విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులో పోస్టుమార్టం.. హనుమకొండ జిల్లాలో ఘటన
ఐనవోలు/వర్ధన్నపేట: వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా పిడుగుపడి యువతీ యువకుడు మృతి చెందారు. కాగా, విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులోనే శవపరీక్ష చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దౌతుబాజి శ్రీనివాస్, దౌతుబాజి విజయ, రాధాబాయి, ఇందిర, కోమల, శ్రావణి, రాజు ఆదివారం పొలాల్లో పనులు చేస్తున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో అందరూ సమీపంలోని రేకుల షెడ్డులోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. పిడుగు ధాటికి షెడ్డులో ఉన్న ఏడుగురూ కింద పడిపోయారు.
తేరుకుని లేచి చూడగా ఇందిర కుమార్తె శ్రావణి (17), కూకట్ల కోమల కుమారుడు రాజు (24) మృతిచెంది ఉన్నారు. ఈ ఘటనలో కోమలతోపాటు మిగతా నలుగురు అస్వస్థతకు గురయ్యారు. జఫర్‌గఢ్ ఎస్సై రాంచరణ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
టార్చ్‌లైట్ వెలుతురులో శవపరీక్ష
ఇదిలా ఉండగా శ్రావణి, రాజు మృతదేహాలకు వర్ధన్నపేట శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదిలో విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులోనే శవపరీక్ష చేశారు. వెంకటాపురం గ్రామం జఫర్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండడంతో వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకురాగా శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదికి తరలించారు.
ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వైద్యులు అక్కడికి చేరేసరికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో టార్చ్‌లైట్ల సహాయంతో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు.
అక్కడ విద్యుత్ మీటరు లేకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతుంటే.. పోస్టుమార్టం గది నిర్మించి ఇచ్చాం, మిగతా విషయాలకు ఆస్పత్రి వారిదే బాధ్యత అని మున్సిపల్ శాఖ చేతులు దులిపేసుకున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment