హైదరాబాద్, సాక్షి: గణేష్ నిమజ్జనం తో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. నిమజ్జనానికి గణపయ్యలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్యాంక్ బండ్‌వైపు రావొద్దని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు నగర పోలీసులు సూచిస్తున్నారు.
రేపు ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నిన్న రాత్రి నుంచి నియంత్రించేందుకు సిబ్బంది లేకపోవడం, పైగా వాటిల్లో భారీ వాహనాలు ఉండడంతో.. నిమజ్జనానికి గంటల తరబడి టైం పడుతోంది.
ఇక.. సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు లేరన్న మీడియా కథనాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనాలను త్వరగతిన పంపించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈలోపు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
దీంతో ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది.
రేపు ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక.. ఖైరతాబాద్ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. షెడ్డు తొలగింపు పనులు చేపట్టారు. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలుపెడతారు. మధ్యాహ్నాం లోపు నిమజ్జనం చేస్తారు. ఎల్లుండి సాయంత్రంకల్లా నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేయండి: భారీ గణపయ్య దగ్గర కోలాహలం చూశారా?
Comments
Please login to add a commentAdd a comment