సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్
నిజామాబాద్ సిటీ: జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు దుండగులుగా మారారు. రైలులో ప్రయాణికులను దోచుకుంటూ వచ్చిన సొత్తుతో జల్సాలకు అలవాటు పడ్డారు. చోరీలు చేస్తూ పోలీసుల చేతికి చిక్కి జైలుకు వెళ్లారు. జైలులో ముగ్గురు పరిచయమై ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతూ వచ్చారు. చోరీ సొత్తు విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. చోరీ సంఘటలకు సంబంధించి శుక్రవారం రైల్వే ఎస్పీ జీ. అశోక్‌కుమార్ నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్ రూరల్ రైల్వే డీఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి విలేకరులతో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్‌కు చెందిన బనావత్ నరేష్, మేడ్చల్ జిల్లా కేంద్రంలోని ఏకలవ్య కాలనీకి చెందిన సంతోష్‌కుమార్, సికింద్రాబాద్‌లోని లాలాగూడకు చెందిన గౌరికిషోర్ శాశంక్ వేర్వేరు చోరీల ఘటనలో శిక్షపడి జైలుకు వెళ్లారు. అక్కడ వారు స్నేహితులయ్యారు.
గత ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలైన ఈ ముగ్గురు వరుస చోరీలకు ప్రణాళికలు రచించుకున్నారు. రైలులో మహిళ ప్రయాణికులను దోచుకునేందుకు నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి రైలులో కిటికీల పక్కన కూర్చుని నిద్రపోయే మహిళలను, బాత్‌రూంకు వెళ్లే ప్రయాణికుల వస్తువులను చోరీ చేసేవారని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. నర్సాపూర్–నాగర్‌సోల్ రైలులో గత సెప్టెంబర్ 6న చిత్తూర్ జిల్లాకు చెందిన ఉటుకూరి గౌరి అనే మహిళ మెడలో నుంచి 9 తులాల బంగారు గొలుసులు, అక్టోబర్ 29న కృష్ణ జిల్లాకు చెందిన అక్కినేని ఉమాదేవి మెడలో నుంచి 5 తులాల గొలుసు, వివిధ రైలులో ఆగష్టు 31న కడం మారుతిరావు అనే ప్రయాణికుడి నుంచి రూ.35వేల నగదు, నవంబర్ 6న కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన పెరుమండ్ల లావణ్య నుంచి రూ.10వేలు, 19న మిర్జా షాహిద్ నుంచి రూ.1500, మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన హసీనాభాన్ నుంచి రూ. 2800లను చోరీ చేశారు.
మొత్తం వీటి విలువ రూ.4.25లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. రైలులో తరుచూ చోరీలపై ఫిర్యాదులు రావటంతో వీటిపై జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దుండగులపై నిఘా పెట్టారు. దుండగులు చోరీ చేసేందుకు నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 14 తులాల బంగారు గొలుసులు, రూ.11 వేలు నగదు, ఒక ట్యాబ్, 12 సెల్‌ఫోన్లు రికవరీ చేశామన్నారు.
నిందితులలో నరేష్‌పై 10 కేసులు నమోదు కాగా, మూడుసార్లు జైలుకు వెళ్లివచ్చాడని, సంతోష్‌కుమార్‌పై మూడు కేసులు, శశాంక్‌పై రెండు కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చోరీలను ఛేదించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు రివార్డులు ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో సికింద్రాబాద్ సర్కిల్ సీఐ ఎం.వెంకట్రాం నాయక్, నిజామాబాద్ రైల్వే ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్, కామారెడ్డి ఎస్‌ఐ తావునాయక్, ఆర్‌పీఎఫ్ సీఐ సరోజ్‌కుమార్, కానిస్టేబుళ్లు సీహెచ్ గురుదాస్, ఎండీ ఆరీఫుద్దీన్, టి. మహేందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment