‘హనీట్రాప్‌’ కేసులో అన్నదమ్ముల అరెస్టు | Police Arrested Nizamabad Brothers In Honey Trap Case | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మార్చి

Published Fri, Nov 22 2019 10:05 AM | Last Updated on Fri, Nov 22 2019 10:05 AM

Police Arrested Nizamabad Brothers In Honey Trap Case - Sakshi

ఆశ భావి జీవితానికి శ్వాసనిస్తుంది. కానీ అత్యాశ మాత్రం చేటు తెస్తుంది. ఈ విష యం తెలిసినా కొందరు ఈజీ మనీ కోసం చట్ట విరుద్ధమార్గంలో పయనిస్తుంటారు. పోలీసుల కు చిక్కి కటకటాలపాలవుతున్నారు. అధిక డబ్బులకు ఆశపడి వేరే వ్యక్తుల పేరుతో సిమ్‌కార్డులను యాక్టివేట్‌ చేసి ఇతరులకు ఇచ్చిన పోల్కంపేటకు చెందిన అన్నదమ్ములిద్దరు పోలీసులకు చిక్కిన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.

సాక్షి, కామారెడ్డి: పోల్కంపేటలో మొబైల్‌ సిమ్‌కార్డుల అమ్మకాలతో పాటు బ్యాలెన్స్‌ రీచార్జీ చేసే మహ్మద్‌ వాహెద్‌ పాషా, మహ్మద్‌ అహ్మద్‌ పాషా సోదరులు అత్యాశకు పోయారు. మెదక్‌కు చెందిన నవీద్‌ పాషా వీరిని కలిసి, యాక్టివేట్‌ చేసిన సిమ్‌కార్డులు ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడంతో వారు అక్రమంగా ఇతరుల పేర్లతో సిమ్‌కార్డులను యాక్టివేట్‌ చేసి అతడికి అందించారు. ఇలా తీసుకున్న సిమ్‌కార్డులను నవీద్‌ పాషా.. హైదరాబాద్‌ చంద్రాయన్‌గుట్టలోని ఇస్మాయిల్‌నగర్‌లో నివసించే ఇమ్రాన్‌కు అందించేవాడు. అతడు వాటి ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మారుస్తూ అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసి హనీట్రాప్‌ కేసులో విచారణ చేసిన పోలీసులు.. సిమ్‌కార్డుల గుట్టు రట్టు చేశారు. పొల్కంపేట నుంచి సిమ్‌కార్డులు సరఫరా అయినట్లు గుర్తించిన పోలీసులు బుధవారమే మహ్మద్‌ వాహెద్‌ పాషా, మహ్మద్‌ అహ్మద్‌ పాషాలతోపాటు మెదక్‌కు చెందిన నవీద్‌ పాషాను అరెస్టు చేశారు.  

అధిక డబ్బులపై ఆశతో.. 
పోల్కంపేటలో సిమ్‌కార్డులు విక్రయిస్తూ, రీచార్జులు చేస్తూ జీవించే పాషా సోదరులు అత్యాశకు పోయి పోలీసులకు చిక్కారు. మహ్మద్‌ వాహెద్‌ పాషా, మహ్మద్‌ అహ్మద్‌ పాషా సోదరులు.. సిమ్‌కార్డులు విక్రయిస్తూ, మొబైల్‌ రీచార్జీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సిమ్‌కార్డుల అమ్మకాలు, రీచార్జీలతో పెద్దగా ఆదాయం రావడం లేదు. ఇదే సమయంలో వారికి మెదక్‌కు చెందిన నవీద్‌ పాషా పరిచయం అయ్యాడు. అతడు యాక్టివేట్‌ చేసిన ఒక్కో సిమ్‌ కార్డుకు వీరికి రూ. 300 వరకు ఇస్తానని ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాషా సోదరులు వేరే వ్యక్తుల పేర్లతో సిమ్‌కార్డులు యాక్టివేట్‌ చేసి ఇచ్చారు. తాము చేస్తున్నది తప్పని తెలిసినా డబ్బుల కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న పాషా సోదరులు చివరికి కటకటాలపాలయ్యారు. అంతర్జాతీయ కాల్స్‌కు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు సీరియస్‌ కేసుగా పరిగణిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన హనీట్రాప్‌ కేసుకు ఈ సిమ్‌కార్డులకు ముడిపడి ఉండడం మూలంగా పాషా సోదరులు ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు స్పష్టమవుతోంది.  

సిమ్‌కార్డు దందాలపై ఆరా.... 
పోల్కంపేటలో పాషా సోదరులు కొంత కాలం గా విక్రయించిన సిమ్‌కార్డుల గురించి హైదరాబాద్‌ పోలీసులు ఆరా తీశారు. ఏ నెట్‌వర్క్‌కు సంబంధించి ఎన్ని సిమ్‌ కార్డులు విక్రయించారు? స్థానికంగా ఎందరికి అమ్మారు? స్థానికుల పేర్లతో హైదరాబాద్‌కు ఎన్ని సిమ్‌కార్డులు పంపించారు? అన్న విషయాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అత్యాశకు పోయి పోలీసులకు చిక్కిన పాషా సోదరుల గురించి గ్రామంంలో చర్చించుకుంటున్నారు. ఇంతకాలం వారు గ్రామంలో సిమ్‌కార్డులు విక్రయిస్తూ బతుకుతున్నారనే అనుకున్నామని, కానీ వారు ఇంత పెద్ద కేసులో ఇరుక్కుంటారనుకోలేదని పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement