
బాధితులు ఎక్కువ.. ఫిర్యాదులు జీరో
పరువుపోతుందని ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు
ఎమ్మెల్యే వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన మోసగాళ్లు
కాల్ కట్ చేయడంతో బెదిరింపులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో పలువురు హనీ ట్రాప్(వలపు వల)లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏటా వందల మంది హనీ ట్రాప్ బారిన పడుతున్నారు. బ్లాక్‌మెయిలింగ్‌తో డబ్బుల వసూళ్లకు అలవాటుపడిన సైబర్ మోసగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. వీడియో కాల్ రాగానే అనుకోకుండా లిఫ్ట్ చేస్తే, స్క్రీన్ షాట్లు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్‌గా ఉన్న అమ్మాయితో వీడియో కాల్ చేయించి నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఆయన వెంటనే ఆ వీడియో కాల్ కట్ చేయడంతో అప్పటికే నేరగాళ్లు తీసిన స్క్రీన్‌షాట్‌ను ఎమ్మెల్యేకే పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకపోతే పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ వీడియో పంపిస్తామని బెదిరించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పరువు పోతుందనే భయంతో..
తెలియని ఫోన్ నెంబర్ల నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు అనుకోకుండా లిఫ్ట్ చేసి అనేక మంది తంటాలు పడుతున్నారు. నేరగాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, బంధువులు, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఈ సంఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదు. ఫిర్యాదు చేస్తే తమ పేరు బయటికి వస్తుందేమోనని, పరువుపోతుందని భయపడి ఫిర్యాదుకు వెనుకాడుతున్నారు. అడిగిన మేరకు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఇలాంటి సంఘటనలు 100 వరకు తమ దృష్టికి వచ్చాయని, అయితే ఫిర్యాదు చేసేందుకు మాత్రం వెనుకాడుతున్నారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. వీడియో ఫోన్ కాల్ రావడంతో అనుకోకుండా లిఫ్ట్ చేసి, అడిగినంత నేరగాళ్లకు ముట్టజెప్పి ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారు ఉన్నారని వెల్లడించారు.
అనేక రకాలుగా దోపిడీ..
తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ఓవైపు దోచుకుంటున్న సంఘటనలు అనేకం రిపోర్టు అవుతున్నాయి. వాటిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పంపించి వాటిని క్లిక్ చేయగానే ఫోన్‌ను హ్యాక్ చేసి, ఖాతాల్లోని డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. వీటికి తోడుగా న్యూడ్‌గా ఉండి వీడియో కాల్స్ చేసి, స్క్రీన్ షాట్లు తీసి, వాటినే బాధితులకు పంపించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి.
ప్రజల్లో అవగాహన పెరగాలనే ఫిర్యాదు..
సైబర్ నేరాలు, హనీ ట్రాప్, వీడియో కాల్స్ విషయంలో అమాయక ప్రజలు ఇబ్బందుల పాలు కావద్దనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేరస్తుల బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఇలాంటి సమస్యలు దూరమవుతాయి.
– ఎమ్మెల్యే వీరేశం
అప్రమత్తంగా ఉండాలి
వీడియో కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దు. సోషల్ మీడియా అకౌంట్లకు టూ స్టెప్ సెక్యూరిటీ, ప్రొపైల్, అకౌంట్ లాక్ వంటివి పెట్టుకోవాలి. అప్పుడు మీ ఫ్రెండ్స్ లిస్ట్ నేరగాళ్లకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు.
–సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ
Comments
Please login to add a commentAdd a comment