Cc camera recording
-
ప్రభుత్వ ఆస్పత్రులపై పోలీస్ నిఘా
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణ యం తీసుకోగా, వైద్య,ఆరోగ్యశాఖ గురు వారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను స్థానిక పోలీస్స్టేషన్లకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. ఆయా సీసీ కెమెరాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై నిఘా పెడతారు. 24 గంటల కంట్రోల్ రూమ్‌తోపాటు బారికేడ్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఆస్పత్రి ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, సీసీ కెమెరాలతో చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రజారోగ్య విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యవిద్య విభాగం పరిధిలోని బోధనాస్పత్రుల్లో అన్నింటిలో ఈ కమిటీలు ఏర్పడనున్నాయి. ఈ కమిటీలు ఆస్పత్రుల భద్రత పెంపుతోపాటు వైద్య సిబ్బంది భద్రతకు కీలకంగా ఉంటాయి. ఆస్పత్రుల్లో కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు, డాక్టర్లు, ఇతరుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకొని దాడులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కమిటీ ఏర్పాటు ఇలా...ఆస్పత్రి సూపరింటెండెంట్ చైర్మన్ / చైర్పర్స న్గా, సేఫ్టీ ఆఫీసర్ (ఆర్ఎంవో) కన్వీనర్‌గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజినీర్, సెక్యూరిటీ స్టాఫ్ ఇన్చార్జ్, ఐఎంఏ మెంబరు, సీనియర్ డాక్టర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ అలైడ్ హెల్త్స్టాఫ్ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు రెండు వేర్వేరుగా పనిచేస్తాయి. ఈ రెండు కమిటీలకు చైర్మన్‌గా ఒకరే వ్యవహరిస్తారు. కమిటీలు ఏం చేస్తాయంటే?ప్రతిరోజూ ఆస్పత్రులను ఆడిట్ చేస్తాయి. మూడు షిప్టులలోని భద్రతపై ఆరా తీస్తాయి. ఆస్పత్రి బయట, వార్డులలోనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల తరహాలోనే రోగుల సహాయకులు, బంధువులకు విజిటర్ పాస్ వ్యవస్థను అందుబాటులో తీసుకొస్తారు. డాక్టర్ల డ్యూటీ రూమ్స్, రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ వద్ద అదనంగా లైటింగ్, డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికీ రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల పనితీరును చెక్ చేస్తూనే, వాటి సంఖ్య మరింత పెంచుతారు. సీసీ కెమెరాల ఫుటేజ్ స్టోరేజ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, ఫైర్‌సేఫ్టీ, మెడికల్ ఎక్విప్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్పై సమీక్షిస్తారు. చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుతూ, ఆస్పత్రుల సిబ్బంది భద్రతకు సెక్యూరిటీ సిబ్బందికి డ్రిల్, ట్రైనింగ్ ఇస్తారు. -
ప్రజల భద్రతపైనా బురద రాతలేనా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించడం కూడా రామోజీకి తప్పుగా కనిపిస్తోంది. ప్రజల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి తీసుకుంటున్న చర్యలపైనా బురద జల్లుతూ ‘ఈనాడు’ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కింది. ‘సీసీ కెమెరాల పేరుతో మరో అప్పు’ అంటూ శుక్రవారం ప్రచురించిన కథనాన్ని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మధుసూదన్‌రెడ్డి ఖండించారు. అప్పు కోసం హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని.. ఆ అప్పును తీర్చడానికి జరిమానాలు విధిస్తున్నారంటూ ప్రజలను భయపెట్టే విధంగా కథనం రాశారంటూ తప్పుపట్టారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. పటిష్ట భద్రత కోసం సుదీర్ఘ కసరత్తు తర్వాతే నిర్ణయం.. రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలను పరిశీలించిన తర్వాత.. దీర్ఘకాలం ఉండే విధంగా రాష్ట్రంలో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు, సర్వైలెన్స్ మౌలిక వసతులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘ కసరత్తు అనంతరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజల భద్రత కోసం ప్రస్తుతం ఉన్న వ్యవస్థను వినియోగించుకుంటూ కొత్తగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి అభ్యర్థన వచ్చిన 10 రోజుల్లోనే రుణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిదంటూ ఈనాడు రాసిన కథనంలో వాస్తవం ఏమాత్రం లేదు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఆలోచనాత్మకంగా సుదీర్ఘంగా జరిగిన చర్చ.. ఇందుకు పట్టిన సమయాన్ని ‘ఈనాడు’ ఉద్దేశపూర్వకంగానే పరిగణనలోకి తీసుకోలేదు. రుణానికి, జరిమానాలకు లింకేంటి? ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి జరిమానాలపై ఆధారపడటం అనేది ఉండదు. ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నుంచి పొందిన లీజు అద్దెల వంటి ఆదాయాల ద్వారా మాత్రమే రుణాలు తిరిగి చెల్లిస్తాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రజల భద్రతా చర్యలకు వినియోగిస్తాం. అంతేగానీ జరిమానాల సొమ్మును రుణాలకు చెల్లిస్తారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం. ఏపీని టాప్‌లో నిలబెట్టిన బీబీఎన్ఎల్.. ఏపీఎస్ఎఫ్ఎల్ మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్ అమలు నిర్వహణ ఏజెన్సీగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును హోం శాఖ కూడా వినియోగించుకుంటోంది. అలాగే రూ.300 కోట్ల రుణం అనేది బీబీఎన్ఎల్ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేవలం 50 శాతమేనన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, బీబీఎన్ఎల్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశాం. అంతేకాదు దేశంలో భారత్ నెట్ మిషన్ లక్ష్యాలను సాధించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను బీబీఎన్ఎల్ నిలబెట్టింది. బీబీఎన్ఎల్ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణంలో పురోగతి లేదనే ఆరోపణ పూర్తిగా నిరాధారమైనది. -
టీటీఈలకు బాడీ కెమెరాలు
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది. ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. -
ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలు 13వ తేదీ వరకు జరుగుతాయి. గత సంవత్సరం వరకు పదోతరగతిలో 11 పేపర్లతో పరీక్షలు జరగగా, వాటిని ఈసారి 6 ప్రశ్నపత్రాలకు కుదించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుంది. 2,652 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 4,94,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. కాగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపించినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ www.bse. telangana.gov.in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకంతో పాటు స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది. పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష విధులకు నియమించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లను ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్ఎంను పరీక్ష కేంద్రానికి డిప్యూట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా టీఎస్ఆర్టీసీ ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రిపరేషన్ రోజులలో, పరీక్షా కాలంలో విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుందని ప్రభుత్వం తెలిపింది. పదో తరగతి పరీక్షలకుసంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
రాచకొండ నుంచే మునుగోడు ‘కంట్రోల్’.. ప్రతి పోలింగ్ కేంద్రంలో..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐటీ బృందాలను కూడా నియమించామని వివరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రెండు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. అదనపు సీపీ జి.సుధీర్‌బాబు, డీసీపీలు నారాయణరెడ్డి, శ్రీబాల, అదనపు డీసీపీ భాస్కర్, ఏసీపీ ఉదయ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించినట్లు సీపీ భగవత్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒక ఎస్ఐ ఇన్చార్జిగా ఉంటారన్నారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయని చెప్పారు. 16 పోలింగ్ కేంద్రాలలో 35 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించామని, ఆయా స్టేషన్లలో బందోబస్తును మరింత పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించామని వివరించారు. భారీగా నగదు, బంగారం స్వాధీనం.. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసు బృందాలు 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తుంటాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు వాహన తనిఖీలలో రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5 కిలోల బంగారం, 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, పోలింగ్ రోజున అక్రమంగా మద్యం విక్రయాలు, సరఫరా చేసిన వ్యక్తులకు జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. సెల్ఫీలు దిగొద్దు.. పోలింగ్ కేంద్రాల ఆవరణలో సెల్ఫోన్లు నిషేధమని, సెల్ఫీలు దిగడంతో పాటు, ఎవరికి ఓటు వేశారో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సీపీ భగవత్ హెచ్చరించారు. చదవండి: ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా -
YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత మూడేళ్లుగా అవినీతి రహిత పాలన చేస్తున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు నవరత్నాల పథకాల్లో భాగంగా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అవినీతికి అడ్డాగా ఉన్న శాఖల్లో ఒకటైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో భూములు, స్థలాల క్రయ విక్రయదారుల నుంచి అధికారులతోపాటు దస్తావేజు లేఖర్లు వేలల్లో లంచాలు వసూలు చేసి వారి జేబులను ఖాళీ చేసేవారు. దీంతో ఆ శాఖలో అవినీతికి చెక్ పెట్టేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో కెమెరాల ఏర్పాటు వైఎస్సార్ జిల్లాలో కడప అర్బన్, కడప రూరల్, కడప చిట్స్, సిద్దవటం, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, వేంపల్లె, కమలాపురం, దువ్వూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలి, పుల్లంపేట, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, మదనపల్లె, పీలేరు, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు, తంబళ్లపల్లెలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయాలకు ప్రతిరోజు వచ్చి వెళ్లే వారిని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవినీతికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. చదవండి: (ఆర్ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే అంతే సంగతులు) వెబ్సైట్లో దస్తావేజు నమూనా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారంలో క్రయ విక్రయదారులు ఎక్కువగా దస్తావేజుల లేఖర్లను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో దస్తావేజు లేఖర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. వారితోపాటు కొంతమంది రిజిస్ట్రేషన్ సిబ్బంది కాకుండా బినామీలు కార్యాలయాలు తెరిచి తమ వారితో నిర్వహిస్తున్నారు. దీంతో దస్తావేజుల తయారీ సమయంలో లేఖర్లు చెప్పిందే వేదంగా అక్కడి వ్యవహారాలు నడిచేవి. క్రయ విక్రయదారులను లేఖర్ల బాధ నుంచి తప్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నమూనా దస్తావేజులను ఆ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు స్థిరాస్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో ప్రజలు లంచాల బారిన పడకుండా వారి సొంత గ్రామాల్లో వార్డుల పరి«ధిలోనే స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. అవినీతిపై ఫిర్యాదు చేయవచ్చు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బంది తీరుపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. లంచాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 14400 నంబరుకుగానీ, జిల్లా రిజిస్ట్రార్‌కుగానీ నేరుగా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – బి.శివరాం, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, కడప 14400 నంబరుతో ఫ్లెక్సీల ఏర్పాటు అవినీతికి అడ్డుకట్ట వేసేలా, అలాగే లంచగొండితనంపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన టోల్ ఫ్రీ నంబరు 14400పై ప్రజ లకు అవగాహన కలిగేలా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
పోలీస్ స్టేషన్లలో ‘మూడో కన్ను’.. ఒక్కో స్టేషన్లో 10 సీసీ టీవీ కెమెరాలు
సాక్షి, అమరావతి: పోలీసు వ్యవస్థ పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచడం లక్ష్యంగా పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పోలీస్ స్టేషన్లలోని అన్ని ముఖ్యమైన విభాగాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలను ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈమేరకు రెండు దశల్లో వాటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. మూడు నెలల్లో 600 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఏపీ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ విభాగం టెండర్లను పిలిచింది. ఆ సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించిన తర్వాత మిగతా స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. అక్రమ నిర్భందాలను నిరోధించేందుకు.. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో 500 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో పురుషులు, మహిళల లాకప్ రూమ్‌లలో వాటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో అక్రమ నిర్బంధాలను నిరోధించి మానవ హక్కుల పరిరక్షించడం, సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా పోలీసు సిబ్బంది ప్రవర్తిస్తున్నారా? లేదా అనేది పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తుల పట్ల ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగాగానీ, అనుకూలంగాగానీ వ్యవహరించకుండా పోలీసు అధికారులను కట్టడి చేసేందుకు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు దోహదపడుతుందని భావిస్తున్నారు. అధునాతన సీసీ కెమెరాలు రాష్ట్రంలోని మొత్తం 900 పోలీస్స్టేషన్లలో రెండు దశల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. నేరాల రేటు గణాంకాలను బట్టి మొదటి దశలో 600 స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో మిగిలిన పోలీస్ స్టేషన్లలో కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 10 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రధాన ప్రవేశద్వారం, ప్రధాన హాలు, రిసెప్షన్ రూమ్, స్టేషన్ ఆఫీసర్ రూమ్, రైటర్ రూమ్, ఆయుధాలు/సాక్ష్యాధారాల రూమ్, పురుషుల లాకప్, మహిళల లాకప్, కంప్యూటర్ రూమ్, పార్కింగ్ ఏరియాలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో లాకప్ రూమ్‌లలో ఒక్కో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన చోట ప్రస్తుతం 8 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఆడియో, వీడియో ఫుటేజీలతో పాటు రాత్రివేళల్లో కూడా స్పష్టంగా రికార్డ్ చేసేలా నైట్ విజన్ ఫీచర్లతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫుటేజీ కనీసం 18 నెలలపాటు స్టోరేజీలో ఉంటుంది. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. స్టేషన్లలో కెమెరాల నిర్వహణ బాధ్యత ఆ స్టేషన్ హౌస్ అధికారిదే. నిర్వహణలో ఇబ్బందులుంటే జిల్లా పర్యవేక్షక కమిటీలను సంప్రదించి సరి చేయించాలి. చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ -
నిఘా నీడలో కేబీఆర్ పార్క్ వాక్‌వే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో గతేడాది నవంబర్ 14న వాకింగ్ చేస్తున్న సినీనటి షాలూ చౌరాసియాపై కొమ్ము బాబు అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. ఆ తర్వాత మరో ఘటనలోనూ మరో నిందితుడు వాకర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడి కోసం ఎంత గాలించినా ఆధారాలు లభించలేదు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటే నిందితుడి జాడ క్షణాల్లో తెలిసి ఉండేది. సీసీ కెమెరాలు అక్కడ లేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ► నాలుగేళ్ల క్రితం కేబీఆర్ పార్కులో నాటకారి నరసింహ అనే చైన్‌స్నాచర్ వాకింగ్ వచ్చిన మహిళల గొలుసులు తస్కరిస్తూ గోడ దూకి వాక్‌వే నుంచి పరారయ్యేవాడు. ఇలా అయిదుసార్లు స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితు డిని పట్టుకోవడానికి పోలీసులకు కష్టతరమైంది. ► ఓ సూడో పోలీస్ ఈ ఏడాది జనవరిలో ఓ ప్రేమ జంటను జీహెచ్ఎంసీ వాక్‌వేలో బెదిరించి తాను పోలీసునని అడిగినంత ఇవ్వకపోతే ఫొటోలు బయటపెడతానని వారిని బెదిరించారు. తన బైక్‌పై ప్రేమికుడిని కూర్చుండబెట్టుకొని అమీర్‌పేట్‌కు వెళ్లి ఏటీఎంలో రూ.10 వేలు డ్రా చేయించి ఉడాయించాడు. ఆ సూడో పోలీసు గురించి ఆరా తీయగా అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. .. నిత్యం వేలాది మంది వాకింగ్ చేసే కేబీఆర్ పార్కు వాక్‌వేలో జరిగిన ఉదంతాలివి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాకర్లు మూడేళ్లుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు. తాజాగా కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఒక అడుగు ముందుకు పడింది. వాకర్లకు భద్రతను కల్పిస్తూ అసాంఘిక శక్తులకు, స్నాచర్లకు, ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలు ఒక్కటే మార్గమని భావించిన పోలీసులు పార్కు చుట్టూ 150 కెమెరాలకు శ్రీకారం చుట్టారు. ► మొదటి విడతగా 70 కెమెరాలు ఇప్పటికే బిగించారు. మొదటి విడతలో బిగించిన 70 కెమెరాలు త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకోనున్నాయి. ఇక రెండో విడతలో ఇంకో 80 కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 70 సీసీ కెమెరాలు కేబీఆర్ పార్కు ప్రధాన గేటు నుంచి అటు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఇటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వరకు ఏర్పాటు చేశారు. రెండో విడతలో బసవతారకం ఆస్పత్రి నుంచి జానారెడ్డి నివాసం, స్టార్‌బక్స్, సీవీఆర్ న్యూస్, బాలకృష్ణ నివాసం మీదుగా మంత్రి డెవలపర్స్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 80 కెమెరాలు ఫిక్స్ చేస్తారు. వీటి ఏర్పాటుతో వాక్‌వే మొత్తం నిఘా నేత్రంలోకి వెళ్తుంది. (క్లిక్: అమ్నేషియా పబ్ కేసు.. మరీ ఇంత దారుణామా..?) జీహెచ్ఎంసీ వైఫల్యం... కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో వరుస సంఘటనలు జరుగుతున్నా జీహెచ్ఎంసీలో మాత్రం చలనం ఉండటం లేదు. పలుచోట్ల గేట్లు విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల ఫెన్సింగ్ దొంగిలించారు. ఆరు నెలల క్రితం సంఘటన జరిగినప్పుడు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఒక్క హామీ నెరవేరలేదు. కనీసం వాక్‌వేలో స్ట్రీట్‌లైట్లు కూడా చాలా చోట్ల వెలగడం లేదు. ఏదైనా ఘటన జరిగితే పోలీసులపైనే భారం పడుతుంది తప్పితే సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. (క్లిక్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం) -
మూడు వేల మందితో బందోబస్తు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా పెద్ద సంఖ్యలో వీఐపీలు పాల్గొంటుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట పట్టణం, రాయగిరి నుంచి వచ్చే రహదారి, చుట్టుపక్కల ప్రాంతాలు, రింగ్‌రోడ్డు, కొండపైన కలిపి సుమారు మూడు వేల మంది పోలీసు సిబ్బంది పహరా కాస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సివిల్ పోలీసులతోపాటు ట్రాఫిక్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఐటీ, ఇంటెలిజెన్స్, ఎస్బీ, షీటీం విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. బాంబ్, డాగ్ స్వా్కడ్ బృందాలతో ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇక యాదగిరిగుట్ట పట్టణం, యాదాద్రి కొండ, వీఐపీలు పర్యటించే ప్రాంతాల్లో కలిపి 442 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో వెబ్ కాస్టింగ్ వాహనంతో పరిశీలన జరుపుతున్నారు. 3 గంటలదాకా ‘గుట్ట’బయటే.. యాదాద్రీశుడి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాదాద్రికి వచ్చే వాహనాల విషయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ♦సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల వాహనాలను యాదగిరిగుట్టకు సమీపంలోని వడాయిగూడెం వద్ద నిలపాలి. ♦కీసర, సిద్దిపేట, గజ్వేల్, తుర్కపల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను మల్లాపురం వద్ద ఆపేస్తారు. ♦రాజాపేట వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని స్పెక్ట్రా వెంచర్లో నిలపాలి. ♦వరంగల్, జనగాం, ఆలేరు నుంచి వచ్చే భక్తుల వాహనాలను వంగపల్లి సమీపంలో నిలిపివేస్తారు. ఈ వాహనాలన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల తర్వాతే యాదగిరిగుట్ట పట్టణంలోకి అనుమతిస్తారు. పూర్తిస్థాయిలో భద్రత యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మేరకు పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశాం. దర్శనాల కోసం భక్తులు మధ్యాహ్నం 3గంటల తర్వాతే రావాలి. ప్రతి భక్తుడు క్యూ కాంప్లెక్స్ వద్ద జియో ట్యాగింగ్ చేసుకోవాలి. తర్వాత క్యూకాంప్లెక్స్‌లో నుంచి తూర్పు రాజగోపురం ద్వారా దర్శనాలకు వెళ్లవచ్చు. అనంతరం ప్రసాదాలు కొనుగోలు చేసి బస్సులో కొండ దిగాలి. –మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్ వీఐపీలు, ఉద్యోగుల వాహనాల పార్కింగ్ ఇలా.. ♦వీఐపీల వాహనాలను టెంపుల్ సిటీకి వెళ్లే మార్గంలో ఉన్న మున్నూరుకాపు సత్రం వద్ద నిలపాల్సి ఉంటుంది. ♦యాదాద్రి క్షేత్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, మీడియా, ఆచార్యుల వాహనాలను పాత గోశాలలోని సత్యనారాయణస్వామి వ్రత మండపం వద్ద నిలపాలి. ♦ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలను తులసీ కాటేజీలో పార్కింగ్ చేయాలి. -
తిరుగుబోతు భర్త.. కీచక మామ: బాత్రూమ్లో సీసీ కెమెరాలు
గుంటూరు ఈస్ట్: తిరుగుబోతు భర్త.. కీచక మామల నుంచి తన కుమార్తెకు రక్షణ కల్పించాలని ఓ మహిళ పోలీసులను వేడుకుంది. అర్బన్ ఎస్పీ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ తన గోడు వెల్లబోసుకుంది. వారు తెలిపిన వివరాలు.. డొంకరోడ్డుకు చెందిన ఎలినేని సందీప్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. 2016 సంవత్సరంలో శ్రీనగర్‌కు చెందిన స్వాతితో వివాహం అయింది. సందీప్ టిక్‌టాక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని జల్సాగా తిరిగేవాడు. స్నేహితురాలు అంటూ ఓ మహిళను తరచూ ఇంటికి తీసుకువచ్చేవాడు. సందీప్ తల్లి పద్మావతి కూడా అతనికే వత్తాసు పలికింది. 2017 సంవత్సరంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసే పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. కంభంపాడులో నివసించే సందీప్ తండ్రి శ్రీనివాసరావు తరచూ మా ఇంటికి వచ్చి స్వాతితో అసభ్యంగా ప్రవర్తించే వాడు. భర్తకు చెబితే తండ్రినే వెనుకేసుకుని వచ్చాడు. పద్మావతి ఉద్యోగం కుమారుడికి రావాలంటే శ్రీనివాసరావు ఎన్‌ఓసిపై సంతకం చేయాలి. ఈ కారణంగా తన తండ్రికి సహకరించమంటూ నా భర్త ప్రోత్సహించాడు. మామ శ్రీనివాసరావు బాత్రూమ్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు. కుమారుడిని ఇతర మహిళలతో తిరగకుండా బుద్ది చెప్పాలని, నాకు న్యాయం చేయాలని నా మామను కోరితే నాతో ఉండు నీకు న్యాయం చేస్తానంటూ దుర్మార్గంగా ప్రవర్తించాడు. అనంతర కాలంలో స్వాతికి, ఆమె కుమార్తెకు సరిగా తిండి పెట్టలేదు. మామ లైంగిక దాడికి యత్నించగా ఆమె ఎదురుతిరిగి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది. నువ్వు లొంగక పోతే నీ కుమార్తె (2 సంవత్సరాల పాప) తో కోరిక తీర్చుకుంటానని పాపను లాక్కుని బెదిరించాడు. శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. 2018 డిసెంబర్లో బంధువుల సహాయంతో శ్రీనగర్‌లోని పుట్టింటికి చేరింది. ఒకరోజు భర్త ఇంటి ముందు ఉన్నాను బయటకు రమ్మంటే వెళ్లింది. కొందరు వ్యక్తులు ఆమెపై రాళ్లు విసిరారు. ఫిర్యాదు చేసేందుకు వస్తున్నానని తెలిసి చంపుతామని బెదిరించారు. నాకు, నా కుమార్తెకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలని కోరింది. -
13,296 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం కీలక విషయాలు వెల్లడించారు. గత కొంత కాలంగా రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13,296 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఆలయాల భద్రత విషయంలో సీసీ కెమెరాలు, మ్యాపింగ్ కీలకం కావటంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆలయాల వద్ద పోలీసు భద్రతతోపాటు టెంపుల్ కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని కొన్ని దుష్ట శక్తులు ఆలయాలపై దాడులను ప్రభుత్వానికి, పోలీసులకు ఆపాదించి.. దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని డీజీపీ మండిపడ్డారు. ఇక ఇప్పటివరకు దాడులకు సంబంధించి నమోదైన 9 కేసుల్లో రాజకీయ పార్టీల నేతల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఆయన మీడియాకు తెలిపారు. ఇందులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. దాడి ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి పాల్పడుతున్న కొందరిపై కన్నేసి ఉంచామని, త్వరలో వారపై చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడే సాహసం ఎవరూ చేయకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడుల నిరోధానికి మత సామరస్య కమిటీలు సమన్వయం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
లిప్‌స్టిక్‌లో రహస్య కెమెరాలు
భోపాల్: సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ హనీ ట్రాప్ సెక్స్ స్కాంలో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. లిప్‌స్టిక్‌ల్లో, కళ్లద్దాల్లో రహస్యంగా దాచిన కెమెరాల ద్వారా రాసలీలలను చిత్రీకరించారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి పదుల సంఖ్యలో స్పై కెమెరాలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఒక యువతితో ఓ హోటల్ గదిలో చేస్తున్న రాసలీలల వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హిందుత్వ సంస్థకు చెందిన నాయకుడికి సన్నిహితుడైన ఓ పెద్దాయనకు సంబంధించిన మరో వీడియో కూడా హల్ చల్ చేస్తోంది. అయితే, అవి నిజమైనవా? కావా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ స్కామ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అవి చాలావరకు నకిలీవని తెలుస్తోంది. కొందరు మహిళలు మధ్యతరగతి కాలేజీ అమ్మాయిలను ఎర వేసి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో పనులు చేయించుకుని కోట్లు సంపాదించిన స్కామ్ ఒకటి తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. అదే సమయంలో వారు ఆ యువతులతో ఉన్న సమయంలో వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేయడం ద్వారానూ పనులు చేయించుకునేవారు. ఓ సీనియర్ ఇంజినీర్ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఆర్తి దయాల్, మోనిక యాదవ్, శ్వేత విజయ్ జైన్, శ్వేత స్వప్నిల్ జైన్, బర్ఖా సోని, ఓం ప్రకాశ్ కోరిలను సిట్ అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ మంత్రుల శృంగారాలున్న వీడియో, ఆడియో క్లిప్‌లను వేలాదిగా సిట్ స్వాధీనం చేసుకుంది. -
నిఘా సాగర్
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ పర్యాటక ప్రాంతంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న హుస్సేన్ సాగర్‌ను సందర్శించనిదే దేశీ, విదేశీ పర్యాటకులు తిరిగి వెళ్లరు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని సకుటుంబ సమేతంగా సందర్శించడంతో పాటు సాగర్‌లో బోటింగ్ చేసి, బుద్ధ విగ్రహన్ని దర్శించుకుంటుంటారు. దేశంలోనే అత్యధిక మంది సందర్శకులు వస్తున్న ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన ‘హుస్సేన్‌సాగర్’ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ(బీపీపీఏ) అధికారులు చర్యలు చేట్టారు. ఇటీవల బీపీపీఏ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు చేపట్టిన హెచ్ఎండీఏ కార్యదర్శి రాంకిషన్ ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ కింద ఉండే ప్రాంతాల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే హెర్బల్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పార్కును పిల్లల ఉద్యానవనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే పర్యాటకులు, ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకున్న రాంకిషన్.. సాగర్ చుట్టూ రూ.3 కోట్ల వ్యయంతో 250 సీసీటీవీ కెమెరాలు బిగించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయేలా ఈ నిఘానేత్రాలు ఉపయోగపడనున్నాయి. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సిబ్బంది కూడా ఏయే ప్రాంతాల్లో కెమెరాలు బిగించాలనే దానిపై బీపీపీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గణేశ్ నిమజ్జనం తర్వాత కెమెరాల బిగింపు పనులను వేగవంతం చేయనున్నారు. అందరి భద్రత కోసం ఏర్పాట్లు సాగర్.. దాని చుట్టు పక్కల ప్రాంతాలఅభివృద్ధి కోసం 2000 డిసెంబర్ 12నబుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ(బీపీపీఏ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏలో ప్రత్యేక విభాగమైన బీపీపీఏ 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. దీనికింద లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, పీవీ జ్ఞాన్ భూమితో పాటు హుస్సేన్ సాగర్ కూడా ఉంది. ఈ ప్రాంతాలను వారంలో తక్కువలో తక్కువగా లక్ష మంది సందర్శిస్తుంటారు. అయితే సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉన్న హుస్సేన్ సాగర్‌లో అడపదడపా అపశ్రుతులు చోటుచేసుకోవడం సర్వసాధారణమైంది. ప్రేమజంటలు కూడా రెచ్చిపోయి అశ్లీలంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. దీనికితోడు కుటుంబ సమస్యలున్నవారు, జీవితంపై విరక్తి చెందిన వారు ఆత్మహత్యలు చేసుకునేందుకు సాగర్‌నే ఎంచుకుంటున్నారు. దీంతో ప్రజల భద్రతే ప్రామాణికంగా తీసుకొని 250 సీసీటీవీ కెమెరాలను బీపీపీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో లంబినీపార్కులో బాంబు పేలుళ్లు జరిగిన ఉందంతం కూడా ఇప్పుడు సాగర్ చుట్టూ నిఘానేత్రాలు ఏర్పాటు చేయడానికి మరో కారణమని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా వీఐపీ కదలికలు ఎక్కువగా ఉండటంతో పాటు వాహన రాకపోకలు కూడా అంతే స్థాయిలో ఉండే సాగర్ చుట్టూ కెమెరాలు త్వరితగతిన బిగించే దిశగా చర్యలు చేపట్టారు. లేక్ పోలీసులు కూడా సాగర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించేవారిని దూకి మరీ రక్షిస్తున్న కొన్ని సందర్భాల్లో కొందరి ప్రాణాలు పోయిన ఘటనలున్నాయి. ఈ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు లేక్ పోలీసుల పనిని తగ్గిస్తుందని బీపీపీఏ అధికారులు చెబుతున్నారు. ఈ 250 సీసీటీవీ కెమెరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు లేక్ పోలీస్ స్టేషన్‌కు కూడా అనుసంధానించనున్నట్టు చెబుతున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు. -
కొత్వాల్ కొరడా..!
‘రాత్రి 12 గంటలు. కోతిరాంపూర్‌లోని ఓ గల్లీలో కొందరు యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. చౌరస్తాలో అప్పటికే సిద్ధం చేసిన టేబుల్, దానిపై ఓ కేక్, క్యాండిల్స్... పుట్టినరోజు జరుపుకుంటున్న తమ మిత్రుడికి శుభాకాం క్షలు చెబుతూ కేక్ కట్ చేయించారు. కేరింతలు కొడుతూ బీర్ల మూతలు తెరిచారు. యువకుల సందడిని చూసిన ఓ వ్యక్తి 100 నెంబర్‌కు ఫోన్ చేయడంతో వెంటనే పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరింది. పోలీసు వాహనం హారన్ వినగానే ఎక్కడి వారు అక్కడ పరార్’ – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను తగ్గించడం, మహిళలు, బాలికల రక్షణ, యువకుల విచ్చలవిడి తనానికి పుల్‌స్టాప్ పెట్టడం, అక్రమ దందాలను అరికట్టడం... తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి గత కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలకు మరింత పదును పెట్టారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు బ్లూకోట్స్, పెట్రోలింగ్ స్టాఫ్, క్రైం పార్టీలు, ఈ కాప్స్, అడ్మినిస్ట్రేషన్, రిసిప్షన్ తదితర 10 విభాగాల సిబ్బందికి ఇచ్చే శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం బ్లూకోట్స్, పెట్రోలింగ్ టీంలతో పాటు క్రైంపార్టీ పోలీసులతో జరిగిన సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో మాట్లాడి వారి నుంచి సలహాలు కూడా తీసుకున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ టీమ్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా కితాబిచ్చారు. ప్రార్థనా స్థలాల వద్ద తెల్లవారు జామున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తరచూ ఈవ్‌టీజింగ్ జరిగే బస్టాండ్స్, పార్కులు, కాలేజీ అడ్డాలు వంటి ‘హాట్‌స్పాట్స్’ను గుర్తించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని వారిని ఆదేశించారు. వ్యవస్థీకృత భూదందాలు నిర్వహిస్తున్న వారిపై ఇప్పటికే నిఘా ఉన్నప్పటికీ... పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత కరీంనగర్ లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని, విచ్చలవిడి తనాన్ని రూపు మాపడం, మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడం ధ్యేయంగా పనిచేయాలని అధికారులు, క్షేత్రస్థాయి పోలీసులకు సూచనలు ఇచ్చారు. మనోళ్ల పనితీరు ఎలా ఉంది..? సోమవారం స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసులతో కమిషనర్ కమలాసన్‌రెడ్డి సమావేశం అయ్యారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లు, సీఐ, ఎస్సైల తీరుపై ఆరా తీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్హెచ్ఓలు, భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న పోలీసు అధికారుల వివరాలతోపాటు సామాన్యులు పోలీసుల విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారనే అంశాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఎస్బీ మీటింగ్‌లో సూచనలు, సలహాలు చేసిన అనంతరం ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. వడ్డీ దందాలు, ఆర్థిక నేరాలకు సంబంధించి కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఒక్కొక్కరు ఒక్క నేరాన్నైనా ఛేదించాలి: క్రైంపార్టీల్లో పనిచేస్తున్న పోలీసులు మెదడుకు పనిచెప్పాలని, వ్యూహాత్మకంగా నేరాలను ఛేదించాలని మంగళవారం జరిగిన క్రైంపార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. ఎలాంటి కేసైనా పట్టుదలతో ప్రయత్నిస్తే ఛేదన కష్టం కాదని, ప్రతీ నేరానికి ఎక్కడో ఒకచోట క్లూ లభిస్తుందని అన్నారు. ఇతర జిల్లాల్లో నేరగాళ్లు పట్టుబడే విధానాలను పరిశీలించాలని సూచించారు. సైబర్ ల్యాబ్‌తోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. క్రైంపార్టీలలో పనిచేసే పోలీసులు ఒక్క నేరాన్ని అయినా స్వయంగా ఛేదించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. 31లోగా అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో ఈ నెల 31లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థినులు, మహిళలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, లేడీస్ హాస్టళ్లు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి వంద మంది గుమిగూడే ఏ ప్రాంతమైనా సీసీ కెమెరా తప్పనిసరని, సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తే ఎలాంటి సంఘటననైనా రికార్డు చేయవచ్చని అన్నారు. పాఠశాలల్లో చదివే ఎదిగిన పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలలోని ప్రతి ఆవరణ నిక్షిప్తం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఆ సందర్భంగా ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయని ఓ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నగదుతో పాటు సిగరెట్లనూ ఎత్తుకెళ్లారు..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్) : బాదేపల్లి పట్టణంలోని ఆర్కే గార్డెన్ సమీపంలో గల ఐటీసీ(ఇండియన్ టొబాకో కంపెనీ) గోదాంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ చోటుచేసుకుంది. బాధితులు సంతోష్, శ్యాంసుందర్ కథనం మేరకు.. శుక్రవారం రాత్రి తమ కలెక్షన్‌ను ఇంటికి తీసుకెళ్లకుండా బీరువ, తదితర లాకర్లలో భద్రపరిచి గోదాంకు తాళం వేసి వెళ్లామన్నారు. ఉదయం 10గంటల తరువాత దుకాణం తెరచి చూడగా ఆఫీస్‌లోని బీరువా తెరిచి ఉండడం, కంప్యూటర్లు, తదితర వస్తువులు చిందరవందరగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భద్రపర్చిన డబ్బుల దాదాపు రూ.6.85 లక్షలు అపహరించారని, అదేవిధంగా రూ.2.40 లక్షల విలువ గల సిగరెట్లు ఎత్తుకెళ్లారని తెలిపారు. దొంగలు పైకప్పు రేకును మనిషి పట్టే అంత సైజుమేరకు కట్టర్ ద్వారా కత్తిరించి లోపలికి ప్రవేశించారు.అనంతరం సీసీ కెమెరాలకు సంబంధించిన హార్ట్ డిస్క్‌ను తొలగించి నగదు, సిగరెట్లను తమ వెంట తీసుకెళ్లారు. రెండు కంప్యూటర్ మానిటర్లను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో జడ్చర్ల సీఐ బాల్‌రాజ్‌యాదవ్, క్లూస్ టీం, తదితర సిబ్బంది గోదాంకు చేరుకుని విచారించారు. చోరీకి సంబంధించిన వేలిముద్రలు, తదితర ఆధారాలను సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాల్‌రాజ్‌యాదవ్ తెలిపారు . అనుమానాలెన్నో.. కాగా చోరీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు గోదాం మూసివేసే సమయంలో ఆ రోజు కలెక్షన్‌ను తమ వెంటే తీసుకెళ్లే నిర్వాహకులు శుక్రవారం తీసుకెళ్లలేదు. అంటే గోదాములో కలెక్షన్ ఉందని తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారా అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నా యి. అంతేగాక సీసీ కెమెరాలకు సం బం ధించి హార్ట్‌డిస్క్‌ను తీసుకెళ్లడం, గోదాంలోకి ప్రవేశించడం వంటివి గమనిస్తే పక్కా స్కెచ్‌తోనే చోరీకి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బీసీ హాస్టళ్లలో నిఘా నేత్రం
సత్తుపల్లిటౌన్: ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మెనూ సక్రమంగా అందేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఖమ్మం జిల్లాలోని 24 బీసీ హాస్టళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 26 హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 18 హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. మిగతా బీసీ హాస్టళ్లలో వారం రోజుల్లో అమర్చేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో హాస్టల్లో ఆరు సీసీ కెమెరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీ హాస్టళ్లు ఇక సీసీ నిఘాతో పని చేయనున్నాయి. బీసీ హాస్టల్లోని విద్యార్థులకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసింది. ఒక్కో హాస్టల్లో ప్రధాన ద్వారం, వెనుక ద్వారం, మరుగుదొడ్లు, కిచెన్, ఆఫీస్రూం, డైనింగ్ హాల్ ఆరు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా బీసీ హాస్టల్లో ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారు..? సంక్షేమ అధికారులు, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారానే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని బీసీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంతో సీసీ కెమెరాలను ఆన్లైన్ అనుసంధానం చేశారు. సెట్విన్ కంపెనీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్స్‌లో సీసీ కెమెరాలు చేపడుతున్నారు. అక్రమాలకు చెక్ హాస్టళ్లలో సంక్షేమ అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది పనితీరు, విద్యార్థుల హాజరును ఇకపై ఉన్నతాధికారులు నిఘా నేత్రాల సహకారంతో ఆన్లైన్లోనే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా హాస్టల్లోకి ఇతర వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా..? హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు వెళ్తున్నారా?, స్టోర్ రూంలో సరుకుల నిల్వలు, కిచెన్‌లో వంట పనుల తీరు, ఇలా సమగ్రంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. దీనివల్ల హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
నిఘా నీడలో.. ‘రిజిస్ట్రేషన్’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కార్యాలయ కార్యకలాపాలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూములకు సంబంధించి రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. నిత్యం కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా.. అనే విషయాలను ఏరోజుకారోజు తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు వీలు కలుగుతుంది. జిల్లావ్యాప్తంగా 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలోని రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ కార్యాలయం, ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయం ఉన్నాయి. వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయవిక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అయితే వీటిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా.. ఎవరూ మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆస్తులు అమ్మే క్రమంలో దొంగ సంతకాలు పెట్టకుండా.. నకిలీ డాక్యుమెంట్లు చూపించకుండా ఉండేందుకు.. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల సమయంలో దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు నిఘాను కట్టుదిట్టం చేసింది. కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల అక్రమాలు జరగకుండా ఉండేందుకు వీలు కలుగుతోంది. రాష్ట్ర శాఖకు అనుసంధానం.. జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర శాఖ ఐజీ కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీనిద్వారా రాష్ట్రంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర శాఖలోని అధికారులు తెలుసుకునే వీలుంటుంది. ఏ ప్రాంతం నుంచి అయినా ఫిర్యాదులు వచ్చినట్లయితే ఆ సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర శాఖ కార్యాలయంలోనే పరిశీలించి.. చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల తీరును కూడా పరిశీలించేందుకు ఉన్నతాధికారులకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారికి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఆరోజు జరిగిన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సీసీ పుటేజీని కూడా కట్ చేసి ఆయా వ్యక్తులకు అందజేయనున్నారు. నిత్యం నిఘా.. జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండేసి చొప్పున సీసీ కెమెరాలు, ఒక టీవీ, కంప్యూటర్ను రాష్ట్ర శాఖ ఏర్పాటు చేయించింది. టీసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన పుటేజీ మొత్తం ఆయా కేంద్రాలతోపాటు రాష్ట్ర ఐజీ కార్యాలయంలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే అక్కడ పుటేజీని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్న శాఖ మరో అడుగు ముందుకేసి రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు. అలాగే క్రయ, విక్రయదారులు కేవైసీ(ఆధార్ నంబర్) ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనిద్వారా కంప్యూటర్లో వారి ఆధార్ నంబర్ నమోదు చేయగా.. క్రయ, విక్రయదారులకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీంతో వారు ఆ భూములు, ఆస్తులకు సంబంధించిన వారా..? కాదా..? అనే విషయాలను తెలుసుకుని రిజిస్ట్రేషన్లు పకడ్బందీగా చేసే వీలు కలుగుతుంది. కేవైసీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతి పని పారదర్శకంగా జరిగేందుకు వీలు కలిగింది. పకడ్బందీగా నిర్వహించేందుకు.. జిల్లాలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన రాష్ట్ర శాఖ అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై నిఘా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలు కలిగింది. – అడపా రవీందర్, సబ్ రిజిస్ట్రార్ -
నిఘా నేత్రంలో పల్లెలు
బీర్కూర్(బాన్సువాడ): నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులకు సీసీ కెమెరాలు సాయమందిస్తున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా పలు మండల కేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లో స్థానిక పోలీసులు పలు కూడళ్లలో కెమెరాలను ఏర్పాటు చేశారు. బీర్కూర్ మండల కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల్లో పోలీసులు ఈ చలాన్‌ను అమలు చేస్తున్నారు. దీనిని పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటోంది. రాత్రివేళల్లో దొంగతనాలు జరుగకుండా, గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించివారిపై నిఘాను పెంచారు. బీర్కూర్ మండల కేంద్రంతోపాటు నస్రుల్లాబాద్, బాన్సువాడ వంటి మండలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు గతంలో గ్రామాల్లో దొంగతనాలతోపాటు ఇతర నేరాలు జరిగే సందర్బంలో కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించేవారు. అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారణ చేసి కేసును పరిష్కరించేవారు. అయితే తెలంగాణ ఏర్పాటైనన తరువాత ప్రభుత్వం నేరాల అదుపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దీనిలో భాగంగానే గ్రామస్తుల సహకారంతో పోలీసులు ప్రతీ గ్రామంలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడైనా నేరం జరిగినట్లు తెలిస్తే వెంటనే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకుంటున్నారు. దీనివల్ల కేసులను పరిష్కరించడంలో వేగం వచ్చిందని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే మానిటరింగ్.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేసేందుకు పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా మానిటరింగ్ టీవీలను ఏర్పాటు చేసి నిత్యం ఎస్సై వాటిని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ కెమెరాలతో ఎంతో ఉపయోగం ఉందని బీర్కూర్ ఎస్సై పూర్ణేశ్వర్ వివరించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగితే చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు. రోజూ పోలీస్ స్టేషన్లో గ్రామాల వారిగా సీసీ కెమెరాలను పరిశీలించి అనుమాన్పదంగా ఉంటే వెంటనే విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామాలవారిగా వివరాలు.. బీర్కూర్ గ్రామంలో 13 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, దామరంచలో 11, భైరాపూర్‌లో 4, మల్లాపూర్‌లో 4, బరంగేడ్గి గ్రామంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేనుసైతంలో భాగంగా మండలవ్యాప్తంగా మరో 31 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు బీర్కూర్‌లో ట్రాక్టర్ యూనియన్ వారు రూ.80 వేలు విరాళాలు అందించగా కిరాణా అసోసియేషన్ వారు రూ.25 వే లు, హనుమాన్ ఆలయ కమిటీ రూ.5వేలు, క్రషర్ వారు రూ.20 వేలు, రాజస్థాన్ స్వీట్స్ వారు రూ.3 వేలు విరాళంగా ఇచ్చారని ఎస్సై వివరించారు. ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభం జిల్లా ఎస్పీ శ్వేత చేతులమీదుగా బీర్కూర్ మండలంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేస్తూ అన్ని గ్రామాలతోపాటు పలు మండలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయించేలా జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కెమెరాల ఏర్పాటు వేగవంతమైంది. నేరాల నియంత్రణకు.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. బీర్కూర్ మండలంలో కెమెరాల ఏర్పాటు వలన ఎన్నికల సమయంలో గొడవలు జరగకుండా చూస్తున్నాం. పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు దుకాణదారులు, హోటల్ యజమానులు సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. –ఎస్సై పూర్ణేశ్వర్ (బీర్కూర్) -
‘సీసీ’ సక్సెస్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పేదల సరుకులు దారిమళ్లకుండా.. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గోదాంల వద్ద ఏం జరుగుతుంది.. సరుకులు ఎలా తరలిస్తున్నారు.. అంతా సక్రమంగానే జరుగుతుందా? అనే విషయాలను తెలుసుకునే వీలు కలిగింది. గతంలో అక్రమాలు జరుగుతున్నాయని పలు ఫిర్యాదులు అందగా.. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఫిర్యాదులు తగ్గుముఖం పడుతున్నాయి. పౌరసరఫరాల శాఖ ద్వారా అర్హులైన పేదలకు బియ్యం, పంచదార వంటి రేషన్ సరుకులను సరఫరా చేస్తుంటారు. వీటిని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద నుంచి రేషన్ డీలర్లకు వాహనాల్లో తరలిస్తుంటారు. ఈ క్రమంలో పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చింది. దీంతో సుమారు 8 నెలల క్రితం జిల్లాలోని 8 ఎంఎల్ఎస్ పాయింట్లలో 79 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరాల ఏర్పాటుతో ఆయా సెంటర్లలో ఏం జరుగుతున్నదనే విషయాలను అధికారులు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండడంతో ఎవరూ అక్రమాలకు పాల్పడేందుకు సాహసించే అవకాశం ఉండదు. 79 సీసీ కెమెరాలు ఏర్పాటు.. పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు రేషన్ సరుకులను ప్రతినెలా పంపిణీ చేస్తుంటారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న గోదాంలలో నిల్వ చేస్తుంటారు. వాటిని ప్రతినెలా కోటా ప్రకారం ఎంఎల్ఎస్ పాయింట్ల(మండల లెవెల్ స్టాక్ పాయింట్)కు తరలిస్తారు. అక్కడి నుంచి రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేస్తారు. అయితే ప్రతిసారి ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద నుంచి సరఫరా అవుతున్న రేషన్ సరుకులకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుండేవి. వీటిని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని 8 ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద 79 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. నేలకొండపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద 10 కెమెరాలు, కల్లూరులో 5, వైరాలో 11, ఖమ్మం అర్బన్ 7, ఖమ్మం రూరల్ 8, మధిర 16, సత్తుపల్లి 11, ఏన్కూరులో 11 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాలు అమర్చిన ఎంఎల్ఎస్ పాయింట్లలో ఏం జరుగుతున్నది.. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంతోపాటు హైదరాబాద్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి మానిటరింగ్ చేస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ఇన్చార్జి, డేటా ఆపరేటర్ విధుల్లో ఉంటారు. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో డేటా నెల రోజులపాటు అందుబాటులో ఉంటుంది. ఈ నెల రోజుల సమయంలో ఏం జరిగిందనేది ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా చూడవచ్చు. జిల్లాలోని సివిల్ సప్లై కార్యాలయంలో.. హైదరాబాద్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో 24 గంటలకు సంబంధించి డేటా అందుబాటులో ఉంటుంది. ఆయా కార్యాలయాల నుంచి ఆ సమయంలో ఏం జరుగుతుందనేది చూసేందుకు వీలు కలుగుతుంది. అక్రమాలకు చెక్.. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పౌరసరఫరాల శాఖలో జరిగే కొన్ని అవకతవకలకు చెక్ పెట్టే అవకాశం లభించింది. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో కొందరు బస్తాల నుంచి బియ్యం దొంగిలించారనే ఆరోపణలున్నాయి. అయితే సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు. అలాగే పలు పాయింట్ల వద్ద నుంచి గతంలో బియ్యం బస్తాలు మాయం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ బస్తాలు ఎలా తరలిపోయాయనే అంశం ఎవరికీ తెలియని పరిస్థితి. ప్రస్తుతం సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రతి అంశాన్ని పౌరసరఫరాల శాఖ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఏర్పడింది. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దకు ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారనే అంశాలను ఆ శాఖ అధికారులు మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. పటిష్ట నిఘా.. ఎంఎల్ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నిఘా పెరిగింది. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఏం జరుగుతుందనే విషయాన్ని మా కార్యాలయంతోపాటు హైదరాబాద్ కార్యాలయంలో కూడా పర్యవేక్షించే అవకాశం ఉంది. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, ఖమ్మం -
నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
భూపాలపల్లి: నేరాల నియంత్రణకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటూనే ప్రజల భాగస్వామ్యంతో పనిచేయాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో ముందుండి జవాబుదారీగా పనిచేయాలన్నారు. బాధితులు ఫిర్యాదులు అందించిన వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పెండింగ్ కేసుల విషయంలో సమర్థవంతంగా పనిచేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని, నేరాల దర్యాప్తులో అధునాతన సాంకేంతిక పరిజ్ఞానాన్నిఉపయోగించుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం అయ్యేలా చూడాలని, ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించబడిన జరిమానాను ఇప్పటి నుంచి ఈ–చలాన్ సిస్టం ద్వారా మీ సేవా కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రాబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సమావేశంలో భూపాలపల్లి, ఏటూరునాగారం అడిషనల్ ఎస్పీలు రాజమహేంద్రనాయక్, శరత్‌చంద్రపవర్, భూపాలపల్లి, ములుగు, కాటారం, డీఎస్పీలు కిరణ్‌కుమార్, విజయసారథి, కేఆర్కే ప్రసాద్, ఎస్బీ, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు వెంకటేష్, మోహన్, జిల్లా పరిధిలోని సీఐలు పాల్గొన్నారు. పోలీసు అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ భాస్కరన్ -
కంటబడితే క్లిక్‌మంటోంది!
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలు అమరుస్తున్నారు. కనిపిస్తే చాలు అవి ముఖాన్నే కాదు కళ్లనూ ఫొటో తీసి, ఐరిస్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నాయి. అంతేకాదు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు పంపి నేరగాళ్ల ఆటకట్టించడంలోనూ దోహదపడుతున్నాయి. ఫేస్ డిటెక్నినేషన్ అని పిలవబడే ఈ కెమెరాలను ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వద్ద రెండు, ట్రామాకేర్, ప్రధాన ద్వారం, టీబీ సెంటర్, సూపర్‌స్పెషాలిటీ విభాగాలు, క్యాన్సర్ విభాగం, పీడియాట్రిక్, మాతాశిశు భవనాలు, పేయింగ్బ్లాక్, మెడిసిన్ విభాగాలు, మార్చురీ, ప్రాంతీయ కంటి ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మాట్రిక్స్ సర్విలెన్స్ అనే సంస్థ 899 కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఆసుపత్రులు, మసీదులు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, రైల్వేస్టేషన్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో వీటిని అమరుస్తున్నారు. ఒక్క కర్నూలు నగరంలోనే 200లకు పైగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతిని«ధి ఎల్లరాజు తెలిపారు. కనిపిస్తే కళ్లను ఫొటో తీసి పంపిస్తుంది ఈ అత్యాధునిక కెమెరాలకు ఎదురుగా ఎవ్వరైనా వెళితే వెంటనే వారి ఫొటోలను ఏకకాలంలో తీస్తుంది. అంతేకాదు ప్రధానంగా కళ్లను, ఐరిస్‌ను ఫోకస్ చేసి ఫొటో తీసి, దానిని ఆధార్‌తో అనుసంధానం చేస్తుంది. వెంటనే సదరు వ్యక్తి వివరాలు పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూంకు చేరుకుంటాయి. అనుమానిత వ్యక్తులు ఎవ్వరైనా ఇందులో ఉంటే వెంటనే పోలీసులకు సిగ్నల్ వెళ్తుంది. ఈ మేరకు నేరాలను కట్టడి చేసేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇవే గాక సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో ఎవ్వరైనా నిబంధనలకు వ్యతిరేకంగా రాంగ్ రూట్లో వెళ్లినా, రెడ్ సిగ్నల్స్ పడ్డప్పుడు వెళ్లినా వెంటనే ఫొటో తీసి పోలీసులకు పంపిస్తుంది. వారు సదరు వాహనదారుడికి జరిమానాకు సంబంధించిన చలానా పంపించేందుకు అవకాశం ఈ కెమెరాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. -
వరంగల్: సీసీ కెమెరాలే ఇక మా పెద్ద దిక్కు..
సాక్షి, వరంగల్: ఎన్నికల ఘట్టానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ఒంటికాలుమీద నిల్చుని ప్రచారం కొనసాగిస్తున్నారనడంలో సందేహం లేదు. తమ గెలుపు కోసం ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు. ఎలాగైన గెలవాలనేది అన్ని పార్టీల అభ్యర్థుల ఏకైక లక్ష్యం. దీని కోసం కొత్త దారులను అన్వేషిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం.. డబ్బులను ఆశగా చూపుతున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరూ ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని అయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు ఉన్నారు. పొద్దంత ప్రచారం..రాత్రంత పంపిణీ అనే విధంగా ఎన్నికలు ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టే డబ్బులు, మద్యం ను అదుపు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు పోలీసులు పలు విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం పోలీసు అధికారులకు పెద్ద దిక్కుగా మారాయి. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఏం జరిగినా క్షణాల్లో పోలీసులకు సమాచారం అందుతోంది. దీనికి తోడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై అడుగడుగునా ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టింది. నిబంధనలను అతిక్రమించిన వివిధ పార్టీల నేతలపై ఎక్కడికక్కడే కేసులు నమోదు చేస్తుంది. ఇప్పటికే అధికారులు ప్రతి నియోజకవర్గంలో రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను జల్లెడ పడుతున్నారు. దీంతో లెక్క చూపని డబ్బు పెద్ద మొత్తంలో దొరుకుతుంది. 51 కేసులు నమోదు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో 51 కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల నియమాళిని ఉల్లంఘించిన వ్యక్తులు, నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మాడల్ కోడ్ ఆఫ్ కండక్డ్ (ఎంసీసీ) కింది ఎన్నికల పర్యవేక్షకులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం రాజకీయ పార్టీల ప్రచారం, వారి కార్యకలపాలపై నిఘా పెట్టి ఉంచారు. ఎక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిన స్థానిక పోలీసు స్టేషన్ల్లో కేసులు నమోదు చేయిస్తున్నారు. కమిషనరేట్‌లోని సెంట్రల్ జోన్ పరిధిలో 27 కేసులు, వెస్ట్ జోన్ పరిధిలో 14 కేసులు, ఈస్ట్ జోన్ పరిధిలో 10 కేసులు నమోదు చేశారు. 2014లో జరిగిన ఎన్నికలలో కమిషనరేట్ పరిధిలో 133 కేసులు నమోదు చేశారు. వీటిలో 246 మందిపై చర్యలు తీసుకున్నారు. నిఘా నేత్రాలు.. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం అధికారులకు వజ్రాయుధంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైన గొడవలు జరిగితే సీసీ కెమెరాల అధారంగా పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 21091 కెమెరాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీసీ కెమెరాలను స్థానిక పోలీసు స్టేషన్లకు విరివిగా అనుసంధానం చేశారు. వినూత్న పద్ధతుల్లో.. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఓటుకు నోటు అనే విధంగా ముందుగు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. డబ్బుల పంపిణీ, ఎన్నికల తేదీ వరకు వారి బాగోగులు చూసే బాధ్యతను ఆ నాయకుడికి అప్పగించారు. ప్రచార సమయంలో ప్రచారం ముగిసిన తర్వా త అందరినీ ఒక దగ్గరకు చేర్చి రూ.150 చొప్పున అందజేస్తున్నారు. దీంతో పాటు మగవారికి అదనంగా బీరు, బిర్యానీ అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులను పంపిణీ చేసేందుకు 20 రోజుల క్రితమే సిద్ధం చేసి ఉంచారు. -
పోలింగ్‌పై నిఘా
పెద్దపల్లిఅర్బన్ : జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను నిఘా నీడలోకి తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బందిని నియమించేందుకు పోలీస్‌శాఖ కార్యాచరణ షురూ చేసింది. ఓటింగ్ జరిగే సమయంలో అవరోధాలు కల్పించే వారిపై ఉక్కుపాదాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 1,526 సీసీ కెమెరాలు జిల్లాలోని ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌కేంద్రం బయట ఎటూ వందమీటర్ల పరిధిలో జరిగే ప్రతీ వి షయాన్ని రికార్డు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 1,526 సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. 196 సమస్యాత్మక కేంద్రాలు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 763 పోలింగ్‌కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 196 సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలను అధికారులు గుర్తించారు. రామగుండం 31, మంథని 111, పెద్దపల్లిలో 54 సమస్మాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాలన్నీ పూర్తిగా సీసీ కెమెరాల నీడలో ఉండనున్నాయి. మామూలు కేంద్రాల వద్ద ఇరువైపులా మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేయనుండగా సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం వీలైనన్నీ ఎక్కువ కెమెరాలను బిగిస్తున్నారు. కేంద్రాల వద్ద ప్రచారం నిషేధం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయడం నిషేధమని పోలీసులు ప్రకటించారు. పార్టీల నాయకులు జెండాలు, కరపత్రాలు, బ్యాలెట్‌పేపర్లు, పోలింగ్ చీటీలు, కండవాలు ధరించి ప్రచారం చేస్తే సీసీ కెమెరాల ఆధారంగా సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రతీ చర్యను రికార్డు చేయనున్నట్లు పేర్కొంటున్నారు. గొడవలు చేసేవారిపై ఉక్కుపాదం పోలింగ్ సందర్భంగా గొడవలు సృష్టించే వారిని గుర్తించేందుకు, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత నిర్వహణను ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అదనపు బాధ్యతలు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల బాధ్యతను స్థానిక పోలీస్‌స్టేషన్ ఎస్సైలకు అప్పగించారు. వాటిని బిగించడం మొదలు పనితీరును పర్యవేక్షించే బాధ్యతలను సైతం వారికే అప్పగించారు. దీంతో పోలీసు అధికారులకు అదనపు బాధ్యతలు పెరగనున్నాయి. -
‘మూడో’కన్ను
కోరుట్ల: ఓటింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల గొడవలు.. ఓటర్లపై ఒత్తిళ్లకు చెక్ పెట్టే దిశలో పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ దిశలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎ న్నికల కోడ్‌ను ఉల్లఘించి పార్టీల నేతలు.. కార్యకర్తలు ఎలాంటి అవాంచనీయ సంఘటలకు పా ల్పడకుండా ఉండేందుకు చేపట్టిన ఈ చర్యలు మ ంచి ఫలితాలివ్వనున్నాయి. ఈ దిశలో ఇప్పటికే సెగ్మెంట్లవారీగా సీసీ కెమెరాలు అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 199 పోలింగ్ కేంద్రాలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని కోరుట్లలో 254 పోలింగ్ బూత్‌లుండగా.. 43 పోలింగ్ కేంద్రాలున్నాయి. జగిత్యాలలో 253 పోలింగ్ బూత్‌లుండగా.. 69, ధర్మపురిలో 269 బూత్‌లుండగా.. 87 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ లెక్కన జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్లలో కలుపుకొని మొత్తం 199 పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సంకల్పించింది. ఇంత పెద్ద మొత్తంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధుల లేమి కారణంగా ప్రస్తుతం అత్యంత సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలతోపాటు ఎక్కువ పోలింగ్ బూత్‌లున్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టింది. ఓటరుపై ఒత్తిడికి చెక్ పోలింగ్ రోజున చివరి నిమిషంలో ఓటర్లను తమవైపు మళ్లించుకోవడానికి ప్రతిసారి పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల నాయకులు తిష్ట వేయడం తెలిసిందే. పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆ సమయంలో పార్టీల నేతలు నానా యత్నాలు చేస్తారు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు.. కార్యకర్తలు గొడవలకు దిగే ఆస్కారముంటుంది. ఈక్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతత చెదిరి ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ఇలాంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా సీసీ కెమెరా నిఘా పూర్తి ఫలితాలిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. సీసీ నిఘా మంచిదే అయినా.. వీటి ఏర్పాటు కోసం ప్రత్యేకంగా నిధులివ్వకపోడం సమస్యగా మారింది. -
పిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకునే సీసీ కెమెరాలు
సాక్షి, అశ్వారావుపేటరూరల్: ఆశ్రమ, గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ‘నిఘా’ వేసింది. ఇక్కడి పిల్లల సంక్షేమం, రక్షణను దృష్టిలో ఉంచుకుని నిఘా నేత్రాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో విద్యార్థినీవిద్యార్థుల భద్రత, ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు, ప్రభు త్వం అందిస్తున్న బియ్యం, ఇతర సామగ్రి పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. మండలంలోని సున్నంబట్టి, పెదవాగు ప్రాజెక్ట్, అనంతారం, కావడిగుండ్లతోపాటు అశ్వారావుపేటలోని గిరిజన బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఒకొక్క పాఠశాలకు నాలుగు సీసీ కెమెరాలు, ఒ కొక్క కంప్యూటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను హైదారాబాద్లోగల కమిషనర్ కా ర్యాలయానికి అనుసంధానించారు. ఇక్కడ ఏం జ రుగుతోందో... హైదరాబాద్‌లోని ఉన్నతాధికా రు లు కూడా చూడొచ్చు. ఆయా పాఠశాలలు, గురుకుల పాఠశాలను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చే శా రు. దీనిపై తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది.