ఠాణాలకు ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాలతో అనుసంధానం
24 గంటల కంట్రోల్ రూంతోపాటు బారికేడ్ల విధానం
వైద్య సిబ్బందికి భద్రతపై మంత్రి దామోదర కీలక నిర్ణయం
ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగా రోగుల బంధువులకు విజిటర్స్ పాస్
ఉత్తర్వులు జారీ చేసిన వైద్య, ఆరోగ్యశాఖ
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణ యం తీసుకోగా, వైద్య,ఆరోగ్యశాఖ గురు వారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను స్థానిక పోలీస్‌స్టేషన్లకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. ఆయా సీసీ కెమెరాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.
అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై నిఘా పెడతారు. 24 గంటల కంట్రోల్ రూమ్‌తోపాటు బారికేడ్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఆస్పత్రి ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, సీసీ కెమెరాలతో చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రజారోగ్య విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యవిద్య విభాగం పరిధిలోని బోధనాస్పత్రుల్లో అన్నింటిలో ఈ కమిటీలు ఏర్పడనున్నాయి.
ఈ కమిటీలు ఆస్పత్రుల భద్రత పెంపుతోపాటు వైద్య సిబ్బంది భద్రతకు కీలకంగా ఉంటాయి. ఆస్పత్రుల్లో కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు, డాక్టర్లు, ఇతరుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకొని దాడులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.
కమిటీ ఏర్పాటు ఇలా...
ఆస్పత్రి సూపరింటెండెంట్ చైర్మన్ / చైర్‌పర్స న్‌గా, సేఫ్టీ ఆఫీసర్ (ఆర్‌ఎంవో) కన్వీనర్‌గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజినీర్, సెక్యూరిటీ స్టాఫ్ ఇన్‌చార్జ్, ఐఎంఏ మెంబరు, సీనియర్ డాక్టర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ అలైడ్ హెల్త్‌స్టాఫ్ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు రెండు వేర్వేరుగా పనిచేస్తాయి. ఈ రెండు కమిటీలకు చైర్మన్‌గా ఒకరే వ్యవహరిస్తారు.
కమిటీలు ఏం చేస్తాయంటే?
ప్రతిరోజూ ఆస్పత్రులను ఆడిట్ చేస్తాయి. మూడు షిప్టులలోని భద్రతపై ఆరా తీస్తాయి. ఆస్పత్రి బయట, వార్డులలోనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల తరహాలోనే రోగుల సహాయకులు, బంధువులకు విజిటర్ పాస్ వ్యవస్థను అందుబాటులో తీసుకొస్తారు. డాక్టర్ల డ్యూటీ రూమ్స్, రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ వద్ద అదనంగా లైటింగ్, డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికీ రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటారు.
ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల పనితీరును చెక్ చేస్తూనే, వాటి సంఖ్య మరింత పెంచుతారు. సీసీ కెమెరాల ఫుటేజ్ స్టోరేజ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్, ఫైర్‌సేఫ్టీ, మెడికల్ ఎక్విప్‌మెంట్, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌పై సమీక్షిస్తారు. చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుతూ, ఆస్పత్రుల సిబ్బంది భద్రతకు సెక్యూరిటీ సిబ్బందికి డ్రిల్, ట్రైనింగ్ ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment