బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం | Baby Kidnapped In Nizamabad | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం

Published Sat, May 25 2019 11:06 AM | Last Updated on Sat, May 25 2019 11:06 AM

Baby Kidnapped In Nizamabad - Sakshi

బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ

కామారెడ్డి క్రైం: ఆటోలో పడుకోబెట్టిన రెండేళ్ళ బాలుడు అకస్మాత్తుగా కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని 16 గంటల్లోనే చేదించారు. కిడ్నాప్‌ చేసిన మహిళను అదుపులోకి తీసుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌పాల్, కిరణ్‌పాల్‌ దంపతులు కొంత కాలం గా కామారెడ్డిలో నివాసం ఉంటూ వీక్లీ మార్కెట్‌ లోని రాజరాజేశ్వరీ ఆలయం వద్ద జ్యూస్‌ బండి నడిపిస్తున్నారు.

వారికి హర్షిత్‌పాల్‌ అనే రెండేళ్ళ కుమారుడు ఉన్నాడు. రోజూ మాదిరిగానే గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జ్యూస్‌ బండి వద్ద పనులు చేసుకుంటుండగా హర్షిత్‌పాల్‌ నిద్రపోయాడు. తల్లిదండ్రులు బాలుడిని జ్యూస్‌ బండి వెనుక పార్కింగ్‌ చేసి ఉంచిన ఓ ఆటోలో పడుకోబెట్టారు. కొద్ది సేపటి తర్వాత చూస్తే బాలుడు కన్పించలేదు. చుట్టుపక్కల గాలించినా కన్పించకపోవడంతో ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పట్టణ ఎస్‌హెచ్‌ఓ రామకృష్ణ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు పట్టణంలో రాత్రంతా విస్తృతంగా గాలించారు. వీక్లీ మార్కెట్‌ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

పట్టించిన మూడో కన్ను..  
కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోశించాయి. తల్లిదండ్రులు వ్యాపారం పనులు చేసుకుంటూ ఉండగా ఓ మహిళ బాలుడిని ఎత్తుకెళ్లినట్లు సీసీ పుటేజీల్లో కన్పించింది. సదరు మహిళ అతడిని ఎటువైపు తీసుకుని వెళ్లింది. మహిళా కిడ్నాపర్‌ ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, షాపింగ్‌ మాల్స్‌ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించి జరిపారు. శుక్రవారం ఉదయం ఓ కల్లు దుకాణం వద్ద అనుమానాస్పదంగా ఓ మహిళ ఉందనే సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మహిళా కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. 

సొమ్ము చేసుకునేందుకే..  
బాలుడి కిడ్నాప్‌ ఉదంతం వెలుగులోకి రావడం శుక్రవారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. మహిళా కిడ్నాపర్‌ను పట్టణంలోని బతుకమ్మకుంట కాలనీకి చెందిన దండ్ల గంగమ్మగా గుర్తించారు. ఆమె భర్తతో విడిపోయి కొంతకాలంగా ఒంటరిగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. బాలు డిని ఎక్కడైనా విక్రయించి సొమ్ముచేసుకోవాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్‌నకు ఒడిగట్టిందన్నారు. సదరు మహిళను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. కేసు ఛేదనలో 16 గంటలపాటు శ్రమించి బాలుడి ఆచూకీ కనుగొన్న ఎస్‌హెచ్‌ఓ రామకృష్ణ, ఎస్‌ఐ గోవింద్, ఏఎస్‌ఐ నరేందర్, సిబ్బంది రవి, సాయిబాబా, నీలేష్, పవన్, శ్రావన్, రాములును అభినందించారు. అంతేగాకుండా కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోశించాయన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement