‘సాక్షి’ కథనంపై అధికారుల స్పందన
సాక్షి, హైదరాబాద్: ధాన్యానికి మద్దతు ధరతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. ధాన్యానికి మద్దతు ధర లభిం చడం లేదని గురువారం సాక్షి పత్రికలో ‘ముద్దకు మద్దతేది ?’ అనే కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పౌరసరఫరాల కార్పొరేషన్ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుత సీజన్ రబీ ధాన్యన్ని కొనుగోలు చేయడానికి వీలుగా 2,018 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పామని, అవసరం అనుకుంటే మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అందుకు అవసరం అయ్యే 4.95 కోట్ల గోనె బస్తాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా 2.08 లక్షల మంది రైతుల నుంచి రూ.884 కోట్ల విలువ చేసే 7.90 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు. అలాగే మద్దతు ధరపై 18.75 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసినట్టు ప్రకటించారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. కాగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి నిధులు విడుదల చేశామని సివిల్ సప్లయ్స్ అధికారి పేర్కొన్నా.. రైతులకు మాత్రం డబ్బు అందలేదు. సివిల్ సప్లయ్స్ నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 370 కోట్లు మంజూరు అయితే విడుదలైంది మాత్రం రూ. 309 కోట్లు మాత్రమే విడుదల అయినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
Published Fri, May 23 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement