చద్మల్ గ్రామ పంచాయతీలో ఉంచిన నిందితుల బైక్‌లు
సాక్షి, నిజామాబాద్ : మండలంలోని చద్మల్ గ్రామంలోని ఓ ఇంట్లోకి ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో వారు పరార్ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు.. గ్రామనికి చెందిన దాసరి వెంకటి కుటుంబంతో కలిసి చద్మల్ మంచిప్ప రోడ్డు సమీపంలో రేకుల షెడ్డు వేసుకొని ఉంటున్నాడు. ఎండాకాలం కావడంతో ఆరు బయట నిద్రిస్తున్నారు. ఆ సమయంలో మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు దొంగలు నిద్రిస్తున్న వారి తల వద్ద ఉన్న సెల్‌పోన్‌ను దొంగిలించి ఇంట్లోకి చొరబడ్డారు.
వస్తువుల కోసం వెదుకుతుండగా చప్పుడుకు మేల్కొన్న కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులంతా మేల్కొని వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. దొంగలు వారి బైక్‌లను అక్కడే వదిలేసి పొలాల్లో నుంచి పారిపోయారు. సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి బైక్‌లను పంచాయతీలో భద్రపరిచి బైక్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించారు. సదరు బైక్‌లు నిర్మల్ జిల్లాకు చెందిన వారివిగా గుర్తించారు. సోమవారం ఉదయం బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్సై శంకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment