పెద్దపల్లిఅర్బన్ : జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను నిఘా నీడలోకి తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బందిని నియమించేందుకు పోలీస్‌శాఖ కార్యాచరణ షురూ చేసింది. ఓటింగ్ జరిగే సమయంలో అవరోధాలు కల్పించే వారిపై ఉక్కుపాదాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
1,526 సీసీ కెమెరాలు
జిల్లాలోని ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌కేంద్రం బయట ఎటూ వందమీటర్ల పరిధిలో జరిగే ప్రతీ వి షయాన్ని రికార్డు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 1,526 సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తికానున్నాయి.
196 సమస్యాత్మక కేంద్రాలు
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 763 పోలింగ్‌కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 196 సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలను అధికారులు గుర్తించారు. రామగుండం 31, మంథని 111, పెద్దపల్లిలో 54 సమస్మాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాలన్నీ పూర్తిగా సీసీ కెమెరాల నీడలో ఉండనున్నాయి. మామూలు కేంద్రాల వద్ద ఇరువైపులా మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేయనుండగా సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం వీలైనన్నీ ఎక్కువ కెమెరాలను బిగిస్తున్నారు.
కేంద్రాల వద్ద ప్రచారం నిషేధం
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయడం నిషేధమని పోలీసులు ప్రకటించారు. పార్టీల నాయకులు జెండాలు, కరపత్రాలు, బ్యాలెట్‌పేపర్లు, పోలింగ్ చీటీలు, కండవాలు ధరించి ప్రచారం చేస్తే సీసీ కెమెరాల ఆధారంగా సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రతీ చర్యను రికార్డు చేయనున్నట్లు పేర్కొంటున్నారు.
గొడవలు చేసేవారిపై ఉక్కుపాదం
పోలింగ్ సందర్భంగా గొడవలు సృష్టించే వారిని గుర్తించేందుకు, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత నిర్వహణను ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులకు అదనపు బాధ్యతలు
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల బాధ్యతను స్థానిక పోలీస్‌స్టేషన్ ఎస్సైలకు అప్పగించారు. వాటిని బిగించడం మొదలు పనితీరును పర్యవేక్షించే బాధ్యతలను సైతం వారికే అప్పగించారు. దీంతో పోలీసు అధికారులకు అదనపు బాధ్యతలు పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment