సాక్షిప్రతినిధి, ఖమ్మం: కార్యాలయ కార్యకలాపాలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూములకు సంబంధించి రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. నిత్యం కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా.. అనే విషయాలను ఏరోజుకారోజు తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు వీలు కలుగుతుంది. జిల్లావ్యాప్తంగా 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలోని రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ కార్యాలయం, ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయం ఉన్నాయి.
వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయవిక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అయితే వీటిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా.. ఎవరూ మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆస్తులు అమ్మే క్రమంలో దొంగ సంతకాలు పెట్టకుండా.. నకిలీ డాక్యుమెంట్లు చూపించకుండా ఉండేందుకు.. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల సమయంలో దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు నిఘాను కట్టుదిట్టం చేసింది. కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల అక్రమాలు జరగకుండా ఉండేందుకు వీలు కలుగుతోంది.
రాష్ట్ర శాఖకు అనుసంధానం..
జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర శాఖ ఐజీ కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీనిద్వారా రాష్ట్రంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర శాఖలోని అధికారులు తెలుసుకునే వీలుంటుంది. ఏ ప్రాంతం నుంచి అయినా ఫిర్యాదులు వచ్చినట్లయితే ఆ సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర శాఖ కార్యాలయంలోనే పరిశీలించి.. చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల తీరును కూడా పరిశీలించేందుకు ఉన్నతాధికారులకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారికి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఆరోజు జరిగిన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సీసీ పుటేజీని కూడా కట్ చేసి ఆయా వ్యక్తులకు అందజేయనున్నారు.
నిత్యం నిఘా..
జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండేసి చొప్పున సీసీ కెమెరాలు, ఒక టీవీ, కంప్యూటర్‌ను రాష్ట్ర శాఖ ఏర్పాటు చేయించింది. టీసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన పుటేజీ మొత్తం ఆయా కేంద్రాలతోపాటు రాష్ట్ర ఐజీ కార్యాలయంలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే అక్కడ పుటేజీని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్న శాఖ మరో అడుగు ముందుకేసి రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు.
అలాగే క్రయ, విక్రయదారులు కేవైసీ(ఆధార్ నంబర్) ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనిద్వారా కంప్యూటర్‌లో వారి ఆధార్ నంబర్ నమోదు చేయగా.. క్రయ, విక్రయదారులకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీంతో వారు ఆ భూములు, ఆస్తులకు సంబంధించిన వారా..? కాదా..? అనే విషయాలను తెలుసుకుని రిజిస్ట్రేషన్లు పకడ్బందీగా చేసే వీలు కలుగుతుంది. కేవైసీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతి పని పారదర్శకంగా జరిగేందుకు వీలు కలిగింది.
పకడ్బందీగా నిర్వహించేందుకు..
జిల్లాలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన రాష్ట్ర శాఖ అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై నిఘా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలు కలిగింది. – అడపా రవీందర్, సబ్ రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment