సూర్యాపేట : సన్న రకాలు.. ఈ బియ్యం కొనుగోలు చేశారంటే.. మరోమారు మా వద్దనే కొనుగోలు చేస్తారంటూ మాయమాటలు చెబుతూ కొందరు వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా కాలనీలు, వీధుల్లో కేకలు వేస్తూ సంచరిస్తున్నారు. సన్న రకం బియ్యం బహిరంగ మార్కెట్‌లో రూ.4400 కాగా.. తమ వద్ద రూ.3400 మాత్రమే అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. సన్న బియ్యాన్ని ఎలా గుర్తించాలని ప్రజలు అడగడమే ఆలస్యం.. వెంటనే సంచులు విప్పి సన్నబియ్యాన్ని చేతిలో పోసి అంటగడుతున్నారు. వారు వెళ్లిన క్షణాల్లోనే సంచులు విప్పి కొంచెం లోతుగా బస్తాలోకి చెయ్యి పెట్టి బియ్యం తీస్తే దొడ్డు బియ్యం దర్శనమిస్తున్నాయి.
అమాయకులను ఆసరాగా చేసుకుని..
సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యం విక్రయిస్తున్న వ్యాపారులు ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, దేవరకొండ పట్టణాల్లోకి దిగడమే ఆలస్యం.. అక్కడి అక్రమ వ్యాపారులను పరిచయం చేసుకుంటున్నారని సమాచారం. మాస్ కాలనీల పేర్లు తెలుసుకుని అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. సన్న బియ్యం రూ.3400 విక్రయించడం ఏంటని ప్రశ్నిస్తే.. తాము పెద్ద రైతులమని.. మార్కెట్‌లో నేరుగా విక్రయించే కంటే ఇలా విక్రయిస్తే తమకుకొద్దోగొప్పో లాభమంటూ బుకాయిస్తూ అమాయయకుల నుంచి దోచుకుంటున్నారు.తమపై నమ్మకం లేకపోతే మా ఫోన్ నంబర్లు కూడా తీసుకోండంటూ నంబర్లను కూడా ఇచ్చి వెళ్తున్నారు. కానీ ఆ నంబర్లు పనిచేయకపోవడంతో కంగుతింటున్నారు.
ఒక్కరిద్దరు వ్యాపారులు కలిసి..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులే ఇలాంటి అక్రమ వ్యాపారాలకు తెర తీశారని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే పరిస్థితులు లేకపోవడంతో వ్యాపారులు ఇక సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి మర ఆడిస్తున్నారు. అట్టిబియ్యాన్ని ఆటోలు, టాటా ఏసీల్లో వేసుకుని ముగ్గురు నలుగురు వ్యాపారులు కలిసి సన్న బియ్యం అంటూ విక్రయిస్తున్నారు. అయితే ఈ అక్రమ వ్యాపారంలో బడా వ్యాపారులు హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా పోలీసు, పౌరసరఫరాల శాఖ అధికారులు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేయకుండా ఎలా కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నారో.. అదే రీతిలో సన్న బియ్యం పేరుతో దొడ్డుబియ్యం అంటగడుతూ మోసగిస్తున్న వారిపై కన్నేసి కటకటాలకు పంపించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
సూర్యాపేట పట్టణంలోని 10వ వార్డు చర్చికంపౌండ్‌లో బాణోతు సునిత అనే మహిళ నివాసముంటోంది. అయితే వీరునివాసముంటున్న ప్రాంతానికి ముగ్గురు గుర్తుతెలియని వ్యాపారులు ఆటోలో బియ్యం బస్తాలు వేసుకుని సన్న రకం బియ్యం అంటూ కేకలు వేసుకుంటూ వచ్చారు. కాగా, సునిత సన్న బియ్యం కావడంతో క్వింటా బియ్యం రూ. 3400 వెచ్చించి కొనుగోలు చేశారు. ఇంట్లోకి తీసుకెళ్లినబియ్యం సంచులను విప్పి చూడగా.. పై భాగంలో సన్నగా.. కింది భాగంలో మొత్తం దొడ్డు బియ్యం ఉండడంతో ఒక్కసారిగా అవాక్కైపోయింది. చేసేదేమి లేక వెంటనే తేరుకున్న ఆమె మోసం చేసిన బియ్యం వ్యాపారులను వెతుక్కుంటూ చర్చికంపౌండ్ నుంచి సీతారాంపురం కాలనీకి చేరుకుంది. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో లబోదిబోమంది. ఇలా సునిత ఒక్కరే కాదు..జిల్లా వ్యాప్తంగా అమాయకులు మోసపోతున్నారు.
ఉదయం ఓ చోట.. సాయంత్రం మరో చోట
పీడీఎస్ బియ్యాన్ని మర ఆడించిన కొందరు అక్రమ వ్యాపారులు సన్న బియ్యం పేరుతో అమాయకులకు అంటగట్టేందుకు రోజుకో చోట ప్రత్యక్షమవుతున్నారు. కాగా ఇటీవల కాలంలో నల్లగొండ, దేవరకొండ పట్టణాల్లో వందలాది క్వింటాళ్ల విక్రయించామని ఎక్కడా కూడా తమ బియ్యం బాగోలేదని చెప్పిన వారు లేరంటూ తెలుపుతున్నారు. ఉదయం నల్లగొండలో ఉంటే సాయంత్రానికి భువనగిరి లేదా దేవరకొండ పట్టణాల్లోకి ప్రవేశిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. కానీ ఆ ఫిర్యాదులను పోలీసులు స్వీకరించినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment