యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా పెద్ద సంఖ్యలో వీఐపీలు పాల్గొంటుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట పట్టణం, రాయగిరి నుంచి వచ్చే రహదారి, చుట్టుపక్కల ప్రాంతాలు, రింగ్‌రోడ్డు, కొండపైన కలిపి సుమారు మూడు వేల మంది పోలీసు సిబ్బంది పహరా కాస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
సివిల్ పోలీసులతోపాటు ట్రాఫిక్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఐటీ, ఇంటెలిజెన్స్, ఎస్‌బీ, షీటీం విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. బాంబ్, డాగ్ స్వా్కడ్ బృందాలతో ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇక యాదగిరిగుట్ట పట్టణం, యాదాద్రి కొండ, వీఐపీలు పర్యటించే ప్రాంతాల్లో కలిపి 442 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో వెబ్ కాస్టింగ్ వాహనంతో పరిశీలన జరుపుతున్నారు.
3 గంటలదాకా ‘గుట్ట’బయటే..
యాదాద్రీశుడి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాదాద్రికి వచ్చే వాహనాల విషయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
♦సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల వాహనాలను యాదగిరిగుట్టకు సమీపంలోని వడాయిగూడెం వద్ద నిలపాలి.
♦కీసర, సిద్దిపేట, గజ్వేల్, తుర్కపల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను మల్లాపురం వద్ద ఆపేస్తారు.
♦రాజాపేట వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని స్పెక్ట్రా వెంచర్‌లో నిలపాలి.
♦వరంగల్, జనగాం, ఆలేరు నుంచి వచ్చే భక్తుల వాహనాలను వంగపల్లి సమీపంలో నిలిపివేస్తారు. ఈ వాహనాలన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల తర్వాతే యాదగిరిగుట్ట పట్టణంలోకి అనుమతిస్తారు.
పూర్తిస్థాయిలో భద్రత
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మేరకు పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశాం. దర్శనాల కోసం భక్తులు మధ్యాహ్నం 3గంటల తర్వాతే రావాలి. ప్రతి భక్తుడు క్యూ కాంప్లెక్స్ వద్ద జియో ట్యాగింగ్ చేసుకోవాలి. తర్వాత క్యూకాంప్లెక్స్‌లో నుంచి తూర్పు రాజగోపురం ద్వారా దర్శనాలకు వెళ్లవచ్చు. అనంతరం ప్రసాదాలు కొనుగోలు చేసి బస్సులో కొండ దిగాలి.
–మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్
వీఐపీలు, ఉద్యోగుల వాహనాల పార్కింగ్ ఇలా..
♦వీఐపీల వాహనాలను టెంపుల్ సిటీకి వెళ్లే మార్గంలో ఉన్న మున్నూరుకాపు సత్రం వద్ద నిలపాల్సి ఉంటుంది.
♦యాదాద్రి క్షేత్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, మీడియా, ఆచార్యుల వాహనాలను పాత గోశాలలోని సత్యనారాయణస్వామి వ్రత మండపం వద్ద నిలపాలి.
♦ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలను తులసీ కాటేజీలో పార్కింగ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment