కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలు అమరుస్తున్నారు. కనిపిస్తే చాలు అవి ముఖాన్నే కాదు కళ్లనూ ఫొటో తీసి, ఐరిస్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నాయి. అంతేకాదు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు పంపి నేరగాళ్ల ఆటకట్టించడంలోనూ దోహదపడుతున్నాయి. ఫేస్ డిటెక్నినేషన్ అని పిలవబడే ఈ కెమెరాలను ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వద్ద రెండు, ట్రామాకేర్, ప్రధాన ద్వారం, టీబీ సెంటర్, సూపర్‌స్పెషాలిటీ విభాగాలు, క్యాన్సర్ విభాగం, పీడియాట్రిక్, మాతాశిశు భవనాలు, పేయింగ్‌బ్లాక్, మెడిసిన్ విభాగాలు, మార్చురీ, ప్రాంతీయ కంటి ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మాట్రిక్స్ సర్విలెన్స్ అనే సంస్థ 899 కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఆసుపత్రులు, మసీదులు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, రైల్వేస్టేషన్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో వీటిని అమరుస్తున్నారు. ఒక్క కర్నూలు నగరంలోనే 200లకు పైగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతిని«ధి ఎల్లరాజు తెలిపారు.
కనిపిస్తే కళ్లను ఫొటో తీసి పంపిస్తుంది
ఈ అత్యాధునిక కెమెరాలకు ఎదురుగా ఎవ్వరైనా వెళితే వెంటనే వారి ఫొటోలను ఏకకాలంలో తీస్తుంది. అంతేకాదు ప్రధానంగా కళ్లను, ఐరిస్‌ను ఫోకస్ చేసి ఫొటో తీసి, దానిని ఆధార్‌తో అనుసంధానం చేస్తుంది. వెంటనే సదరు వ్యక్తి వివరాలు పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూంకు చేరుకుంటాయి. అనుమానిత వ్యక్తులు ఎవ్వరైనా ఇందులో ఉంటే వెంటనే పోలీసులకు సిగ్నల్ వెళ్తుంది. ఈ మేరకు నేరాలను కట్టడి చేసేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇవే గాక సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో ఎవ్వరైనా నిబంధనలకు వ్యతిరేకంగా రాంగ్ రూట్‌లో వెళ్లినా, రెడ్ సిగ్నల్స్ పడ్డప్పుడు వెళ్లినా వెంటనే ఫొటో తీసి పోలీసులకు పంపిస్తుంది. వారు సదరు వాహనదారుడికి జరిమానాకు సంబంధించిన చలానా పంపించేందుకు అవకాశం ఈ కెమెరాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment