సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్): సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ నిండు ప్రాణం పోయింది. అప్పుల పాలైన ఓ వ్యక్తి.. పిల్లల కళ్లెదుటే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి ఉరేసుకున్నాడు. పిల్లలు వద్దు నాన్న అంటూ వేడుకుంటున్నా, వారిని అనాధలను చేసి వెళ్లి పోయాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన మంగళపల్లి లక్ష్మణ్ (42), లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉపాధి కోసం గతంలో కామారెడ్డికి వలస వెళ్లి, అక్కడే పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, భార్య లక్ష్మికి నాలుగు నెలల క్రితం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీరు లక్కీ డ్రాలో కోటి గెలుచుకున్నారంటూ నమ్మబలికారు.
ఈ నగదు మీరు అందుకోవాలంటే సర్వీస్ చార్జీలు చెల్లించాలని డబ్బు డిమాండ్ చేశారు. దీంతో దంపతులు విడతల వారీగా రూ.2.65 లక్షలు వారికి చెల్లించారు. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించారు. అయితే, అప్పులు పెరిగి పోవడం, మోసపోయామని లక్ష్మణ్ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న పోసానిపేటకు వెళ్లిన లక్ష్మణ్.. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానంటూ చెప్పాడు. ‘వద్దు నాన్న.. ఇంటికి రా నాన్న’ అంటూ కూతురు వేడుకుంటున్నా అతడు చలించలేదు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment