సాక్షి, అమరావతి: పోలీసు వ్యవస్థ పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచడం లక్ష్యంగా పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పోలీస్ స్టేషన్లలోని అన్ని ముఖ్యమైన విభాగాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలను ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈమేరకు రెండు దశల్లో వాటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. మూడు నెలల్లో 600 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఏపీ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ విభాగం టెండర్లను పిలిచింది. ఆ సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించిన తర్వాత మిగతా స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది.
అక్రమ నిర్భందాలను నిరోధించేందుకు..
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో 500 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో పురుషులు, మహిళల లాకప్ రూమ్‌లలో వాటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో అక్రమ నిర్బంధాలను నిరోధించి మానవ హక్కుల పరిరక్షించడం, సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా పోలీసు సిబ్బంది ప్రవర్తిస్తున్నారా? లేదా అనేది పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తుల పట్ల ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగాగానీ, అనుకూలంగాగానీ వ్యవహరించకుండా పోలీసు అధికారులను కట్టడి చేసేందుకు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు దోహదపడుతుందని భావిస్తున్నారు.
అధునాతన సీసీ కెమెరాలు
రాష్ట్రంలోని మొత్తం 900 పోలీస్‌స్టేషన్లలో రెండు దశల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. నేరాల రేటు గణాంకాలను బట్టి మొదటి దశలో 600 స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో మిగిలిన పోలీస్ స్టేషన్లలో కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 10 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రధాన ప్రవేశద్వారం, ప్రధాన హాలు, రిసెప్షన్ రూమ్, స్టేషన్ ఆఫీసర్ రూమ్, రైటర్ రూమ్, ఆయుధాలు/సాక్ష్యాధారాల రూమ్, పురుషుల లాకప్, మహిళల లాకప్, కంప్యూటర్ రూమ్, పార్కింగ్ ఏరియాలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గతంలో లాకప్ రూమ్‌లలో ఒక్కో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన చోట ప్రస్తుతం 8 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఆడియో, వీడియో ఫుటేజీలతో పాటు రాత్రివేళల్లో కూడా స్పష్టంగా రికార్డ్ చేసేలా నైట్ విజన్ ఫీచర్‌లతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫుటేజీ కనీసం 18 నెలలపాటు స్టోరేజీలో ఉంటుంది. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. స్టేషన్లలో కెమెరాల నిర్వహణ బాధ్యత ఆ స్టేషన్ హౌస్ అధికారిదే. నిర్వహణలో ఇబ్బందులుంటే జిల్లా పర్యవేక్షక కమిటీలను సంప్రదించి సరి చేయించాలి.
చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ
Comments
Please login to add a commentAdd a comment