![AP High Court Fires On Police Department About CCTV footages](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/HIGH_COURT_OF_ANDHRA_.jpg.webp?itok=QtzmF_wg)
మేమడిగినప్పుడే సీసీ టీవీ ఫుటేజీ ఎలా మాయమైపోతోంది?
మిస్టీరియస్‌గా కనిపించకుండా పోతోందని హైకోర్టు ఆగ్రహం
పోలీసులు చెబుతున్న కారణాలు నమ్మశక్యంగా లేవు
ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ, ఎస్‌పీలు ఏం చేస్తున్నట్లు?
సర్క్యూట్ కాలిపోయిందన్న ‘సౌత్రిక’ నివేదికపై అనుమానాలు
ఆ నివేదికలోని సంతకాలు, సీలులో తేడాలున్నాయి
కాలిపోయిన సీసీ టీవీని మేమే స్వయంగా పరిశీలిస్తాం
కోతుల వల్ల ఫుటేజీ కాలిపోయిందంటే నమ్మాలా..?
ఆ పరికరాలను తమ ముందుంచాలని పల్నాడు ఎస్‌పీకి ఆదేశం
ఎస్‌హెచ్‌వోపై చర్యలు సంతృప్తికరంగా లేవన్న ధర్మాసనం
అన్ని పోలీస్‌స్టేషన్ల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని ఎస్‌పీలకు ఆదేశాలిస్తాం.. విచారణ 18కి వాయిదా
కోర్టు ఎప్పుడు సీసీటీవీ ఫుటేజీ కావాలని అడిగినా, ఆ వెంటనే అది మిస్టీరియస్‌గా మాయమైపోతోంది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు.. నిజంగా కాలిపోయిందో, ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసు? ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీలు సజావుగా పని చేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేస్తాం. లేకపోతే ప్రతి సీసీ టీవీ ఫుటేజీ మాయమవుతూనే ఉంటుంది. కోతుల వల్ల సీసీ టీవీ కాలిపోయిందంటే మేం నమ్మాలా? తప్పులను సమర్ధించుకోవద్దు. – హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులకు న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలపై ఏ మాత్రం గౌరవం ఉండటం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని తమ ముందుంచాలని ఆదేశాలు ఇచ్చినప్పుడే, ఆ సీసీ టీవీ పుటేజీ మాయమవుతోందని తెలిపింది. ఇది చాలా మిస్టీరియస్‌గా మాయమవుతోందని, పోలీసులు చెబుతున్న కారణాలు ఎంత మాత్రం నమ్మశక్యంగా లేవని చెప్పింది.
సీసీ టీవీ ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ, ఎస్‌పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీలు సజావుగా పని చేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కోతుల కారణంగా సీసీ టీవీ ఎస్‌ఎంపీఎస్‌లోని సర్క్యూట్ కాలిపోయిన కారణంగా సీసీ టీవీ ఫుటేజీని కోర్టు ముందుంచలేక పోతున్నామన్న పోలీసుల వాదనను హైకోర్టు మరోసారి తప్పు పట్టింది.
సర్క్యూట్ కాలిపోవడం చేత సీసీ టీవీ ఫుటేజీ రికవరీ చేయడం సాధ్యం కాదంటూ సౌత్రిక టెక్నాలజీస్ ఇచ్చిన నివేదికపై అనుమానాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఆ నివేదికలోని సంతకాలు, సీలు తేడాగా ఉన్నాయంది. ఈ నేపథ్యంలో కాలిపోయిన సీసీ టీవీ పరికరాలను తామే స్వయంగా పరిశీలిస్తామని తెలిపింది.
ఆ పరికరాలను తదుపరి విచారణ సమయంలో తమ ముందుంచాలని జిల్లా ఎస్‌పీని ఆదేశించింది. తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా, సీసీ టీవీ కాలిపోయిందని.. అందువల్ల ఫుటేజీ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్‌స్టేషన్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)పై జిల్లా ఎస్‌పీ తీసుకున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎస్‌పీ చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవంది. ఇంక్రిమెంట్‌లో కోత సరిపోదని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తన సోదరుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కాటారి నాగరాజును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సోదరుడి అక్రమ నిర్బంధంపై సీసీటీవీ ఫుటేజీ కోరుతూ పిటిషన్...
తన సోదరుడు కటారి గోపిరాజును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కటారు నాగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్ 3న అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 7వ తేదీనే అరెస్ట్ చేశామంటూ అబద్ధం చెబుతున్నారని, ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీకి సంబంధించిన ఫుటేజీని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలంటూ కూడా ఆయన ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
నాగరాజు పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం.. నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని పెన్ డ్రైవ్‌లో ఉంచి సంబంధిత మేజిస్ట్రేట్ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది. అయితే సీసీ టీవీ కాలిపోయిందని, అందువల్ల ఆ ఫుటేజీని ఇవ్వలేమంటూ మాచవరం పీఎస్ స్టేషన్‌హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) అఫిడవిట్ వేశారు. దీనిపై మండిపడ్డ హైకోర్టు, పోలీసులు ఏవో కుంటిసాకులు చెబుతూ ఆ ఫుటేజీలను తమ ముందుంచడం లేదని తప్పు పట్టింది. ఇలాంటి తమాషాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎస్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కోతుల వల్ల కాలిపోయింది..
తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషనర్ నిర్ణయించుకున్నారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్‌కు ఏ మైనా హాని ఉందా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణు తేజ స్పందిస్తూ, కోతుల వల్ల వైర్లలో సమస్యలు వచ్చి సర్క్యూట్ కాలిపోయిందన్నారు.
సీసీ టీవీ కెమెరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు మాచరం ఎస్‌హెచ్‌వోపై జిల్లా ఎస్‌పీ చర్యలు తీసుకున్నారని, ఏడాది పాటు ఇంక్రిమెంట్‌లో కోత విధించారని తెలిపారు. ఎస్‌ఎంపీఎస్ సర్క్యూట్ కాలిపోయిందని, ఇది బయటకు కనిపించదని, అందువల్ల ఫుటేజీని రికవరీ చేయడం సాధ్య పడలేదని వివరించారు. కోర్టు ఉత్తర్వులంటే తమకు గౌరవం ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, పోలీసులకు కోర్టు ఆదేశాలంటే ఏ మాత్రం గౌరవం లేదని వ్యాఖ్యానించింది.
కోర్టు ఎప్పుడు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వాలని అడిగినా, ఆ వెంటనే ఆ ఫుటేజీ మిస్టీరియస్‌గా మాయమైపోతోందని తెలిపింది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు.. నిజంగా కాలిపోయిందో, ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. కోతుల వల్ల సీసీ టీవీ సర్క్యూట్ కాలిపోయిందంటే మేం నమ్మలా? అంటూ ప్రశ్నించింది. తప్పులను సమర్థించుకోవద్దని వ్యాఖ్యానించింది. కాలిపోయిన సీసీ టీవీని తామే స్వయంగా చూస్తామని, అందుకు సంబంధించిన అన్ని పరకరాలను తమ ముందుంచాలని ఎస్‌పీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment