
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది.
ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది.