డిచ్‌పల్లి: ఓ ప్రైవేటు బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు తన వద్దనున్న రూ.80 లక్షలు చోరీకి గురయ్యాయంటూ హైరానా సృష్టించారు. చివరికి చోరీకి గురైన ఆధారాలు లభ్యంకాకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేక పంపించివేశారు. డిచ్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయకూర్ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (నెంబరు సీజీ 04 ఎన్‌హెచ్ 5535) లో నాందేడ్ కు చెందిన ఓ ప్రయాణికుడు గురువారం తనవద్ద ఉన్న రూ.80లక్షలు చోరీకి గురైనట్లు మేడ్చల్ వద్ద గుర్తించాడు.
వెంటనే బస్సుతో సహా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు డబ్బులు ఎక్కడ పోయా యని ప్రశ్నించారు. ఇందల్వాయి వద్ద పో యి ఉంటాయని చెప్పడంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని పంపించారు. ప్రయాణికులతో పాటు బస్సును ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రయాణికులతో సహా లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేయగా డబ్బులు లభించలేదు. డిచ్‌పల్లి సర్కిల్ ఇనస్పెక్టర్ సూచన మేరకు బస్సును డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ విచారణ చేపట్టగా సుద్దపల్లి శివారులోని కంచెట్టి దాబా వద్ద టీ తాగామని అక్కడే డబ్బులు ఉన్న బ్యాగు చోరీ అయి ఉండవచ్చని బాధితుడు తెలిపాడు.
పోలీసులు వెంటనే హోటల్‌కి చేరుకుని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. కానీ అక్కడ బస్సులోని కొందరు ప్రయాణికులు కిందకు దిగారని, బాధితుడు అసలు బస్సు నుంచి కిందకు దిగలేదని తేలింది. తెలంగాణ– మహారాష్ట్ర బోర్డర్ లోని ఓ హోటల్ వద్ద భోజనం కోసం ఆగామని ఆ సమయంలో ఒకరితో గొడవ జరిగినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. దీంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించిన డిచ్‌పల్లి పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వెనక్కు పంపించి వేశారు.
Comments
Please login to add a commentAdd a comment