Srungavarapu Kota: పీడీఎస్‌ బియ్యం మాయం..! | Srungavarapu Kota: PDS Rice, Red Gram Bags Missed From Warehouse | Sakshi
Sakshi News home page

Srungavarapu Kota: పీడీఎస్‌ బియ్యం మాయం..!

Published Tue, Jul 26 2022 7:24 PM | Last Updated on Tue, Jul 26 2022 7:24 PM

Srungavarapu Kota: PDS Rice, Red Gram Bags Missed From Warehouse - Sakshi

గొడౌన్‌లో బియ్యం నిల్వలు పరిశీలిస్తున్న జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ మీనాకుమారి

శృంగవరపుకోట (విజయనగరం జిల్లా): రేషన్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా వేల క్వింటాళ్ల బియ్యం, కందిపప్పును సరఫరా చేస్తుంది.. మూడు నాలుగు నెలలకు సరిపడా సరుకును గొడౌన్‌లలో నిల్వ ఉంచి... డిపోల వారీగా నెలనెలా పంపిణీ చేస్తుంది. వేలబస్తాల బియ్యం, కందిపప్పు కళ్లముందు కనిపించే సరికి గౌడౌన్‌ సిబ్బందిలోని అక్రమబుద్ధి బయటకొచ్చింది. ఏకంగా 1500 బియ్యం బస్తాలు, 50 బస్తాల కందిపప్పును మాయం చేశారు. బయట మార్కెట్‌లో విక్రయించి సొమ్ముచేసుకున్నారు. మూడు నెలలుగా సాగుతున్న ఈ తంతు బహిరంగం కావడంతో సరుకును సర్దుబాటుచేసే పనిలో ఎల్‌.కోటలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ సిబ్బంది నిమగ్నమయ్యారు. 

కొందరు అధికారుల సలహా మేరకు పొరుగు మండలాల్లో డీలర్లను పట్టుకుని బియ్యం కొనుగోలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట 750 బస్తాలు, ఆదివారం రాత్రి 190 బస్తాల బియ్యం గొడౌన్‌కు చేర్చారు. ఈ సరుకు అంతా డీలర్ల నుంచి పాత గోనెలు తెచ్చి సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. వేల క్వింటాళ్ల సరుకు నిల్వచేసే గొడౌన్‌లో సరుకు కనిపిస్తే చాలని సిబ్బంది ఆలోచిస్తున్నారు. ప్రతి బస్తాకు ఉన్న ట్యాగ్, లాట్‌ నంబర్, అలాట్‌మెంట్‌ వంటి వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప నిజం తేలదు. బస్తాలను లెక్కించి ‘అంతా బాగుంది’ అని సర్టిఫై చేస్తే దొంగలు జారిపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది. గతంలోనూ ఇదే తీరుగా పెద్ద ఎత్తున్న ఎం.ఎల్‌.ఎస్‌ పాయింట్‌ నుంచి సరుకు మాయం అయిన సంగతి తెలిసిందే. బియ్యం సర్దుబాటు చేస్తున్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ అధికారులకు కందిపప్పు సర్దుబాటు చేయడం తలకుమించిన భారంగా మారినట్టు తెలిసింది. 

ప్రభుత్వం సరఫరా చేసే సరుకును అమ్మేసి.. డబ్బులు పంచుకున్నంత సులభం కాదంటూ ఉద్యోగుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఇక్కడి ఉద్యోగుల అక్రమాల బాగోతం బయటపడుతుందన్నది రేషన్‌ లబ్ధిదారుల వాదన. గతంలోనూ ఎస్‌.కోట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన ఘటనలను గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం పేదల కడుపునింపేందుకు నాణ్యమైన రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తుంటే.. కొందరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడం తగదని బహిరంగంగా విమర్శిస్తున్నారు. డీఈఓ రాజేష్, అటెండర్‌ జోగుల వద్ద ప్రస్తావిస్తే నీళ్లు నములుతూ తప్పు జరగడం నిజమేనన్నారు.  

అధికారులు ఏమన్నారంటే..  
ఎస్‌.కోట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో జరిగిన గోల్‌మాల్‌ వ్యవహారంపై తహసీల్దార్‌ శ్రీనివాసరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా నాకు తెలియదు.. సీఎస్‌డీని సంప్రదించాలని సెలవిచ్చారు. సీఎస్‌డీటీ ఎన్‌వీవీఎస్‌ మూర్తిని ఫోన్‌లో వివరణ కోరగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు తనిఖీ చేయడం జిల్లా అధికారుల పని అంటూ సమాధానం దాటవేశారు. (క్లిక్‌: రామకోనేరుకు మహర్దశ)

గొడౌన్‌ సీజ్‌ 
ఎస్‌.కోట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం, కందిపప్పు నిల్వల్లో తేడాలున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ మీనా కుమారి గొడౌన్‌ను సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో తనిఖీ చేశారు. స్టాక్‌ రికార్డులు పరిశీలించారు. గొడౌన్‌లో నిల్వలను మూడు గంటల పాటు తనిఖీ చేశారు. స్టాక్‌లో తేడాలు ఉన్నట్టు నిర్ధారించారు. గొడౌన్‌ రికార్డులను స్వాధీనం చేసుకుని, గంట్యాడ సీఎస్‌డీటీ కె.ఇందిర, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి టి.నరసింహమూర్తి తదితరుల సమక్షంలో గొడౌన్‌ను తాత్కాలికంగా సీజ్‌ చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మీనాకుమారి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement