సాక్షి, కృష్ణా జిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల.. ఇటీవల ఈపేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారంటూ గత ఆగష్టులో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కాలేజీ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చి.. స్టూడెంట్స్ వీడియోలు తీసి వాటిని వైరల్ చేసి విక్రయిస్తున్నారని ఆందోళన చేపట్టడంతో.. ఈ వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.
తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూమ్స్‌లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని అధికారులు తేల్చారు. స్టేట్ ఫోరెన్సిక్ లేబరేటరీస్ పరీక్ష ద్వారా ఈ విషయం నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. ఈ మేరకున జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు , కలెక్టర్ డి.కె.బాలాజీ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
కాగా ఆగష్టు 28న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గల్స్ హాస్టల్‌లోని వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చారంటూ విద్యార్ధులు ఆందోళనలు చేపట్టడం కలకలం రేపింది. గతంలోనే ఈ ఘటనపై విద్యార్థులు.. కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు… హాస్టల్‌ను పరిశీలించారు. విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్‌ను గుర్తించే పరికరంతో హాస్టల్‌లో అణువణువూ తనిఖీ చేశారు. రూము రూము తిరిగారు.
విద్యార్ధినిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, అనుమానితుల నుంచి ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. చివరికి హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలను లేవని ఎస్పీ తెలిపారు. అయితే మీడియాలో, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు రావడంతో ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా.. తాజాగా నివేదిక సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment