Civil Supplies Department officials
-
షావుకార్ల కక్కుర్తి!
బీఎండబ్ల్యూ, టయోటా, ఫార్చునర్, ఫోర్డ్స్, ఫోక్స్‌వ్యాగన్ తదితర విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న కుటుంబాల వద్ద అంత్యోదయ, బీపీఎల్ రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలు అనేక ఏళ్లుగా ప్రతినెల నిరుపేదలకు అందించే ఉచిత బియ్యం, రాగులు, జొన్నలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన కార్లు కలిగి నిబంధనలకు విరుద్ధంగా బీపీఎల్, అంత్యోదయ కార్డులతో బియ్యం తీసుకుంటున్న 12 వేల కుటుంబాలతో పాటు మరో 3.30 లక్షల కుటుంబాల రేషన్‌కార్డులను ఆహార పౌరసరçఫరాల శాఖ రదు చేసింది. బనశంకరి: రాష్ట్రంలో రేషన్‌కార్డులు పొందిన వేలాదికుటుంబాలు వైట్‌బోర్డు కారు ఉన్నట్లు ఆహార పౌరసరఫరాలశాఖకు సందేహం వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖను ఆశ్రయించిన పౌరసరఫరాల శాఖ... రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు కారు కొనుగోలు చేసి రిస్ట్రేషన్ చేయించిన వారి సమాచారం అందించాలని కోరింది. రవాణాశాఖ అందించిన సమాచారంతో రేషన్‌కార్డులకు అనుసంధానమైన ఆధార్‌కార్డును పరిశీలించగా 12,584 కుటుంబాలు కార్లు కలిగి ఉన్నప్పటికీ బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నట్లు వెలుగుచూసింది. అందులో కలబుర్గిలో ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ, బెంగళూరు గ్రామాంతర, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, కలబుర్గిలో టయోటా, ఫార్చునర్, చామరాజనగరలో ఫోర్డు, మండ్యలో ఎంజీ మోటార్, హాసనలో ఫోక్స్‌వ్యాగన్, చిక్కమగళూరులో మహింద్రజీప్ కలిగిన కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకున్నామని ఆహార పౌరసరఫరాలశాఖ తెలిపింది. కార్లు కలిగిన కార్డుదారుల సంఖ్య కార్లు కలిగిన కుటుంబాలు బీపీఎల్, అంత్యోదయ రేషన్‌కార్డులు తీసుకున్న వారి సమాచారం జిల్లాల వారిగా సేకరించారు. కలబుర్గిలో 2114, చిక్కమంగళూరులో 1912, బెంగళూరు1312, రామనగర 922, ఉత్తరకన్నడ 553, యాదగిరి 517,శివమొగ్గ 522, బీదర్ 554, బెంగళూరుగ్రామాంతర 547,బెంగళూరు పశి్చమ 485, తుమకూరు 307,చిక్కబళ్లాపుర 296,హావేరి 220, బాగల్కోటె 216,విజయపుర 214,బెంగళూరు ఉత్తర 201, మండ్య 137,దక్షిణకన్నడ 130, బళ్లారి 67, బెంగళూరు తూర్పు 89, చిత్రదుర్గ 43, దావణగెరె 62, ధారవాడ 15, గదగ 15, హాసన 86, కొడగు 21, కోలారు 65, కొప్పళ 29, మైసూరు 123, రాయచూరు 39, ఉడుపి 42 మంది నిబంధనలకు వ్యతిరేకంగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద రేషన్ కార్డులు: మానవవనరుల శాఖ నిర్వహణ వ్యవస్థ(హెచ్ఆర్ఎంఎస్) ఆయా శాఖల నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ మండలి, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల సమాచారం సేకరించింది. వారి ఆధార్‌కార్డులను పరిశీలించగా 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి రేషన్ కార్డులు తీసుకున్నట్లు తేలింది. వీరికి నోటీస్ జారీచేసి జరిమానా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. జిల్లాల వారీగా రద్దైన కార్డులు నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థ్దికంగా నిరుపేదలమని తీసుకున్న 3,30,024 రేషన్‌కార్డులను పౌరసరఫరాలశాఖ రద్దు చేసింది. వీటిలో అంత్యోదయ 21,679, బీపీఎల్ 3,08,345 బీపీఎల్‌కార్డులు ఉన్నాయి. కొన్ని కార్డులను ఏపీఎల్ గా మార్చారు. అత్యధిక రేషన్‌కార్డులు రద్దుకాబడిన జిల్లాల సమాచారం ఆధారంగా బెంగళూరు 34,705, విజయపుర 28,735, కలబుర్గి 16,945,బెళగావి 16,765, రాయచూరు 16,693, చిత్రదుర్గ 16,537 రేషన్‌కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలశాఖ తెలిపింది. (చదవండి: ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు) -
Srungavarapu Kota: పీడీఎస్ బియ్యం మాయం..!
శృంగవరపుకోట (విజయనగరం జిల్లా): రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా వేల క్వింటాళ్ల బియ్యం, కందిపప్పును సరఫరా చేస్తుంది.. మూడు నాలుగు నెలలకు సరిపడా సరుకును గొడౌన్లలో నిల్వ ఉంచి... డిపోల వారీగా నెలనెలా పంపిణీ చేస్తుంది. వేలబస్తాల బియ్యం, కందిపప్పు కళ్లముందు కనిపించే సరికి గౌడౌన్ సిబ్బందిలోని అక్రమబుద్ధి బయటకొచ్చింది. ఏకంగా 1500 బియ్యం బస్తాలు, 50 బస్తాల కందిపప్పును మాయం చేశారు. బయట మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకున్నారు. మూడు నెలలుగా సాగుతున్న ఈ తంతు బహిరంగం కావడంతో సరుకును సర్దుబాటుచేసే పనిలో ఎల్.కోటలోని ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది నిమగ్నమయ్యారు. కొందరు అధికారుల సలహా మేరకు పొరుగు మండలాల్లో డీలర్లను పట్టుకుని బియ్యం కొనుగోలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట 750 బస్తాలు, ఆదివారం రాత్రి 190 బస్తాల బియ్యం గొడౌన్‌కు చేర్చారు. ఈ సరుకు అంతా డీలర్ల నుంచి పాత గోనెలు తెచ్చి సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. వేల క్వింటాళ్ల సరుకు నిల్వచేసే గొడౌన్లో సరుకు కనిపిస్తే చాలని సిబ్బంది ఆలోచిస్తున్నారు. ప్రతి బస్తాకు ఉన్న ట్యాగ్, లాట్ నంబర్, అలాట్మెంట్ వంటి వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప నిజం తేలదు. బస్తాలను లెక్కించి ‘అంతా బాగుంది’ అని సర్టిఫై చేస్తే దొంగలు జారిపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది. గతంలోనూ ఇదే తీరుగా పెద్ద ఎత్తున్న ఎం.ఎల్.ఎస్ పాయింట్ నుంచి సరుకు మాయం అయిన సంగతి తెలిసిందే. బియ్యం సర్దుబాటు చేస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులకు కందిపప్పు సర్దుబాటు చేయడం తలకుమించిన భారంగా మారినట్టు తెలిసింది. ప్రభుత్వం సరఫరా చేసే సరుకును అమ్మేసి.. డబ్బులు పంచుకున్నంత సులభం కాదంటూ ఉద్యోగుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఇక్కడి ఉద్యోగుల అక్రమాల బాగోతం బయటపడుతుందన్నది రేషన్ లబ్ధిదారుల వాదన. గతంలోనూ ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన ఘటనలను గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం పేదల కడుపునింపేందుకు నాణ్యమైన రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంటే.. కొందరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడం తగదని బహిరంగంగా విమర్శిస్తున్నారు. డీఈఓ రాజేష్, అటెండర్ జోగుల వద్ద ప్రస్తావిస్తే నీళ్లు నములుతూ తప్పు జరగడం నిజమేనన్నారు. అధికారులు ఏమన్నారంటే.. ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన గోల్మాల్ వ్యవహారంపై తహసీల్దార్ శ్రీనివాసరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా నాకు తెలియదు.. సీఎస్‌డీని సంప్రదించాలని సెలవిచ్చారు. సీఎస్‌డీటీ ఎన్వీవీఎస్ మూర్తిని ఫోన్లో వివరణ కోరగా ఎంఎల్ఎస్ పాయింట్లు తనిఖీ చేయడం జిల్లా అధికారుల పని అంటూ సమాధానం దాటవేశారు. (క్లిక్: రామకోనేరుకు మహర్దశ) గొడౌన్ సీజ్ ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం, కందిపప్పు నిల్వల్లో తేడాలున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్ మీనా కుమారి గొడౌన్‌ను సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులు పరిశీలించారు. గొడౌన్లో నిల్వలను మూడు గంటల పాటు తనిఖీ చేశారు. స్టాక్‌లో తేడాలు ఉన్నట్టు నిర్ధారించారు. గొడౌన్ రికార్డులను స్వాధీనం చేసుకుని, గంట్యాడ సీఎస్‌డీటీ కె.ఇందిర, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి టి.నరసింహమూర్తి తదితరుల సమక్షంలో గొడౌన్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మీనాకుమారి చెప్పారు. -
ఈ-పాస్ మిషన్ల సమస్యలను పరిష్కరిస్తాం
డీఎస్ఓ తిప్పేనాయక్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్) : ప్రజాపంపిణీలో కీలకంగా మారిన ఈ-పాస్ మిషన్లలో ఏర్పడే సాంకేతిక సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తిప్పేనాయక్ తెలిపారు. ఇందుకోసం మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రైనర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు గురువారం సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో మొదలయ్యాయి. డీఎస్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి 5 మంది రెవెన్యూ సిబ్బందిని ఎంపిక చేసి వారికి ఈ-పాస్ మిషన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 8 మంది డీలర్లకు ఒక మాస్టర్ ట్రైనన్‌ను నియమిస్తున్నామన్నారు. ఈ-పాస్ మిషన్లలో ప్రధానంగా వేలిముద్రలు పడకపోవడం అనే సమస్య ఉందని, దీనికి తగిన పరిష్కారాన్ని చూపుతున్నట్లు తెలిపారు. అనంతరం అర్బన్ ఏఎస్ఓ వెంకటేష్ నాయక్ ఈ-పాస్ మిషన్లలో వచ్చే సమస్యలు, వాటి నివారణ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్ఓ రాజారఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
చవక చక్కెరకు అవినీతి చీమలు
► అధికారులు, కాంట్రాక్టర్లు, డీలర్ల కుమ్మక్కు ► ప్రతినెలా 200 మెట్రిక్ టన్నులు ► బ్లాక్‌మార్కెట్టుకు.. ఓ సీఎస్‌డీటీ కీలకపాత్ర! ► నష్టపోతున్న కార్డుదారులు అనంతపురం అర్బన్ : కార్డుదారుల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న చక్కెరను అవినీతి చీమలు పక్కదారి పట్టిస్తున్నాయి. కొంతమంది పౌరసరఫరాల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రేషన్ డీలర్లు కుమ్మక్కై.. బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తున్నారన్న విమర్శలున్నాయి. మరీ ముఖ్యంగా ఓ సీఎస్‌డీటీ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో దాదాపు 2,800 చౌక దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 11,53,713 రేషన్ కార్డులున్నాయి. ప్రతి కార్డుపై అర కిలో చొప్పున చక్కెరను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ లెక్కన జిల్లాకు ప్రతినెలా దాదాపు 512 మెట్రిక్ టన్నులు కేటాయిస్తోంది. ఇందులో దాదాపు 200 మెట్రిక్ టన్నుల చక్కెర బ్లాక్‌మార్కెట్టుకు తరలిపోతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో చక్కెరను రూ.30 నుంచి రూ.33 వరకు విక్రయిస్తున్నారు. అదే ప్రభుత్వం సబ్సిడీపై కిలో రూ.13.50లకే కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. ఈ చక్కెరను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు బ్లాక్మార్కెట్లో రూ. 22లకు విక్రయిస్తున్నారు. తద్వారా వారికి కిలోపై రూ.8.50లు మిగులుతోంది. కొట్టేస్తోందిలా.. : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్ చవక చక్కెరకు అవినీతి చీమలు డీలర్లు కార్డుదారులకు చక్కెరను విక్రయించాలి. అయితే.. జిల్లాలోని సుమారు 800 చౌక దుకాణాల్లో ఈ నిబంధనను పాటించడం లేదు. 5వ తేదీకే విక్రయాలు బంద్ చేస్తున్నారు. కొలతల్లో కూడా కొట్టేస్తున్నారు. ఇలా మిగిలిన చక్కెరను పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే జిల్లా నుంచి దాదాపు 1,50,000 మంది కార్డుదారులు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లారు. ఇది కూడా అక్రమార్కులకు కలిసొస్తోంది. ఆ ఐదు రోజులూ బిజీ.. చక్కెరను బ్లాక్‌మార్కెట్టుకు తరలించడంలో ఓ సీఎస్‌డీటీ ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా వలస వెళ్లిన కార్డుదారుల వివరాలను నేరుగా సేకరించుకుని... వారికి సంబంధించిన చక్కెరను గోదాముల నుంచే బ్లాక్‌మార్కెట్టుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. చక్కెర గోదాములకు చేరిన ఐదు రోజులూ ఆ సీఎస్‌డీటీ బిజీ అయిపోతారనే అపవాదు ఆ శాఖ సిబ్బంది నుంచే వినిపిస్తోంది. -
75 గ్యాస్ సిలిండర్ల పట్టివేత
పోచమ్మమైదాన్ : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పౌరసరఫరాలశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నగరంలోని తుమ్మలకుంటలో గల రావాటర్ ఫిల్టర్ బెడ్ దగ్గర శ్రీకాంత్ ఇంట్లో రెండు షట్టర్లలో గ్యాస్ సిలిండర్లు దిగినట్లు సోమవారం రాత్రి సమాచారం అందింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇంటి యజమాని శ్రీకాంత్‌ను గ్యాస్ సిలిండర్లపై ప్రశ్నించగా.. గ్యాస్ కంపెనీ ఆటోడ్రైవర్ ఆటో చెడిపోరుుందని షట్టర్లో సిలిండర్లు పెట్టి వెళ్లాడని తెలిపారు. వెంటనే అధికారులు రాత్రి ఆ రెండు షట్టర్లు సీజ్ చేశారు. మంగళవారం ఉదయం అధికారులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆటో డ్రైవర్ వచ్చాడా అని అడిగారు. రాలేదని, అతడి పేరు రమేష్ అని చెప్పారు. తాళాలు తీసే వ్యక్తిని పిలిపించి షట్టర్‌ను తీసి అందులోని 75 గ్యాస్(ఫుల్) సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీకాంత్, ఆటో డ్రైవర్ రమేష్‌పై 6(ఏ) కేసు నమోదు చేసి, సిలిండర్లను హన్మకొండ బాలాజీ గ్యాస్ ఏజెన్సీకి తరలించారు. ఈ సందర్బంగా సివిల్ సప్లయ్ డీటీ రత్నా వీరాచారి మాట్లాడుతూ రేషన్ సరుకులు, గ్యాస్ సిలిండర్లు అక్రమంగా తరలిస్తే టోల్ ఫ్రీ నం.18004251304కు ఫోన్ చేయాలన్నారు. దాడుల్లో ఏఎస్ఓ అనిల్‌కుమార్, హసన్‌పర్తి, వర్ధన్నపేట డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాసచారి, రాజ్‌కుమార్, వీఆర్ఓ విక్రమ్ పాల్గొన్నారు. కాగా, ఇంత భారీ మొత్తంలో గ్యాస్ సిలిండర్లు పట్టుబడటం ఇదే మొదటిసారి. ఈ రాకెట్ వెనుక గ్యాస్ ఏజెన్సీల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వారి హస్తం లేనిది ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ సిలెండర్లు సరఫరా కావు. ఇప్పటికైన పౌరసరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించి ఆక్రమ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
‘సాక్షి’ కథనంపై అధికారుల స్పందన సాక్షి, హైదరాబాద్: ధాన్యానికి మద్దతు ధరతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. ధాన్యానికి మద్దతు ధర లభిం చడం లేదని గురువారం సాక్షి పత్రికలో ‘ముద్దకు మద్దతేది ?’ అనే కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పౌరసరఫరాల కార్పొరేషన్ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుత సీజన్ రబీ ధాన్యన్ని కొనుగోలు చేయడానికి వీలుగా 2,018 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పామని, అవసరం అనుకుంటే మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు అవసరం అయ్యే 4.95 కోట్ల గోనె బస్తాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా 2.08 లక్షల మంది రైతుల నుంచి రూ.884 కోట్ల విలువ చేసే 7.90 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు. అలాగే మద్దతు ధరపై 18.75 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. కాగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి నిధులు విడుదల చేశామని సివిల్ సప్లయ్స్ అధికారి పేర్కొన్నా.. రైతులకు మాత్రం డబ్బు అందలేదు. సివిల్ సప్లయ్స్ నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 370 కోట్లు మంజూరు అయితే విడుదలైంది మాత్రం రూ. 309 కోట్లు మాత్రమే విడుదల అయినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి.