మాడు మారుతి(ఫైల్)
పెద్దకొడప్‌గల్(జుక్కల్): తన అన్న పెళ్లి కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లాడు ఓ యువకుడు. రెండు రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో కొడుకు చావు బాజా మోగించడం ఆ కుటుంబానికి తీవ్ర విషాదంలో నెట్టింది. పెద్ద కొడప్‌గల్‌కు చెందిన మాడుమారుతి(24) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పెద్దకొడప్‌గల్‌కు చెందిన కోక బాలయ్య శకుంతలకు ముగ్గురు కుమారులు. తన పెద్ద కుమారుడి పెళ్లి కుదరడంతో ఈ నెల 24న పెళ్లి చేసేందుకు నిశ్చయించారు.
పెళ్లి హడావుడిలో అన్న పెళ్లి పనుల కోసం హైదరాబాద్‌లో పనిచేస్తున్న మారుతి శుక్రవారం సొంతూరుకు వచ్చాడు. పెళ్లి పత్రికలు పంచుతూ శనివారం రాత్రి మండలంలోని బేగంపూర్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పెద్దకొడప్‌గల్ పిట్లం జాతీయ రహదారిపై వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. మారుతికి ఛాతిపై తలకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐస్సై నవీన్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం తరలించారు.
కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం
రెండు రోజుల్లో పచ్చటి పందిరిలో బంధువులు, పిల్లాపాపలు, పెళ్లి బజా మోగాల్సిన ఇంట్లో మారుతి మృతితో ఆ ఇల్లు మూగ బోయింది. ఆడబిడ్డలతో సంతోషంతో ఉన్న ఇంట్లో చావు వార్త వినడంతో కుటుంబ సభ్యుల రోదన చూపరులకు కంట తడి పెట్టించింది. కొన్ని గంటల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు శవమై తిరిగి వచ్చాడని తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు.
పెళ్లి చూడాల్సిన వయస్సులో చావు చూస్తున్నామని మారుతి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మృతుడి ఇంటి వద్ద బంధువులు, గ్రామస్తులు విచార వదంలో ఉండిపోయారు. అయ్యో బిడ్డా.. వెళ్లి పోతివా.. అంటూ బాధపడ్డారు. మారుతి మృతి తో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment