సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం కీలక విషయాలు వెల్లడించారు. గత కొంత కాలంగా రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13,296 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఆలయాల భద్రత విషయంలో సీసీ కెమెరాలు, మ్యాపింగ్ కీలకం కావటంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆలయాల వద్ద పోలీసు భద్రతతోపాటు టెంపుల్ కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని కొన్ని దుష్ట శక్తులు ఆలయాలపై దాడులను ప్రభుత్వానికి, పోలీసులకు ఆపాదించి.. దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని డీజీపీ మండిపడ్డారు.
ఇక ఇప్పటివరకు దాడులకు సంబంధించి నమోదైన 9 కేసుల్లో రాజకీయ పార్టీల నేతల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఆయన మీడియాకు తెలిపారు. ఇందులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. దాడి ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి పాల్పడుతున్న కొందరిపై కన్నేసి ఉంచామని, త్వరలో వారపై చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడే సాహసం ఎవరూ చేయకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడుల నిరోధానికి మత సామరస్య కమిటీలు సమన్వయం చేస్తున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment