పరిష్కరించేవారు. అయితే తెలంగాణ ఏర్పాటైనన తరువాత ప్రభుత్వం నేరాల అదుపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దీనిలో భాగంగానే గ్రామస్తుల సహకారంతో పోలీసులు ప్రతీ గ్రామంలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడైనా నేరం జరిగినట్లు తెలిస్తే వెంటనే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకుంటున్నారు. దీనివల్ల కేసులను పరిష్కరించడంలో వేగం వచ్చిందని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌లోనే మానిటరింగ్..
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేసేందుకు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా మానిటరింగ్ టీవీలను ఏర్పాటు చేసి నిత్యం ఎస్సై వాటిని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ కెమెరాలతో ఎంతో ఉపయోగం ఉందని బీర్కూర్ ఎస్సై పూర్ణేశ్వర్ వివరించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగితే చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు. రోజూ పోలీస్ స్టేషన్‌లో గ్రామాల వారిగా సీసీ కెమెరాలను పరిశీలించి అనుమాన్పదంగా ఉంటే వెంటనే విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రామాలవారిగా వివరాలు..
బీర్కూర్ గ్రామంలో 13 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, దామరంచలో 11, భైరాపూర్‌లో 4, మల్లాపూర్‌లో 4, బరంగేడ్గి గ్రామంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేనుసైతంలో భాగంగా మండలవ్యాప్తంగా మరో 31 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు బీర్కూర్‌లో ట్రాక్టర్ యూనియన్ వారు రూ.80 వేలు విరాళాలు అందించగా కిరాణా అసోసియేషన్ వారు రూ.25 వే లు, హనుమాన్ ఆలయ కమిటీ రూ.5వేలు, క్రషర్ వారు రూ.20 వేలు, రాజస్థాన్ స్వీట్స్ వారు రూ.3 వేలు విరాళంగా ఇచ్చారని ఎస్సై వివరించారు.
ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభం
జిల్లా ఎస్పీ శ్వేత చేతులమీదుగా బీర్కూర్ మండలంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేస్తూ అన్ని గ్రామాలతోపాటు పలు మండలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయించేలా జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కెమెరాల ఏర్పాటు వేగవంతమైంది.
నేరాల నియంత్రణకు..
సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. బీర్కూర్ మండలంలో కెమెరాల ఏర్పాటు వలన ఎన్నికల సమయంలో గొడవలు జరగకుండా చూస్తున్నాం. పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు దుకాణదారులు, హోటల్ యజమానులు సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. –ఎస్సై పూర్ణేశ్వర్ (బీర్కూర్)
Comments
Please login to add a commentAdd a comment