నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో ఇద్దరు యువకులు దారుణహత్యకు గురయ్యారు. రెండు రోజుల కింద జరిగిన హత్యలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు యువకులను అధికంగా మద్యం తాగాక కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. చంపిన తరువాత నిందితులు మారణాయుధాలు, మద్యం సీసాలు ఏమి లేకుండా జాగ్రత్తపడ్డారు. వీరిని హత్య చేసి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు.
మూడో టౌన్ ఎస్‌ఐ సంతోష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని ఆజ్రి గ్రామం కుదన్‌పూర్ తాలుకా, ఉడిపి జిల్లాకు చెందిన శ్రీకాంత్‌శెట్టి గత కొంత కాలంగా నిజామాబాద్ నగరంలో టీస్టాల్‌ను నిర్వహిస్తున్నాడు. కంఠేశ్వర్‌లో ఆరు నెలల కింద టీస్టాల్ నిర్వహిస్తూ ఇదే ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. ఇతడితోపాటు మరో ముగ్గురు పనిచేసేవారు నిత్యం అద్దె ఇంటికి వస్తూ వెళ్తుండేవారని పోలీసులు తెలిపారు. శ్రీకాంత్‌శెట్టి మొదట వైష్ణవి హోటల్ వద్ద టీస్టాల్ నిర్వహించేవాడు. ఆ హోటల్ క్యాషియర్ సురేందర్‌రెడ్డి పరిచయంతో ఆయన సూచన మేరకు కంఠేశ్వర్‌లో టీ కార్నర్ వద్ద ఆర్నెళ్ల కింద టీస్టాల్‌ను ప్రారంభించాడు.
అంతపట్టని విషయం..
సురేందర్‌రెడ్డికి కంఠేశ్వర్‌లో కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగి నాగభూషణం పరిచయం ఉంది. ఇతడి ఇల్లును సురేందర్‌రెడ్డి శ్రీకాంత్‌శెట్టికి అద్దెకు ఇప్పించాడు. దీంతో ఆర్నెళ్లుగా అదే ఇంటిలో ఉంటున్నాడు. రెండు రోజుల కింద రాత్రి శ్రీకాంత్‌శెట్టిని(32) మరో యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు. ఆ సమయంలో ఇంటి యజమాని నాగభూషణం అందుబాటులో లేరు. గురువారం రాత్రి నాగభూషణం తన ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం నీటి ట్యాంకును పరిశీలించేందుకు డాబాపైకి వెళుతుండగా కిటికీలో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించాడు. మృతదేహాలు కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయి. శ్రీకాంత్‌శెట్టి ఉంటున్న కిటీకి వద్దకు వెళ్లి గదిని చూడగా ఇద్దరు యువకులు చనిపోయినట్లు గుర్తించాడు. వెంటనే డయల్ 100కి ఫిర్యాదు చేశాడు.
సంఘటన స్థలానికి మూడోటౌన్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ చేరుకొని ఇంటి తాళం పగులగొట్టి హత్యకు గురైన యువకులను గుర్తించారు. ఒకరు శ్రీకాంత్‌శెట్టి కాగా మరో యువకుడు జుక్కల్ మండలం ఎడ్గి గ్రామానికి చెందిన సాయిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు మరో మృతుడు సాయి అనే యువకుడు అయి ఉండొచ్చు అని పేర్కొంటున్నారు. అయితే నిర్ధారణకు మాత్రం రాలేదు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ రాగా హత్య జరిగిన ఇంటి చుట్టు తిరిగింది. ఎలాంటి అనవాలు లభించలేదు.
సంఘటన స్థలానికి సీపీ కార్తికేయ, శిక్షణ ఐపీఎస్ గౌస్ అలం, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, రూరల్ సీఐ, ఎస్‌ఐలు వచ్చి విచారించారు. హత్యకు గురైన శ్రీకాంత్‌శెట్టి తమ్ముడు ప్రవీన్‌శెట్టికి పోలీసులు సమాచారం అందించారు. ఈ హత్యలు ఎందుకు చేశారు, డబ్బుల విషయంలోనైన, వ్యాపార విషయంలోనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరిని ఒకేసారి హత్య చేయడంలో ఆంతర్యమేంటి, ఎంత మంది ఉన్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు వీరితోపాటు ఉన్న మరో ఇద్దరు యువకులు కనిపించకుండా పోవడంతో వారిని పట్టుకునే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment