
బాన్సువాడ శివారులో జేసీబీతో తరలిస్తున్న మొరం
బాన్సువాడ టౌన్: పుడమి తల్లి గుండెలపై ఆధునిక యంత్రాలు చిల్లులు వేస్తున్నాయి. తద్వారా ప్రకృతి వనరులు అక్రమార్కుల చేతుల్లో కరిగిపోతున్నాయి. విలువైన గుట్టలు, మట్టి కుప్ప లు మాయమవుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ స్థలంలోనే మొరం తవ్వేస్తున్నారు. బాన్సువాడ పట్టణానికి కూత వేటు దూరంలో వాసుదేవ్‌పల్లి శివారు, బోర్లం, బుడ్మి తదితర గ్రామాల్లో ఈ దందా కొనసాగుతోన్న పట్టించుకునేనాథుడే కరువయ్యారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తుంటే రెవెన్యూ అధికారులు మామూలుగా వ్యవరిస్తున్నారు. గ్రానైట్, కంకర క్వారీలకు మాదిరిగానే మొరం తవ్వకాలకు కూడా గనులశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మంజూరు చేస్తారు. ప్రభుత్వ భూములైనా పట్టా భూములోనైనా నిబంధనలకు అనుగుణంగా అనుమతులుంటాయి.
అభివృద్ధి పనుల పేరిట...
రహదారులు, ఇళ్ల నిర్మాణాలు, చెరువుల కట్టలకు, మట్టి పనులు చేపట్టడానికి మొరం అవసరం. వీటి పేరు మీద ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను తవ్వేస్తున్నారు. ఇలా తవ్విన గుంతో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయి.
ప్రమాదకరంగా గుంతలు...
మొరం తవ్వడంతో ఏర్పడిన గుంతలు లోతుగా ఉన్నాయి. ప్రమాదవశత్తు అందులో పడితే ప్రాణాలు పోయే ప్రమాదముంది. నిత్యం 150 ట్రిప్పుల మొరం తరలిస్తున్నారు. ఒక్క టిప్పర్ మొరం రూ. 1200 ఉంది. ఈ లెక్కన రోజుకు రూ. లక్షా 80 వేల వ్యాపారం జరుగుతోంది.
అధికారుల కనుసన్నల్లోనే...
మొరం విక్రయాలకు అలవాటు పడిన పలువురు చోటామోటా కాంట్రాక్టర్లే కాకుండా నాయకులు ఇదే పనిలో కొనసాగుతున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ఖనిజ సంపద కాపాడాల్సిన వీరి కనుసన్నల్లోనే మొరం అక్రమార్కుల పరమవుతోంది.
డిమాండ్ పెరగడంతో...
బాన్సువాడ పట్టణం నుంచి వెళ్లే జాతీయ రహదారి విస్తరణతోపాటు ఇతర పనులు కూడా ఇటీవలే ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. వాటి నిర్మాణాలకు తగ్గట్టు కాంట్రాక్టర్లు అనుమతులు తీసుకోకుండానే ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి...
ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఎక్కడ తవ్వకాలు జరిపినా హెక్టారుకు(2.20ఎకరాలు) రూ. 50 వేలు, గనుల శాఖకు మరో రూ.50 వేలు తపాలశాఖలో రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాలి. విక్రయాలపై అదనంగా 2.25 శాతం పన్ను చెల్లించాలి. ఇలా చెల్లించకపోవడంతో రూ. లక్షల్లో ప్రజాధనం అక్రమార్కుల పరమవుతోంది. బహిరంగా మార్కెట్‌లో టిప్పర్‌కు రూ. 1200 నుంచి రూ. 1500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
అనుమతులు తీసుకోవాలిలా..
ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొరం తవ్వకాలు చేపట్టినా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. తవ్వకాలు చేపట్టేందుకు ముందుగా గనులు, భూగర్భశాఖ జిల్లా ఆఫీస్‌లో అను మతిపొందాలి.ఇవిరెండురకాలుగాఉన్నాయి.
స్థానికంగా ఇళ్ల నిర్మాణాలకు తక్కువ మొత్తంలో అవరమున్న తవ్వకాలను తహసీల్దార్ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తీసుకోవాలి. అనంతరం మీ సేవా కేంద్రాల ద్వారా గనులు, భూగర్భశాఖకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎక్కువ మొత్తంలో లేదా నెల రోజులకంటే ఎక్కువగా కానీ మొరం తవ్వకాలు జరపాలంటే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి పొందాలి. అంతకు ముందు భూగర్భశాఖ, కాలుష్య, నియంత్రణ, డీఎఫ్‌వో, సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్ అనుమతులు కూడా కోరాలి. వారు స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరం వారి ఆమోదంతోనే కలెక్టర్‌కు నివేదిక అందజేస్తారు. ప్రైవేటు భూముల్లో అయితే సంబంధిత పట్టాదారు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది.
ఏ అనుమతులు ఇవ్వలేదు
బాన్సువాడ శివారులో బోర్లం శివారు రోడ్డులో కొనసాగుతున్న తవ్వకాలకు ఎలాంటి ఇనుమతులు ఇవ్వలేదు. మొరం తవ్వకాలకు తప్పనిసరిగా అనుమతుల తీసుకోవాలి. తవ్వకాలపై నిఘా పెడతాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. – సుదర్శన్, తహసీల్దార్, బాన్సువాడ.

తవ్వకాలతో ఏర్పడిన గుంతలు
Comments
Please login to add a commentAdd a comment