సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ పర్యాటక ప్రాంతంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న హుస్సేన్ సాగర్‌ను సందర్శించనిదే దేశీ, విదేశీ పర్యాటకులు తిరిగి వెళ్లరు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని సకుటుంబ సమేతంగా సందర్శించడంతో పాటు సాగర్‌లో బోటింగ్ చేసి, బుద్ధ విగ్రహన్ని దర్శించుకుంటుంటారు. దేశంలోనే అత్యధిక మంది సందర్శకులు వస్తున్న ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన ‘హుస్సేన్‌సాగర్’ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ(బీపీపీఏ) అధికారులు చర్యలు చేట్టారు. ఇటీవల బీపీపీఏ ఓఎస్‌డీగా అదనపు బాధ్యతలు చేపట్టిన హెచ్‌ఎండీఏ కార్యదర్శి రాంకిషన్ ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ కింద ఉండే ప్రాంతాల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే హెర్బల్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పార్కును పిల్లల ఉద్యానవనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే పర్యాటకులు, ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకున్న రాంకిషన్.. సాగర్ చుట్టూ రూ.3 కోట్ల వ్యయంతో 250 సీసీటీవీ కెమెరాలు బిగించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయేలా ఈ నిఘానేత్రాలు ఉపయోగపడనున్నాయి. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సిబ్బంది కూడా ఏయే ప్రాంతాల్లో కెమెరాలు బిగించాలనే దానిపై బీపీపీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గణేశ్ నిమజ్జనం తర్వాత కెమెరాల బిగింపు పనులను వేగవంతం చేయనున్నారు.
అందరి భద్రత కోసం ఏర్పాట్లు
సాగర్.. దాని చుట్టు పక్కల ప్రాంతాలఅభివృద్ధి కోసం 2000 డిసెంబర్ 12నబుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ(బీపీపీఏ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండీఏలో ప్రత్యేక విభాగమైన బీపీపీఏ 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. దీనికింద లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, పీవీ జ్ఞాన్ భూమితో పాటు హుస్సేన్ సాగర్ కూడా ఉంది. ఈ ప్రాంతాలను వారంలో తక్కువలో తక్కువగా లక్ష మంది సందర్శిస్తుంటారు. అయితే సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉన్న హుస్సేన్ సాగర్‌లో అడపదడపా అపశ్రుతులు చోటుచేసుకోవడం సర్వసాధారణమైంది. ప్రేమజంటలు కూడా రెచ్చిపోయి అశ్లీలంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. దీనికితోడు కుటుంబ సమస్యలున్నవారు, జీవితంపై విరక్తి చెందిన వారు ఆత్మహత్యలు చేసుకునేందుకు సాగర్‌నే ఎంచుకుంటున్నారు. దీంతో ప్రజల భద్రతే ప్రామాణికంగా తీసుకొని 250 సీసీటీవీ కెమెరాలను బీపీపీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో లంబినీపార్కులో బాంబు పేలుళ్లు జరిగిన ఉందంతం కూడా ఇప్పుడు సాగర్ చుట్టూ నిఘానేత్రాలు ఏర్పాటు చేయడానికి మరో కారణమని అధికారులు చెబుతున్నారు.
ఏదిఏమైనా వీఐపీ కదలికలు ఎక్కువగా ఉండటంతో పాటు వాహన రాకపోకలు కూడా అంతే స్థాయిలో ఉండే సాగర్ చుట్టూ కెమెరాలు త్వరితగతిన బిగించే దిశగా చర్యలు చేపట్టారు. లేక్ పోలీసులు కూడా సాగర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించేవారిని దూకి మరీ రక్షిస్తున్న కొన్ని సందర్భాల్లో కొందరి ప్రాణాలు పోయిన ఘటనలున్నాయి. ఈ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు లేక్ పోలీసుల పనిని తగ్గిస్తుందని బీపీపీఏ అధికారులు చెబుతున్నారు. ఈ 250 సీసీటీవీ కెమెరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు లేక్ పోలీస్ స్టేషన్‌కు కూడా అనుసంధానించనున్నట్టు చెబుతున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment