యువకుడి హత్య: తండ్రే హంతకుడు | Man Kills His Son In Nizamabad | Sakshi
Sakshi News home page

యువకుడి హత్య: తండ్రే హంతకుడు

Published Fri, Nov 22 2019 10:13 AM | Last Updated on Fri, Nov 22 2019 10:16 AM

Man Kills His Son In Nizamabad - Sakshi

మృతదేహం వద్ద పోలీసులు(ఫైల్‌) 

సాక్షి, కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన తౌఫిక్‌ అనే యువకుని హత్య కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడిని హత్య చేసింది కన్నతండ్రేనని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లా రోడ్డులోని గంజ్‌గేట్‌ వద్ద ఓ దుకాణం ముందు నిద్రిస్తున్న తౌఫిక్‌ (28) అనే యువకుడిని తలపై బండరాళ్లతో మోది హత్య చేసిన విషయం తెల్సిందే. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వృత్తిరీత్యా తౌఫిక్‌ హమాలీ పనిచేసేవాడు. తల్లిదండ్రులతో విబేధాల కారణంగా చాలాకాలంగా బతుకమ్మకుంట కాలనీలోని వారి ఇంటికి వెళ్లడం లేదు.

మద్యం తాగడం, గొడవలు పడడం లాంటి అనేక వ్యసనాలకు బానిసయ్యాడు. అతని తండ్రి మునీర్‌ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తౌఫిక్‌ తరచుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి డబ్బుల కోసం వేధించి, పలుమార్లు దాడి చేశాడు. అతని ప్రవర్తనతో విసుగు చెందిన తండ్రి మునీర్‌ కొడుకును హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. మద్యం తాగి గంజ్‌గేట్‌ వద్ద దుకాణం ముందర పడుకున్న తౌఫిక్‌ తలపై బండరాళ్లతో మోది అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసుల విచారణలో మునీర్‌ నేరం అంగీకరించినట్లు ఎస్సై గోవింద్‌ తెలిపారు.  

బైక్‌ కొనివ్వలేదని ఆత్మహత్య
బీబీపేట: అలాగే మరొ ‍యువకుడు తండ్రి బైక్‌ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బూరెంకి స్వామి (24) విద్యుత్‌ శాఖలో సీఎల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆయన తండ్రిని బైక్‌ కొనివ్వమని అడిగాడు. వరి కోతలు అయిన తర్వాత కొనిస్తా అని మందలించడంతో మనస్తాపం చెందిన స్వామి తన సొంత వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పశువుల కొట్టంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చీకటి పడినా స్వామి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద విగతజీవిగా కనిపించాడు. తండ్రి కాశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement