Tight security arrangements
-
Ayodhya Ram mandir: అయోధ్యలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అయోధ్య: బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం కోసం అయోధ్యకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు విచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా రంగం, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఈ నేపథ్యంలో నగరమంతటా పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ప్రాణప్రతిష్ట వేదిక వద్ద, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో మోహరించారు. ఆలయం చుట్టూ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు బిగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆయోధ్యకు వచ్చే అన్ని ప్రధాన రహదారులను గ్రీన్ కారిడర్లుగా మార్చారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. ఫైజాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాంటీ డ్రోన్ టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నామని చెప్పారు. -
కశ్మీర్లో జీ–20 సన్నాహకం షురూ
శ్రీనగర్: పాకిస్తాన్ పెడబొబ్బలను, చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జమ్మూ కశ్మీర్లో జీ–20 సన్నాహక సదస్సు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం మొదలైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చైనా మినహా అన్ని సభ్య దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. పర్యాటక రంగం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. వారికి సంప్రదాయ రీతిలో ఘనస్వాగతం లభించింది. తొలి రోజు ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు సినీ టూరిజం’ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ప్రతినిధులంతా చారిత్రక దాల్ సరస్సులో బోట్ షికారు చేస్తూ కశ్మీర్ అందాలను ఆస్వాదించారు. కేంద్రం త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర సాంస్కృతి పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి కశ్మీర్లో అద్భుతమైన అవకాశాలున్నాయని మీడియా తో చెప్పారు. పర్యాటకాభివృద్ధికి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా ప్రపంచ స్థాయికి చేరుకోలేమన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హర్తాళ్ పిలుపులు గత చరిత్ర కశ్మీర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, మునుపటి లాగా బంద్ పిలుపులకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘గతంలో కశ్మీర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాక్ నుంచి వచ్చిన పిలుపుతో దుకాణాలు మూతబడేవి. ఇప్పుడు మాత్రం హర్తాళ్ చేపట్టాలంటూ ఎవరు పిలిపిచ్చినా పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే రెండు తరాలు నష్టపోయిన విషయం ప్రజలు తెలుసుకున్నారు. అభివృద్ధి బాటన ముందుకు సాగాలనుకుంటున్నారు’’ అని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధికి కశ్మీర్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. -
భద్రత మధ్య జోడో యాత్ర
సాంబా (జమ్మూకశ్మీర్): జమ్ములో జంటపేలుళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్రకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆదివారం ఉదయం కథువా నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మధ్యాహ్నానికి సాంబా జిల్లాలోని చక్ నానక్‌కు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారమే రాహుల్ పాదయాత్ర అత్యంత ఉత్సాహభరితంగా సాగుతోంది.సోమవారం మధ్యాహ్నానికి రాహుల్ గాంధీ జమ్ము చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ చెప్పారు. రాహుల్ యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందన్న ఆయన ఈ యాత్రతో బీజేపీ వెన్నులో వణుకు పుట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే రాహుల్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. విద్వేషాలు సృష్టిస్తున్నారు: రాజ్‌నాథ్ రాహుల్ గాంధీ అధికారం కోసం ప్రజల్లో విద్వేషాలను సృష్టిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. రాహుల్ వల్ల అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట మసకబారుతోందని విమర్శించారు. ఆదివారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ప్రజాభిమానం, నమ్మకం పొందడం ద్వారానే అధికారం లభిస్తుందని ఆయన అన్నారు. -
జి–20 వర్కింగ్ గ్రూప్ భేటీకి పటిష్ట భద్రత
సాక్షి, హైదరాబాద్: ఈనెల 28 నుంచి జూన్ 17 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న జి–20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు తెలంగాణ పోలీస్‌శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేస్తోంది. ఈ సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జి–20 సెక్యూరిటీ కోఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. డీజీపీ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో సీనియర్ పోలీస్ అధికారులతోపా టు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్, ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ తదితర భద్రతా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, జి–20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూ పు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో 6 సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. వీటిలో జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా, మార్చ్ 6,7 తేదీల్లో, ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో, జూన్ 7,8,9 తేదీల్లో, జూన్ 15,16 తేదీల్లో జూన్ 17న వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. సమన్వయం ఎంతో ముఖ్యం.... జీ–20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సజావుగా, భద్రతాపరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ సూచించారు. సమావేశాలకు హాజ రయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని, సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని పంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్‌కుమార్ జైన్, స్వాతిలక్రా, విజయకుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, హోంశాఖ ఎస్ఐబీ డిడి సంబల్ దేవ్, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సీఎస్ఓ భారత్ కందార్, డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఇందు భూషణ్ లెంక, ఎన్ఎస్జీ కల్నల్ అలోక్ బిస్త్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి కె.నాగయ్య తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
మూడు వేల మందితో బందోబస్తు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా పెద్ద సంఖ్యలో వీఐపీలు పాల్గొంటుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట పట్టణం, రాయగిరి నుంచి వచ్చే రహదారి, చుట్టుపక్కల ప్రాంతాలు, రింగ్‌రోడ్డు, కొండపైన కలిపి సుమారు మూడు వేల మంది పోలీసు సిబ్బంది పహరా కాస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సివిల్ పోలీసులతోపాటు ట్రాఫిక్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఐటీ, ఇంటెలిజెన్స్, ఎస్బీ, షీటీం విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. బాంబ్, డాగ్ స్వా్కడ్ బృందాలతో ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇక యాదగిరిగుట్ట పట్టణం, యాదాద్రి కొండ, వీఐపీలు పర్యటించే ప్రాంతాల్లో కలిపి 442 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో వెబ్ కాస్టింగ్ వాహనంతో పరిశీలన జరుపుతున్నారు. 3 గంటలదాకా ‘గుట్ట’బయటే.. యాదాద్రీశుడి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాదాద్రికి వచ్చే వాహనాల విషయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ♦సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల వాహనాలను యాదగిరిగుట్టకు సమీపంలోని వడాయిగూడెం వద్ద నిలపాలి. ♦కీసర, సిద్దిపేట, గజ్వేల్, తుర్కపల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను మల్లాపురం వద్ద ఆపేస్తారు. ♦రాజాపేట వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని స్పెక్ట్రా వెంచర్లో నిలపాలి. ♦వరంగల్, జనగాం, ఆలేరు నుంచి వచ్చే భక్తుల వాహనాలను వంగపల్లి సమీపంలో నిలిపివేస్తారు. ఈ వాహనాలన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల తర్వాతే యాదగిరిగుట్ట పట్టణంలోకి అనుమతిస్తారు. పూర్తిస్థాయిలో భద్రత యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మేరకు పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశాం. దర్శనాల కోసం భక్తులు మధ్యాహ్నం 3గంటల తర్వాతే రావాలి. ప్రతి భక్తుడు క్యూ కాంప్లెక్స్ వద్ద జియో ట్యాగింగ్ చేసుకోవాలి. తర్వాత క్యూకాంప్లెక్స్‌లో నుంచి తూర్పు రాజగోపురం ద్వారా దర్శనాలకు వెళ్లవచ్చు. అనంతరం ప్రసాదాలు కొనుగోలు చేసి బస్సులో కొండ దిగాలి. –మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్ వీఐపీలు, ఉద్యోగుల వాహనాల పార్కింగ్ ఇలా.. ♦వీఐపీల వాహనాలను టెంపుల్ సిటీకి వెళ్లే మార్గంలో ఉన్న మున్నూరుకాపు సత్రం వద్ద నిలపాల్సి ఉంటుంది. ♦యాదాద్రి క్షేత్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, మీడియా, ఆచార్యుల వాహనాలను పాత గోశాలలోని సత్యనారాయణస్వామి వ్రత మండపం వద్ద నిలపాలి. ♦ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలను తులసీ కాటేజీలో పార్కింగ్ చేయాలి. -
అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత
శ్రీనగర్/జమ్మూ: పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది తొలి బ్యాచ్‌గా 2,234 మంది భక్తులు ఆదివారం గట్టి భద్రత మధ్య జమ్మూకు చేరుకున్నారు. 2017లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసినందువల్ల ఇప్పుడు బహుళ అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రానికి వచ్చిన 300 అదనపు కంపెనీల భద్రతా దళాలనే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. యాత్ర సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ యాత్రకు రావడానికి దేశవ్యాప్తంగా ఒకటిన్నర లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. 46 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని 36 కిలో మీటర్ల పొడవైన పహల్గామ్ మార్గం, గండేర్బల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల పొడవైన బల్తాల్ మార్గాల్లో యాత్ర సాగుతుంది. 93 వాహనాలతో కూడిన తొలి వాహన శ్రేణిని గవర్నర్ సలహాదారు కేకే శర్మ ఆదివారం జమ్మూలోని భాగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. -
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి కట్టుదిట్టమైన భద్రత
-
ఎన్నికలకు పటిష్ట భద్రత
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. మున్సిపల్, ఎంపీటీసీ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 42 లక్షలకు పైగా ఓటర్లు, 4,372 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 350 వరకు ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. ఎన్నికల విధుల్లో 8,658 మంది సివిల్ పోలీసులతో పాటు 30 కంపెనీల ఆర్మ్డ్ రిజర్వు బలగాలు పాల్గొంటాయని తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని ఠాణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఇప్పటి వరకు రూ. 5.90 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో 2200 లెసైన్‌సడ్ ఆయుధాలున్నాయని, ఇప్పటివరకు 92 శాతం మంది డిపాజిట్ చేశారని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 47 కేసులు, ఎక్సైజ్ కేసులు 93, సాధారణ కేసులు 322 నమోదు చేసి 1407 మందిని బైండోవర్ చేసినట్లు కమిషనర్ చెప్పారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రచారంలో వినియోగించే వాహనాలకు, మైకులకు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. అభ్యర్థులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని సూచించా రు. ప్రార్థనా స్థలాల వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిషేధిం చినట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేపట్టరాదని, డీజేలు వాడరాదని సీవీ ఆనంద్ చెప్పారు. సైబరాబాద్ పరిధిలో వచ్చే నెల 13న పలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నందున పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. మంచాల/యాచారం: సైబరాబాద్ సీపీ సీవీ. అనంద్ శుక్రవారం సాయంత్రం మంచాల, యాచారం ఠాణాల ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ సందర్భంగా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఠాణాల్లో ఆయన పలు రికార్డులను పరిశీలించారు. సీపీ ఆనంద్‌తో పాటు ఏసీపీ సురేందర్‌రెడ్డి, సీఐలు అశోక్ కుమార్, జగదీశ్వర్, ఎస్సైలు ఉన్నారు.