సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐటీ బృందాలను కూడా నియమించామని వివరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రెండు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. అదనపు సీపీ జి.సుధీర్‌బాబు, డీసీపీలు నారాయణరెడ్డి, శ్రీబాల, అదనపు డీసీపీ భాస్కర్, ఏసీపీ ఉదయ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బందోబస్తులో 2 వేల మంది..
పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించినట్లు సీపీ భగవత్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒక ఎస్‌ఐ ఇన్‌చార్జిగా ఉంటారన్నారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా విధులలో పాల్గొంటాయని చెప్పారు. 16 పోలింగ్ కేంద్రాలలో 35 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించామని, ఆయా స్టేషన్లలో బందోబస్తును మరింత పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించామని వివరించారు.
భారీగా నగదు, బంగారం స్వాధీనం..
సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసు బృందాలు 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తుంటాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు వాహన తనిఖీలలో రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5 కిలోల బంగారం, 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, పోలింగ్ రోజున అక్రమంగా మద్యం విక్రయాలు, సరఫరా చేసిన వ్యక్తులకు జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు.
సెల్ఫీలు దిగొద్దు..
పోలింగ్ కేంద్రాల ఆవరణలో సెల్‌ఫోన్లు నిషేధమని, సెల్ఫీలు దిగడంతో పాటు, ఎవరికి ఓటు వేశారో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సీపీ భగవత్ హెచ్చరించారు.
చదవండి: ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా
Comments
Please login to add a commentAdd a comment